Revanth Reddy | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అధిష్ఠానంతో సంబంధాలు పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారా?, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మంత్రులతో సఖ్యత పెంచుకునేందుకు తండ్లాడుతున్నారా?, ఒకేసారి అటు అధిష్ఠానంతో, ఇటు రాష్ట్ర నేతలతో వైరం వద్దనుకొని ‘మచ్చిక’ మంత్రం జపిస్తున్నారా?.. ఈ ప్రశ్నలన్నింటికీ కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. బుధవారం జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మూడు రోజులున్నా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి.
మరోవైపు మంత్రులు సీఎంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో రేవంత్‌రెడ్డికి తన పరిస్థితి అర్థమైందని, ఒకేసారి అటు అధిష్ఠానంతో, ఇటు రాష్ట్ర నేతలతో వైరం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే రాష్ట్ర నేతలను మచ్చిక చేసుకునేందుకు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులకు, ముఖ్యనేతలకు సీఎం విందు ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
విందు విషయం మంత్రులకు బుధవారం ఉదయమే చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎవరు ఎక్కడున్నా రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పర్యటనలో ఉండగా, ఆయన రోడ్డు మార్గంలో వస్తే ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను పంపారు. ఈ విషయాన్ని భట్టి స్వయంగా వెల్లడించారు. సీఎం ఆహ్వానంతో మంత్రులంతా విందుకు హాజరయ్యారు. దాదాపు రాత్రి 7 గంటల ప్రారంభమైన విందు తెల్లవారుజామున 1:30 గంటల వరకు జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అతిథులంతా వెళ్లిపోయేసరికి 2 గంటలు దాటిందని సమాచారం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నది. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు తన మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయలేదు. కనీసం అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. పైగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా మంత్రులతో దూరం పెరిగిందన్న ప్రచారం ఉన్నది. ముఖ్యంగా సీనియర్ మంత్రులు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధిష్ఠానం పెద్దలు తనను దూరం పెడుతున్నారని సీఎంకు అర్థమైందని, ఈ సమయంలో మంత్రులతో వైరం పెరిగితే అసలుకే మోసం వస్తుందని గ్రహించి, వారితో సర్దుకు పోవాలనే ఆలోచనకు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
మంత్రులను బుజ్జగించేందుకు ‘డిన్నర్ మీట్’ను వేదికగా చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. విందులో ఆయన మంత్రులందరితో కలుపుగోలుగా మెదిలారని, తన మనసులోని పలు అంశాలను పంచుకున్నారని ఇచ్చారని చెప్తున్నారు. ఇతర నేతలు వెళ్లిపోయిన తర్వాత ఒక్కో మంత్రితో సీఎం ప్రత్యేకంగా చర్చించారని, సీనియర్ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను సీఎం ముందు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారని, సీనియర్లను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, అధికారులను బదిలీ చేయడంపై ప్రశ్నించారని చర్చ జరుగుతున్నది. దీంతో గతాన్ని మరిచిపోయి, ఇకపై అందరం కలిసి పని చేసుకుందామని సీఎం సంకేతాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.