హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీజేపీతో తనకు ఉన్న స్నేహబంధాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు అంగీకరించారు. కేంద్రం తనకు సహకరిస్తున్నదని స్వయంగా ఆయనే తెలిపారు. నిన్న మొన్నటిదాకా కేంద్రంపై దుమ్మెత్తిపోసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు స్నేహరాగం ఆలపిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయనే తాజాగా నాలుక మడతేశారు ‘కేంద్రంలో మార్పు వచ్చింది. రాష్ర్టానికి సహకరిస్తున్నది’ అంటూ తమ మధ్యగల స్నేహాన్ని బయటపెట్టారు. ఆదివారం సీఎంతో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తమ రహస్య బంధాన్ని బట్టబయలు చేశారు.
‘గతంలో ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లేవాళ్లలా చూస్తున్నారన్నరు.. మరిప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందా? కేంద్రం సహకరిస్తున్నదా?’ అని విలేకరులు ప్రశ్నించగా రేవంత్‌రెడ్డి బదులిస్తూ ‘ఆ అవును.. మార్పు వచ్చింది.. కేంద్రం నుంచి సహకారం అందుతున్నది. ఆ మార్పు వచ్చింది కాబట్టే పనులు జరుగుతున్నయి. 11.09 శాతం వడ్డీతో 12 సంవత్సరాల వ్యవధిగల 26 వేల కోట్ల అప్పును 7.25 శాతంతో 35 సంవత్సరాలకు పొడగించుకోగలిగినం. ఉత్తర ట్రిపుల్ ఆర్ కొలిక్కి వస్తున్నది. బుల్లెట్ ట్రైన్‌కు అంగీకరించిండ్రు. అందుకే కేంద్రంతో వివాదాలు, తగాదాలు పెట్టుకోదల్చుకోలేదు’ అని కుండబద్దలు కొట్టారు.
ఓవైపు ప్రస్తుత పథకాల అమలుకు నిధుల్లేవంటూ ఏడుస్తున్న రేవంత్‌రెడ్డి.. మరోవైపు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తిచేస్తామంటూ హామీలిస్తున్నరు. ఈ నేపథ్యంలో విలేకరులు ‘ప్రస్తుత పథకాలకే నిధులు లేనప్పుడు కొత్త ప్రాజెక్టులకు నిధులెలా తెస్తరు? వాటిని ఎలా అమలు చేస్తరు?’ అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఎం.. ‘అప్పులు తెచ్చి, ప్రాజెక్టులు చేపడుతం.. నిధుల సమీకరణపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నం’ అంటూ వివరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ చేపట్టిన నిర్మాణాలపై తన కడుపుమంటను సందర్భం వచ్చినప్పుడుల్లా వెల్లగక్కుతూనే ఉన్నారు. నిన్నమొన్నటి దాకా సచివాలయం, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్‌పై ఆరోపణలు చేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా తెలంగాణకోసం అసువులుబాసిన అమరుల ప్రతిరూపమైన ‘అమర జ్యోతి’ నిర్మాణంపైనా అక్కసు వెళ్లగక్కారు. ఈ కట్టడానికి సైతం అవినీతి మరకను అంటించే ప్రయత్నం చేశారు. కనీసం అది అమరుల ప్రతిరూపమనే సోయి లేకుండా కించపరిచే వ్యాఖ్యలు చేశారు. మిగిలిన నిర్మాణాలపైనా అదే పాట పాడారు. ఓవైపు ‘సచివాలయానికి వెళ్తున్నా, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు నిత్యం వెళ్తున్నా. అక్కడి నుంచే పాలన సాగిస్తున్నా’ అంటున్న సీఎం మరోవైపు వాటితో ప్రజలకు ప్రయోజనం లేదనడం గమనార్హం.
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక పండుగ బతుకమ్మకు ప్రతి ఆడబిడ్డకు చీరను బహుమతిగా పంపిణీ చేసింది. కానీ ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు పక్కన పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా.. ఇప్పటి వరకు ఒక్కసారి.. ఒక్క ఆడబిడ్డకు కూడా చీర పంపిణీ చేయలేదు. ఈ వాస్తవాలను కప్పిపుచ్చుతూ సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కేసీఆర్ సర్కారు రద్దు చేసిన చీరల పంపిణీ పథకాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని, ఇప్పుడు నాణ్యమైన రెండు చీరలు ఇస్తున్నామని ప్రకటించారు. ‘మరి ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళ చీరలు తీసుకోలేదు.
తన సొంత సర్వేలతో పాటు ప్రైవేటు సర్వేల్లోనూ జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్దే విజయం ఖాయమనే ఫలితాలు వస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చే సర్వేల ఫలితాలను ప్రసారం చేయొద్దంటూ మీడియాను సీఎం పరోక్షంగా వేడుకున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 2034 వరకు అధికారంలో ఉంటుందని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరగవని, 2029 జూన్‌లో జరుగుతాయని చెప్పారు. అప్పుడు జమిలి ఎన్నికలు రానున్నాయని తెలిపారు.
సీఎం అంటే రాష్ర్టానికి పెద్ద దిక్కు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అంత మనవాళ్లేనని భావించి సమస్యలున్నా పరిష్కరించాలి. కానీ, రేవంత్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్లపై చెత్త ఉన్నదంటూ స్థానికులు, ప్రతిపక్షాలు ప్రశ్నించడంపై స్పందించారు. ‘జూబ్లీహిల్స్‌లో మా పార్టీకి ప్రాతినిధ్యమే లేదు. ఇక్కడ మా పార్టీ నుంచి ఎమ్మెల్యే కాలేదు. మా ప్రాతినిధ్యమే లేనప్పుడు సమస్యలకు మేమెలా కారణమవుతాం? మేమెందుకు జవాబు చెప్తాం?’ అంటూ వింత వాదన చేశారు.