హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చావు భాష తప్ప మంచి భాష రావడం లేదు. సోమవారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన సీఎం మరోసారి శవరాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీని శవంతో పోల్చి కుసంస్కారం చాటుకున్నారు. తద్వారా సీఎం రేవంత్‌రెడ్డి రాక్షసానందం పొందారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి రోత కూతలు కూశారు. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే తనకేం లాభమంటూనే, ఆయనకు చెడు జరుగాలని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం స్పందించారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావుపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిందని, ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు. లేదంటే ప్రభుత్వం తరఫున కార్యాచరణ చేపడుతామని, తాను, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తామని తెలిపారు.