మెదక్, మే 10 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా సీఎం రేవంత్‌రెడ్డికి కనికరం లేకుండా పోయిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లే కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి సందర్శించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలుపై ముఖ్యమంత్రికి, మంత్రులకు అసలు పట్టింపే లేదని మండిపడ్డారు.
పౌరసరఫరాల సంస్థ అవినీతి వల్లే రైతులు బలైపోతున్నారని ఆరోపించారు. కేంద్రాల్లో కొనుగోలులో తీవ్ర జాప్యం కారణంగా రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. వానకు తడిసిన వడ్లను పరిశీలించేందుకు మంత్రులు సైతం రావడం లేదని ధ్వజమెత్తారు. వడ్లు కొనుగోలులో రేవంత్ సర్కార్ దారుణంగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితులు చాలా దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులైనా ఇప్పుటివరకు కేవలం రెండే లారీలు వచ్చినట్టు రైతులు చెప్తున్నారని తెలిపారు.
పది రోజులకో లారీ వస్తే వడ్లన్నీ ఎప్పుడు కొంటరని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వర్షాలకు వడ్లు తడిసి మళ్లీ ఆరబెట్టినా కొనలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని తెలిపారు. ‘రేవంత్‌రెడ్డి ఇంతవరకు వడ్ల కొనుగోలుపై ఒక్క రోజైనా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టారా? మీ మంత్రులతో ఒక్క మీటింగ్ అయినా నిర్వహించారా?’ అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పోవడం.. హైదరాబాద్‌కు రావడం తప్ప వేరే పనే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు కష్టాలు పడుతున్నా సర్కార్ స్పందించడం లేదని విమర్శించారు.
ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాల్లో ట్వీట్లు చేస్తే పోలీసు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని, అయితే రైతుల బాధలపై ఇంటెలిజెన్స్ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నివేదికలు ఇవ్వడం లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మక్కలు, శనగలు, సన్ ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పుటి వరకు రూపాయి వేయలేదని అన్నారు. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదని, 35 రోజుల నుంచి వేరుశనగ కొనుగోళ్లు ఆగిపోయాని దుయ్యబట్టారు. కుప్పల కింద పంటకు చెదలు పడుతున్నా ప్రభుత్వం కనికరం చూపడం లేదని విమర్శించారు.
సివిల్ సైప్లెస్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి వల్లే నేడు అది దివాలా తీసిందని అన్నారు. ఆ సంస్థ ఎన్పీఏ కావడంతో బ్యాంకులు అప్పులివ్వడం లేదని తెలిపారు. ప్రభుత్వం దొడ్డిదారిన కోఆపరేటివ్ బ్యాంకు నుంచి మార్క్‌ఫెడ్‌కు అక్కడి నుంచి సివిల్ సైప్లెస్ సంస్థకు డబ్బులు మళ్లించారని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, తప్పులకు రైతులను బలిచేశారని మండిపడ్డారు. రేషన్ షాపుల్లో ఏండ్ల తరబడి నిల్వ ఉన్న సుమారు రూ.500 కోట్ల విలువైన దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. సకాలంలో వడ్లు కొనకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నాయకులంతా కలెక్టరేట్లను ముట్టడిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుపై ఏ ఒక్క మంత్రీ ఇప్పటివరకు సమీక్ష చేయలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు పరిష్కరించడంలో విఫలయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతులంటే లెక్క లేదని, పట్టింపూ లేదని అన్నారు. మంత్రి ఉత్తమ్ ఏసీ గదుల్లో కూర్చుని అబద్ధ్దాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి ఉత్తమ్ ఒక్కసారి పోలీసులు లేకుండా కొనుగోలు కేంద్రాలు తిరిగితే రైతుల కన్నీళ్లు, కష్టాలు ఏంటో అర్థమవుతాయని అన్నారు.