The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం.. తాజాగా మరో కీలక మైలురాయిని అందుకుంది. ఇప్పటికే నాని కెరీర్లో వేగంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన సినిమాగా నిలిచిన ‘ది ప్యారడైజ్’.. మూడు రోజుల్లోనే రూ.136 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సినిమా మూడు రోజుల బాక్సాఫీస్ వసూళ్లకు సంబంధించిన వివరాలను మేకర్స్ తాజాగా పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.136 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించారు. మూడో రోజు సుమారు రూ.22 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ఈ లెక్కల ద్వారా తెలుస్తోంది.
రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ.. అది పెద్దగా ప్రభావం చూపలేదని ట్రేడ్ వర్గాల అంచనా. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో సినిమాకు వస్తున్న స్పందనతో వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కూడా మూడో రోజు స్థాయిలోనే వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే సినిమా త్వరలోనే రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌కు చేరువయ్యే అవకాశముంది. మరోవైపు నాలుగో రోజు గంటల వారీగా నమోదవుతున్న బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సోమవారం నుంచి మొదలయ్యే ఎంత వసూళ్లు రాబడుతుంది అనే దానిపై ఉంది. వారాంతపు జోరును కొనసాగిస్తూ సినిమా స్థిరమైన వసూళ్లను సాధిస్తుందా? లేక వసూళ్లలో గణనీయమైన డ్రాప్ కనిపిస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
‘ది ప్యారడైజ్’ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. నాని సరసన కాయదు లోహర్ నటించగా.. మంచు మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు సామాజిక అంశాలను కూడా దర్శకుడు కథలో భాగంగా చూపించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న వసూళ్లతో నాని కెరీర్లో మరో ముఖ్యమైన చిత్రంగా నిలుస్తోంది.