CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకొంటూ వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. రుణమాఫీ పూర్తి చేయలేదని పరోక్షంగా ఒప్పుకొన్నారు. మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘తెలంగాణలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చినా రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ పార్టీలు ఎన్నికల కోసం తప్పుడు హామీలు ఇస్తున్నాయి’ అని చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇవ్వబోయి అసలు నిజాలు వెల్లడించారు.
రుణమాఫీ వివరాలతో ప్రధానికి రాసిన లేఖ ద్వారా ఇప్పుడు సెల్ఫ్‌గోల్‌లో పడ్డారు. ‘మేము రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా, బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించాం. ఇప్పటి వరకు కేవలం 27 రోజుల్లో మూడు విడతల్లో రూ.2 లక్షలలోపు రుణాలు కలిగిన 22,22,067 మంది రైతులకు రూ.17, 869 కోట్ల రుణాలను మాఫీ చేశాం’ అని లేఖలో ప్రస్తావించారు. పూర్తిగా రుణమాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇంకా 19,77,933 మంది రైతులకు రూ. 13,131 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డే పరోక్షంగా వెల్లడించారు. లేఖలో రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతుల అంశాన్నీ రేవంత్ ప్రస్తావించారు. ఆ రైతులకు రుణమాఫీ చేయలేదని ఆయనే ఒప్పుకొన్నారు.
దేవుళ్లపై ఒట్టేసి.. అరకొరే రుణమాఫీ
‘డిసెంబర్ 9న రుణమాఫీ అని ఒకసారి, దేవుళ్లందరిపైనా ఒట్టుపెట్టి మరీ ఆగస్టు 15 అని ఒకసారి రేవంత్‌రెడ్డి హామీనిచ్చి తర్వా త నాలుక మడతేశారు. ఆగస్టు 15లోగా 2లక్షల వరకు పంట రుణాలు పూర్తిగా మా ఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. దిగివచ్చిన సర్కార్ ఆగస్టు 15వరకు అరకొర రుణమాఫీ చేసింది. తర్వాత హరీశ్‌ను రాజీనా మా చేయాలని కాంగ్రెస్ నేతలు వెంటబడ్డారు. కానీ, రుణమాఫీ సగం కూడా పూర్తికాలేదని బీఆర్ఎస్ నేతలు లెక్కలతో సహా తేల్చిచెప్పడం, రాష్ట్రమంతటా రుణమాఫీ కాని రైతులు ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వ పెద్దలు గమ్మునుండిపోయారు.