పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కలిపేసేందుకు యత్నిస్తోందని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ), వికారాబాద్ జిల్లా పరిధిలోని పలు పాలిటెక్నిక్ కళాశాలలు, ఐసీడీఎస్, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట, రహదారులపై గురువారం విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు.. మధురానగర్‌లోని ఐసీడీఎస్ కార్యాలయ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఇందిరాగాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. విద్యార్థులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వికారాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా బీఆర్ఎస్వీ నేతలు ధర్నాలు, నిరసనల్లో పాల్గొన్నారు. 97 జీవోను రద్దు చేయకుంటే విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
– సిటీబ్యూరో
వెంగళరావునగర్, ఆగస్టు 20: పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే నిర్ణయాలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్డూడెంట్స్ ఆర్గనైజేషన్(ఏఐడీస్ఓ) ఆధ్వర్యంలో గురువారం మధురానగర్‌లోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాంగణం ప్రధాన ద్వారం వద్ద సుమారు మూడు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలో చించుకోవాలని నినాదాలు చేశారు.

పాలిటెక్నిక్ కళాశాలలను ఇతర శాఖల పరిధిలోకి మార్చడం వల్ల సాంకేతిక విద్య ప్రత్యేకత దెబ్బతింటుందని ఏఐడీఎస్ఓ నాయకురాలు వైశాలి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు మౌలిక వసతులు,అధ్యాపకులు, సిబ్బంది కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త విధానాల పేరుతో విద్యావ్యవస్థను చెడగొట్టడం సరికాదన్నారు. లేబర్,ఎంప్లాయ్మెంట్,ఫ్యాక్టరీల విభాగాలను కొత్తగా ప్రతిపాదించిన శక్తి (స్కిల్,హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూషన్స్) శాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా ఐటీఐ, ఏటీసీలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్న నిర్ణయంపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

గతంలో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందే అవకాశం ఉండేదని, తాజా నిర్ణయంతో ఈ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విలీనం పేరుతో పాలిటెక్నిక్ విద్యను కేవలం నైపుణ్య శిక్షణకే పరిమితం చేస్తే విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడమే లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ,ఉన్నత విద్యకు థియరీ, అకాడమిక్ పరిజ్ఞానం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేవలం ప్రాక్టికల్ విద్యకు ప్రాధాన్యమిస్తే అకాడమిక్ పరంగా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.విద్యార్థులు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జీవో97ను వెంటనే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మధురానగర్ పోలీసు లు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అనంతరం మధురానగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ విద్యార్థులతో చర్చించి సముదాయించడంతో ఆందోళన విరమింపచేశారు.
మేడ్చల్ : జీవో 97ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాలకిరణ్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నికల్ విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న నూతన సవరణలో విద్యార్థుల భవిష్యత్‌కు శాపంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు నాని, స్వస్తిక్, ఎస్ఎఫ్ఐ నాయకులు వినయ్, చిరు, దత్తు ప్రసాద్, రాం, సురేశ్, దీప, దీక్షిత్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

బడంగ్పేట్ : ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల బంద్ విజయవంతమైంది. బడంగ్పేట్లో ఉన్న పాలిటెక్నిక్ మహిళా కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి గురువారం ఆందోళన చేపట్టారు. టీకేఆర్, టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలను బంద్ చేయించారు. విద్యార్థి సంఘాల నాయకులు వేణు, సుమంత్, కార్తీక్, మణికంఠ,అఖిల్ పాల్గొన్నారు.
రంగారెడ్డి,(నమస్తే తెలంగాణ) : జీవో 97ను రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ఆందోళన గురువారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మూడు రోజులుగా జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులు వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నారు. అందులో భాగంగానే గురువారం కూడా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఇందిరాగాందీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జీవో 97తో పేద విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యకు దూరమయ్యే ప్రమాదముందని ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఇప్పటికే పాలిటెక్నిక్ విద్యార్థులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అలాగే, జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనకు పలు విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం 97జీవోను రద్దుచేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

వికారాబాద్ : జీవో 97ను రద్దు చేయాలని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, ఆయా ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గురువారం వికారాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై వాహనాలు నిలిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుడు రాజేందర్‌గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు జంగయ్య తదితరులు మాట్లాడుతూ.. విద్యార్థులతో పెట్టుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రే తన పదవికి రాజీనామా చేశారనే.. అదే మాదిరిగా తెలంగాణ సర్కార్ కూడా స్టూడెంట్స్‌తో పెట్టుకుంటున్నదని ..దాని పర్యవసానం విద్యాశాఖ మంత్రి పదవికే కాదు రేవంత్‌రెడ్డి సీఎం పదవికీ రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
రామంతాపూర్ : సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి సీమ్‌కు వ్యతిరేకంగా రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, బీఆర్ఎస్వీ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ఉప్పల్ నేతలు గణేష్, నేత, హేమంత్ రెడ్డి, ఆసిఫ్, సోహైల్, నవీన్, రాజశేఖర్ పాల్గొన్నారు.
మెహిదీపట్నం : పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పరువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఆసీఫ్‌నగర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో అరెస్టయిన బీఆర్ఎస్వీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు నాంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్ ఆనంద్ గౌడ్, సీనియర్ నాయకులు ప్రదీప్ అగర్వాల్ ఆసీఫ్‌నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. విద్యార్థుల హక్కుల కోసం బీఆర్ఎస్వీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.