Group-1 Interview | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానం మళ్లీ మొదలు కాబోతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. టీఎస్పీఎస్సీ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. టీఎస్పీఎస్సీలో మార్పుచేర్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. డిసెంబర్ చివరివారంలో కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ కేరళ వెళ్లి అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సందర్శించి అధ్యయనం చేశారు. ఈ నెల 5న సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించి చైర్మన్ మనోజ్సోనీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎస్సీలో ప్రతి నియామకానికి ఉండే ఇంటర్వ్యూ విధానంపై ప్రత్యేకంగా చర్చించారు. ఇంటర్వ్యూ విధానాన్ని గ్రూప్-1లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం.
ఉమ్మడి ఏపీలో గ్రూప్-1 ఇంటర్వ్యూలో అక్రమాలు, పైరవీలు జరగడం, తెలంగాణ వారిని కాదని ఆంధ్రప్రాంతం వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చినట్టు ఆరోపణలు రావడంతో అప్పటి సీఎం కేసీఆర్ గ్రూప్-1 స్థాయిలో ఇంటర్వ్యూలు రద్దుచేసి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఇంటర్వ్యూల రద్దుతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కష్టపడితే చదివితే ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం వారిలో పెరిగింది. ఇప్పుడు మళ్లీ ఇంటర్వ్యూలు ప్రవేశపెట్టబోతున్నారన్న వార్తలతో వారంతా ఆందోళనలో మునిగిపోయారు. ఈ విషయమై టీఎస్పీఎస్సీ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పేందుకు అధికారులు నిరాకరించారు.
ఇంటర్వ్యూ విధానంతో ఉద్యోగ నియామకాల్లో కాలయాపన జరిగే అవకాశం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఒక్కో ఇంటర్వ్యూకు సగటున 30 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన గ్రూప్-1 క్యాటగిరీలో 503 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో 1,509 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. రోజుకు 25 మందిని ఇంటర్య్యూ చేసినా తక్కువలో తక్కువ మూడు నెలలు పడుతుంది. గ్రూప్-2 క్యాటగిరీలో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉండడం వల్ల వేలాదిమందిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. ఫలితంగా నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.