మహబూబ్‌నగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : డిసెంబర్‌లోపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు, 90 టీఎంసీలకు వాళ్లమీద ఒత్తిడి తచ్చునా, కొట్లాడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్వోసీ తెచ్చే బాధ్యత నాది’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఉద్దండాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభ, భూత్పూర్ మండలం కరివెనలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ డిండి ప్రాజెక్టుకు 20-30 టీఎంసీలకు అనుమతి తెచ్చే బాధ్యత కూడా తనదేనని తెలిపారు. జూరాల దగ్గర కొత్త రిజర్వాయర్ కట్టుకొని, కర్ణాటక-మక్తల్ సరిహద్దులో బ్రిడ్జి కం బరాజ్‌లు, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, నారాయణపేట, మక్తల్ ఎత్తిపోతల పథకాలకు గ్రీన్ చానల్లో నిధులు ఇస్తానని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్వోసీ ఇస్తే బనకచర్లపై ఆలోచిస్తామంటూ చీకటి ఒప్పందాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పైగా అది తెలంగాణకు శుభవార్తగా అభివర్ణించారు. ‘గోదావరి నదీ జలాల్లో 968 టీఎంసీల వాటా మనకున్నది. ఆంధ్రాకు 516 టీఎంసీల వాటా ఉన్నది. కృష్ణానదిలో బచావో ట్రిబ్యూనల్ ఇష్యూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏ రాష్ర్టానికి ఎన్ని నీళ్లు అనేది ఇంకా అలాట్ కాలేదు.. కేసీఆర్ కృష్ణానదిలో 299 టీఎంసీలు మేం తీసుకుంటం.. 512 టీఎంసీలు మీరు తీసుకోండని మరణ శాసనం రాసిండు’ అని అబద్ధాలు చెప్పారు.
‘మనం వాడుకున్న తర్వాత సముద్రంలోపోయే నీళ్లే లెక్క.. అప్పుడు మిగిలిన దాని గురించి చర్చి స్తాం. ఏపీ వాళ్లు గోదావరి నుంచి తీసుకువచ్చి బనకచర్లలో పోసుకుంటరా? నల్లమల సాగర్‌లో పోసుకుంటరా? అనేది మన సమస్య కాదు’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘పక్కింట్లో కోడిని కోసుకున్నరా? కుందేలు కోసుకున్నరా.. మనకెందుకు? మనకు పప్పన్నం అన్న సక్కగుందా? లేదా చూసుకోవాలె..’ అని కోడికూర భాష్యం చెప్పారు. ‘పాలమూరు ప్రా జెక్టుకు నాటి ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేసింది.. పంపులలో లిఫ్ట్‌లకు ఇంత ఖర్చు పెడితే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురుస్తది కాబట్టి ఖర్చు చేసిండ్రు’ అని అభాండాలు వేశారు. ‘పంపులు, లిఫ్ట్లల్ల వేల కోట్ల రూపాయల కమీషన్లు కొల్లగొట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఎక్కడికక్కడ వదిలేసి పోయిండ్రు.. భూ సేకరణ కూడా చేయలేదు’ అని అబద్ధాలు వల్లెవేశారు. ‘17 ఏండ్లుగా రాజకీయ నాయకుడిగా పనిచేసినా జిల్లాలో పరిస్థితిపై పూర్తి అవగాహన వచ్చేందుకు రెండేండ్లయింది’ అంటూ అన అసమర్థతను బయటపెట్టుకున్నారు.
పదేండ్లలో కేసీఆర్ ప్రాజెక్టుల మీద చేసిన అప్పు, అసలు కలిపి మొత్తం రూ.84,503 కోట్లు కడితే మేం అధికారంలోకి వచ్చాక ఈ 30 నెలల్లో కేసీఆర్ చేసిన అప్పునకు మోయలేనంత భారం పడింది’ అని రేవంత్‌రెడ్డి మళ్లీ పాతపాటే పాడారు. ‘పాలమూరు అంచనా వ్యయం రూ.55 వేల కోట్లు.. వాళ్లు ఖర్చు చేసింది కేవలం రూ.27 వేల కోట్లు.. కనీసం సగం కూడా ఖర్చు చేయకుండా ప్రాజెక్టు 90 శాతం పూర్తయ్యిందని అబద్ధాలు చెప్తున్నరు.. కేవలం 45 నుంచి 47 శాతం ఖర్చుపెట్టి 90 శాతం పనులు ఎలా పూర్తి చేశారో నాకైతే తెల్వదు. ‘సంపులు, గోడలు కట్టుకోకుండా కరెంటు వైర్లు కొనుక్కుంటే ఇంట్లో లైట్లు వెలుగుతయా? ఎందుకు ఎలక్ట్రికల్ వర్కులు చేశారంటే దానిమీద 20 శాతం, 30 శాతం కమీషన్లు వస్తాయని వాటిని మొదలుపెట్టిండ్రు.
ప్రాజెక్టుల విషయంలో ముందుగా ఎలక్ట్రికల్ వర్క్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో తెల్వది’ అంటూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ‘మహారాష్ట్ర సీఎం చర్చలకు రమ్మంటే పారిపోతున్నడు. మర్యాదగా మహరాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పట్టుకురండి. లేదంటే బీజేపీ ఎంపీలను తరిమే రోజు వస్తది’ అని హెచ్చరించారు. ‘గోదావరి జలాల మీద తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి.. వంద టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి.. శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి రైతుల కష్టాలు తీర్చుతాం’ అని చెప్పారు. ‘నీళ్లంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు.. ప్రాజెక్టుల విషయంలో డైవర్షన్స్ స్కీమ్ మొదలుపెట్టిందని ఆరోపణలు ఉన్నాయి’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘కేసీఆర్ అంటే నీళ్లు అంటే నేను ఒప్పుకోను గానీ కేసీఆర్ అంటే సారా.. సోడా అంటే ఒప్పుకొంటా’ అని రేవంత్‌రెడ్డి బదులిచ్చారు. ‘కర్ణాటకలో కొత్త సీఎం వచ్చారు. ఇక్కడ మీ పదవీ కాలం మరో రెండేండ్లే ఉన్నది. కృష్ణాలో నీటివాటాకు ఎలా సమన్వయం చేసు కుంటారు?’ అని ఓ విలేకరి ప్రశ్నిచంగా రేవంత్‌రెడ్డి నోరు మెదపలేదు.