హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. గోల్కొండ కోటలో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకలకు హాజరైన ఆయన జెండావిష్కరణ తర్వాత మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతుంటే.. సీఎం మాత్రం ఏకంగా 11 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్టు ప్రకటించారు.
యాజమాన్యాల ప్రమేయం లేకుండానే ప్రతి విద్యా సంవత్సరం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేసే విధానం తెచ్చినట్టు చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1,000 కోట్లు కేటాయించామని చెప్పిన ముఖ్యమంత్రి, నిధుల మంజూరు విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లనే కాంగ్రెస్ సర్కార్ భర్తీ చేయగా.. మరోసారి ప్రభుత్వ శాఖల్లో 72 వేలకు పైగా ఉద్యోగ నియమాకాలు పూర్తిచేసినట్టు చెప్పడం విస్తు గొలుపుతున్నది.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపిన సీఎం, ఆరోగ్యశ్రీ బకాయిలు సుమారు రూ.1,800 కోట్ల చెల్లింపు విషయాన్ని దాటవేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లను రెండున్నరేండ్లు పూర్తయినా సిద్ధం చేస్తున్నామనే చెప్పడం ఆరోగ్య రంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నామని, దీంతో రేషన్ పంపిణీలో పాదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతామని సీఎం రేవంత్ చెబుతుండగా.. కార్డుల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెలలుగా జీతాలు రాక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఒకటో తారీఖునే జీతాలిస్తున్నట్టు చెప్పడం గమనార్హం. రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు చెల్లించాలని ఆందోళనలు చేపడుతుంటే దశల వారీగా బిల్లులు చెల్లిస్తున్నట్టు సీఎం చెప్పుకొచ్చారు. గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని సీఎం తెలిపారు. వాస్తవానికి 70 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు.