హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా వేములలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోవడం లోటుగా ఉన్నదన్నట్టు వ్యాఖ్యానించారు. ‘తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ. చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నది.
ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తరు. ప్రకృతి అనేది ఉంటుంది. ఆ ప్రకృతి శిక్షిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. సీఎం రాజకీయ వ్యాఖ్యలతో కాంగ్రెస్లో మరోసారి కలకలం రేగింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆయన ఇంకా చంద్రబాబుపై మమకారాన్ని వదులుకోలేదని మండిపడుతున్నారు. ఇండి యా కూటమిలో ఉంటూ వైరి పక్షమైన ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీని పొగడటం ఏమిటని ప్రశ్నిస్తున్నా రు. కొంత మంది కుట్రల వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది పరోక్షంగా ఓటుకు నోటు కేసు ను ప్రస్తావించడమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి, ఆ నేరాన్ని తప్పించుకునేందుకు సరిహద్దు దాటి వెళ్లిపోయిన పార్టీని, ఆ పార్టీ ముఖ్యనేతలను రేవంత్ పొగడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేయడం కు ట్రనా? లేదా ఈ దుశ్చర్యను ముందే పసిగట్టి తెరవెనుక వ్యక్తుల బండారాన్ని బయటపెట్డం కుట్రనా? ఆ కుట్రలను ముందే గుర్తించి, దోషులను ముందుగానే పట్టుకోవడం కుట్రనా? అని ప్రశ్నిస్తున్నారు.
తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుతామని రేవంత్రెడ్డి తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వచ్చేతరానికి కూడా పేదలకు ఇండ్లు ఇస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకాకపోవడం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. అధికార కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రిని కలవడానికి భట్టి వెళ్లారని, యూరియా కోసం కేంద్ర మంత్రిని కలిసేందు తుమ్మల వెళ్లారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బెండాలపాడులో రేవంత్ పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉన్న అఖిలపక్షం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. చండ్రుగొండ మండలానికి సంబంధించిన కాంగ్రెసేతర పక్షాలు(బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర గిరిజన సంఘాల బాధ్యులు) నాయకులను తెల్లవారుజాము నుంచే అరెస్టు చేసి బస్సులో కొత్తగూడేనికి తరలించారు. సీఎం పర్యటన ముగిశాక వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.