రంగారెడ్డి జిల్లా కోర్టులు, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై న్యాయవాదులు భగ్గుమన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీరంగారావును ‘చెట్టుకింద ప్లీడర్ పదవికి అర్హుడా..’ అంటూ విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టుల ఎదుట ఆదివారం నిరసనకు దిగారు.
రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజకీయ స్వలాభం కోసం అనేక పార్టీలు మారే వ్యక్తికి సీనియర్ న్యాయవాదిని విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఓటుకు నోటు దొంగ రేవంత్‌ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలిగించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాద జేఏసీ నాయకులు కొణతం గోవర్ధన్‌రెడ్డి, పులిగారి గోవర్ధన్‌రెడ్డి, వొడ్యారపు రవికుమార్, సీహెచ్ ఉపేంద్ర, మంత్రి రవీందర్రావు, అరుణ్‌కుమార్, జొన్నాడ రాకేశ్‌కుమార్, చక్రధర్‌రెడ్డి, విజయుడు, కౌశిక్‌రెడ్డితోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.