బంజారాహిల్స్, అక్టోబర్ 24: అది జీహెచ్ఎంసీ పరిధిలోని వందలాది పార్కుల్లో ఒకటి. కేవలం ఎకరాన్నర విస్తీర్ణంలో ఉంటుంది. దాంట్లో రూ.కోటిన్నరతో చేపట్టిన సుందీరకణ పనులను ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అకస్మాత్తుగా పరిశీలించారు. ఈ చిన్న పనిని సీఎం పరిశీలించడం ఏమిటా అని స్థానికులు ఆరా తీయగా పార్కు పక్కనే సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన భవనం ఉన్నది. దీంతో బన్నీ అభిమానుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నం.45లోని రద్దీ రోడ్డుపై శుక్రవారం ఉన్నట్టుండి సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ఆగింది. వెంటనే అక్కడున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏం జరిగిందో? అనుకుంటూ సీఎం వాహనం వద్దకు చేరుకున్నారు. వాహనం నుంచి దిగిన సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు పక్కన ఉన్న జీహెచ్ఎంసీ పార్కులోకి వెళ్లారు.
భద్రతా సిబ్బంది సైతం సీఎం వెంట పరుగులు తీశారు. రూ.1.60 కోట్లతో మూడు నెలలుగా కొనసాగుతున్న పార్కు సుందరీకరణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ మొక్కలు నాటుతున్న కూలీలతో మాట్లాడారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిన్‌రెడ్డి తదితరులతో కలిసి పార్కు మొత్తం కలియదిరిగారు. సుమారు ఎకరాన్నర విస్తీర్ణంలోని జీహెచ్ఎంసీ పార్కులో చేపట్టిన పనులను అధికారులకు తెలియకుండా సీఎం అకస్మికంగా తనిఖీ చేయడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో వందలాది పార్కులున్నాయి. వాటిలో సుందీరకణ పనులు సర్వసాధారణం. ఈ పనులను స్థానిక కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. కానీ, ఏకంగా సీఎం వచ్చి పార్కు పనులు పరిశీలించడం వెనుక మర్మమేంటని సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభమయ్యాయి.
సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించిన పార్కును అనుకుని టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన అల్లు బిజినెస్ పార్కు భవనం ఉండటం విశేషం. ఈ భవనంలో గీతా ఆర్ట్స్ కార్యాలయాలతో పాటు అల్లు ఆర్ట్స్‌కు సంబంధించిన వ్యాపారాలు, ఇతర సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 1,226 గజాల స్థలంలో ఉన్న ఈ భవనానికి రెండు సెల్లార్లతో పాటు జీ ప్లస్ 4 అనుమతి ఉండగా ఇటీవల నాలుగో అంతస్తుపై నిర్మాణం చేపట్టారు. ఇది అక్రమ నిర్మాణమంటూ జీహెచ్ఎంసీ సర్కిల్-18 డీఎంసీ సమ్మయ్య నెలన్నర క్రితం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ లో భాగంగా అల్లు బిజినెస్ సెంటర్‌కు చెందిన కొన్ని నిర్మాణాలు జీహెచ్ఎంసీ పార్కు గోడను అనుకుని, సెట్‌బ్యాక్ లేకుండా ఉన్నాయా? అన్న విషయంలో సీఎం ఆరా తీసినట్టు తెలుస్తున్నది. దీంతో బన్నీ అభిమానుల్లో అనుమానాలు నెలకొన్నాయి.
పుష్ప-2 సినిమా విడుదల సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట, కాంగ్రెస్ యువజన విభాగం కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిమీద దాడి చేయడం, అనంతరం అల్లు అర్జున్ అరెస్ట్ తదితర అంశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సద్దుమణిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో ఇటీవల ఓ అవార్డుల ఫంక్షన్లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్ చెప్పడంతో మరోసారి వివాదం రాజుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45లోని అల్లు అర్జున్ కుటుంబానికి సంబంధించిన భవనం పక్కనున్న జీహెచ్ఎంసీ పార్కు పనులను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించడంపై సోషల్‌మీడియాలో హాట్ టాపిక్ నడుస్తున్నది.