(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే రెండో అతి పెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్‌లో చక్కెర సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. బహిరంగ మార్కెట్లో నిల్వలు అంతకంతకూ పడిపోతుండటం, సరఫరా మందగించడంతో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఇప్పటికే నిత్యావసరాల ధరలతో కుదేలైన సామాన్యుడిపై మరో ఆర్థిక భారం చేరినట్లయ్యింది. కేంద్రం తీసుకొచ్చిన ‘ఇథనాల్-20 (ఈ20)’ పెట్రోల్ బ్లెండింగ్ నిర్ణయం కారణంగానే దేశంలో చక్కెర సంక్షోభం ముంచుకొచ్చిందంటూ నిపుణులు మండిపడుతున్నారు.
డిమాండ్‌కు సరిపడా చక్కెర సరఫరా లేకపోవడంతో దేశంలోని చాలా సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో ‘నో షుగర్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నిల్వలు కొంతమొత్తంలో ఉన్న ప్రాంతాల్లో చక్కెర ధర అమాంతం పెరిగింది. నిరుడు ఆగస్టులో చక్కెర ధర కిలో రూ.38గా ఉండేది. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.65కు చేరింది. ఇక, గడిచిన 17 రోజుల్లోనే కిలో చక్కెర ధర అనూహ్యంగా రూ.20 మేర పెరిగినట్టు వ్యాపారులు చెప్తున్నారు. రానున్న పండుగ సీజన్లో షుగర్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.
ఈ20 పేరిట ఇథనాల్ ఉత్పత్తికి చెరుకును కేంద్రం భారీగా మళ్లించడంతోనే దేశంలో చక్కెర సంక్షోభం తీవ్రమయ్యిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు, పండుగ సీజన్ రావడం, సరఫరా తగ్గడంతో కొందరు వ్యాపారులు నిల్వల్ని నియంత్రించడం తదితర కారణాలతో దేశంలో చక్కెరకు కొరత ఏర్పడినట్టు అభిప్రాయపడుతున్నారు. కాగా, చక్కెర సంక్షోభం నివారణకు కేంద్రం పలు కీలక చర్యలు చేపట్టింది.
నెలకు 10 మెట్రిక్ టన్నులకు మించి చక్కెరను విక్రయించే లేదా వినియోగించే పెద్ద వ్యాపారులు, పరిశ్రమలు ఇకపై తమ వద్ద 15 రోజులకు సరిపడా నిల్వను మాత్రమే ఉంచుకోవాలని పేర్కొంది. ఈ కొత్త నిబంధన వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు, పది లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ప్రతిపాదనలను కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్టు సమాచారం. పదేండ్ల తర్వాత భారత్ చక్కెర దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి.
ఇథనాల్ కోసం పెద్దమొత్తంలో చెరుకును మళ్లించడం వల్లే దేశంలో ఇప్పుడు చక్కెర సంక్షోభం నెలకొన్నది. సరిపడినంత నిల్వలు లేకపోవడంతో చక్కెర ధర అమాంతం పెరిగిపోయింది. ఇథనాల్ కోసం ఇలా చేయడం ఎంతమాత్రం సరైన చర్య కాదు.
-లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్, వ్యవసాయ శాస్త్రవేత్త సుధీర్ పన్వార్
కూడాయిల్ దిగుమతులు తగ్గించి తద్వారా విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవాలని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే చెరకును మళ్లించి ఇథనాల్-పెట్రోల్ బ్లెండింగ్‌కు తెరతీసింది. దీంతో దేశంలో చక్కెర కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. ఇప్పుడు అదే కేంద్రం మళ్లీ చక్కెరను దిగుమతి చేసుకోవాలనుకొంటున్నది. అంటే, విదేశీ కరెన్సీని ఖర్చు చేయాల్సిందేగా. నిరక్షరాస్యుల ఏలుబడిలో నడిచే ప్రభుత్వ నిర్ణయాలు ఇలాగే ఉంటాయి.
-ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్