హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ , డీలిమిటెషన్, రాజకీయ వ్యవహారాలు, పీసీసీ సలహా కమిటీల సమావేశాలు జరిగాయి. నూతనంగా నియామకమైన పీసీసీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులతో జరిగిన సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ..పార్టీ కోసం పనిచేయని వాళ్లను ఎన్నికల ముందు బాధ్యతల నుంచి తప్పిస్తామని, పనిచేస్తే ప్రమోషన్ ఇస్తామని పేర్కొన్నారు.
జిల్లాలపై ఇన్చార్జి మంత్రులు దృష్టిపెట్టడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తంచేశారు. వెంటనే జిల్లాల్లో పదవులు, మార్కెట్, దేవాలయ కమిటీల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థిని అధిష్ఠానం ప్రకటిస్తుందని తెలిపారు.
పార్టీ కోసం కష్టపడే వారికి కమిటీల్లో, రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. పార్టీని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కమిటీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.
జూలై 4న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హైదరాబాద్కు వస్తున్నట్టు సీఎం తెలిపారు. అదేరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.