హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నదని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నది. ఇది వారిద్దరికే పరిమితమైతే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. వారిద్దరి మధ్య 81 మంది ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు నలిగిపోతున్నారు. దాదాపు 8నెలలుగా జీతాలు అందక సతమతం అవుతున్నారు. శాఖలో కొత్తగా ఏ పని చేపట్టాలన్నా, ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నా ఇంజినీర్లు జంకుతున్నారు. ఇరిగేషన్‌శాఖలో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ తదితర వివిధ విభాగాలున్నాయి. ఆయా విభాగాల అవసరాల మేరకు ఇంజినీర్లను వివిధ ప్రాంతాల్లో, ప్రాజెక్టుల్లో వినియోగించుకునే అవకాశం ఉన్నది. ప్రాజెక్టులను బట్టి ఇంజినీర్లు, నిపుణుల అవసరాన్ని బట్టి బదిలీలు చేస్తుంటారు. ఈ మేరకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం 2016లోనే జీవో 12ను విడుదల చేసింది. అప్పటి నుంచి అవసరాలరీత్యా ఇంజినీర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. నిరుటి వరకూ అంతా సజావుగానే సాగింది. కానీ ఆర్థికశాఖ కొన్ని నెలలుగా కొర్రీలు పెడుతున్నదని, జీతాలు నిలిపివేస్తున్నదని ఇంజినీర్లు వాపోతున్నారు. ఇరిగేషన్‌శాఖలో ఇటీవల పలువురు సీనియర్లు విరమణ పొందారు.
కీలకస్థానాలు ఖాళీ కావడంతో క్షేత్రస్థాయి అవసరాల రీత్యా ఎస్ఈలు, ఈఈలు, డీఈఈలు కలిపి మొత్తం 81 మంది వరకు ఇంజినీర్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. కానీ.. వారికి జీతాలు ఇచ్చేందుకు ఫైనాన్స్‌శాఖ మోకాలడ్డుతున్నది. కారణం అడిగితే బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఎలా బదిలీ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్తున్నారని వాపోతున్నారు. వాస్తవంగా ప్రభుత్వం నిరుడు వర్షాకాలం ఆరంభంలో శాఖాపరమైన బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ సమయంలో బదిలీలు చేస్తే వర్షాలు, వరద నిర్వహణలో తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని ఇరిగేషన్‌శాఖను ప్రభుత్వం మినహాయించింది. ఆ తర్వాతే అవసరాల మేరకు జీవో 12 ప్రకారం 81మందిని బదిలీ చేసింది. ఇదే విషయాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు ఆర్థికశాఖకు స్పష్టంగా వివరిస్తున్నారు. జీతాలను విడుదల చేయాలని అనేకసార్లు లేఖలు రాశారు. అయినా ఆర్థికశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధమంటూ 8నెలలుగా జీతాలు విడుదల చేయడం లేదని చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇరిగేషన్‌శాఖలో అనేక ఖాళీలు ఏర్పడ్డాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), చీఫ్ ఇంజినీర్ (సీఈ), సూపరింటెండెంట్ (ఎస్ఈ) స్థాయి వరకు పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీ అయ్యాయి. 22 సీఈ పోస్టులుండగా, ఇప్పటికే 18మంది అంటే దాదాపు సగానికిపైగా సీఈలు ఉద్యోగ విరమణ పొందారు. మిగతా వారు కూడా అక్టోబర్ నాటికి విరమణ పొందనున్నారు. దీంతోపాటు 59 ఎస్ఈ పోస్టులు, అనేకసర్కిళ్లలో పదుల సంఖ్యలో ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రమోషన్లు కల్పించి ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య పొసగకపోవడమే కారణమని జలసౌధవర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ప్రమోషన్లు కల్పించేందుకు కమిటీ ఏర్పాటుచేశారు. సినీయార్టీ జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి చేస్తామని జనవరిలోనే మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా అతీగతి లేకుండా పోయింది. సీఎం ఆమోదం లేకపోవడంతో ఫైలు ముందుకు కదలడం లేదని సమాచారం. దీంతో ఇన్చార్జీలు, ఇతరులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తున్నారు.
ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్‌పై ప్రభుత్వం ఇటీవల వేటువేసింది. వాస్తవంగా ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకు మేడిగడ్డ బరాజ్‌పై స్టడీ, రక్షణ చర్యలను చేపట్టేందుకు ప్రభుత్వమే ఈఎన్సీ అనిల్‌కుమార్ నేతృత్వంలో కమిటీని నియమించింది. బరాజ్‌ల రక్షణ కోసమే మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లో ఏర్పడిన బొయ్యారాన్ని ఈఎన్సీ అనిల్‌కుమార్ గ్రౌటింగ్ చేయించారు. మరోవైపు ప్రభుత్వం గాయత్రి పంప్‌హౌజ్‌లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్‌ను బదిలీ చేసింది. పంప్‌హౌజ్ పనితీరుపై పూర్తి అవగాహన ఉండటం, అక్కడి అవసరాల రీత్యా ఆ ఇంజినీర్‌ను అక్కడే ఉంచాలని ఈఎన్సీ అనిల్‌కుమార్ మంత్రితోపాటు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సమ్మతితోనే బదిలీని పెండింగ్‌లో పెట్టించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇటీవల గ్రౌటింగ్ చేయించడం, బదిలీని ఆపడాన్ని కారణాలుగా చూపి, ఈఎన్సీ అనిల్‌కుమార్‌ను తప్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి చెప్పినా వినకుండా, సీఎం పట్టుబట్టి మరీ ఈఎన్సీని తప్పించారని చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ అనిల్‌కుమార్‌కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. మంత్రి ఉత్తమ్‌కు ఈఎన్సీ అనిల్‌కుమార్ సన్నిహితంగా మెలిగారనే కారణంతోనే ముఖ్యమ్ంరత్రి రేవంత్‌రెడ్డి కావాలనే వేటు వేయించారని, పోస్టింగ్ ఇవ్వలేదని జలసౌధఇంజినీరింగ్ అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రమోషన్లు, బదిలీలే కాదు ఇరిగేషన్‌శాఖకు సంబంధించి మంత్రి ఉత్తమ్ ఏ ఆదేశాలు జారీచేసినా అమలుకావడం లేదని చెప్పుకుంటున్నారు. అధికారులెవరూ ఆయనకు సహకరించడం లేదని, సీఎం కనుసన్నల్లోనే పూర్తి వ్యవహారాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నది. సీతారామ ప్రాజెక్టు టెండర్లను ఖరారు చేయాలని మంత్రి నిరుడు ఆదేశించినా ఇప్పటికీ అవి ఫైనల్ కాలేదని, పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేపట్టేందుకు నిధులను మంజూరుచేయాలని మంత్రి కోరుతున్నా ప్రభుత్వం రూపాయి కూడా విదల్చడం లేదని ఉదహరిస్తున్నారు. తన ఆదేశాలు ఎందుకు అమలుచేయడం లేదని ఉన్నతాధికారులపై మంత్రి ఉత్తమ్ పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తున్నారని, దీనిని బట్టే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీర్ల జీతాల అంశాన్ని అధికారులు రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా అనేకసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల మంత్రి స్వయంగా జీతాల ఫైల్‌ను ముఖ్యమంత్రికి పంపించారని సమాచారం. మూడోసారి కూడా ఫైల్‌ను తిరస్కరించినట్టు శాఖ వర్గాలు తెలిపాయి. మంత్రి ఉత్తమ్‌తో ఉన్న విభేదాల కారణంగానే జీతాల ఫైల్‌ను సీఎం తిరస్కరిస్తున్నారని ఇరిగేషన్ శాఖలో చర్చ జరుగుతున్నది. ఇద్దరి మధ్య తాము నలిగిపోతున్నామని అధికారులు, ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.