Banks : సెప్టెంబర్ 27, ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ బ్యాంకులు పని చేస్తాయి. పీఎస్బీ (పబ్లిక్ సెక్టార్ బ్యాంకు)లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆదివారం పని చేస్తాయని ఆర్బీఐ, కేంద్రం తెలిపాయి. సెలవు రోజు పని చేయడానికి కారణం.. సోమవారం సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగబోతున్నారు. దీంతో బ్యాంకు వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో ఆదివారం కూడా బ్యాంకులు పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీనికి ఆర్బీఐ కూడా అంగీకారం తెలిపింది. అయితే, ఈ నిర్ణయం ప్రైవేటు బ్యాంకులకు వర్తించదు. ఈ విషయంలో బ్యాంకులు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ)తోపాటు నాబార్డ్ సంస్థలకు కూడా కేంద్ర నిర్ణయం వర్తిస్తుంది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఎస్బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్లు పని చేస్తాయి.
పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా ఆదివారం పని చేస్తాయి. వరుసగా బ్యాంకు సెలవుల నేపథ్యంలో ఏటీఎంలు నిరంతరం పని చేసేలా చూడాలని, అలాగే బ్యాంకుల్లో తగినంత నగదు అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఆదేశించింది. మరోవైపు ఎస్బీఐ ఏటీఎం లావాదేవీలపై చార్జీలను రద్దు చేసింది. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చని కారణంగా బ్యాంకు సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు.