నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ ( Narsapur) నియోజకవర్గానికి చెందిన బీజేపీ( BJP ) నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తరలి వచ్చి మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ( Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మాజీ మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్తోనే తెలంగాణకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
గత ఎన్నికల్లో మాయమాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గడిచిన రెండేళ్లలో ఏ ఒక్క హమీని నిలబెట్టుకోలేదని వెల్లడించారు. కల్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామనీ ప్రజలను, పింఛన్లు పెంచుతామని వృద్ధులను మోసం చేశారని తెలిపారు. రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్‌లో వెజ్ , నాన్ వెజ్ మార్కెట్ స్టార్ట్ చేశామమని , కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు. విద్యార్థులకు రెండేళ్లలో స్కాలర్ షిప్‌లు ఒక్క రూపాయి ఇవ్వకుండా పిల్లలను ఆగం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.
బీజేపీ తెలంగాణకు చేసింది ఏం లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ , కాంగ్రెస్ ఒక్కట య్యాయని, ప్రజల పక్షాన ఉన్న బీఆర్ఎస్ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ,నర్సాపూర్ బీఆర్ఎస్ ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.