మహబూబ్‌నగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాధేయపడ్డారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలులో రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, శ్రీహరి, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతూ ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నం.. మీరు విజ్ఞులు.. మీరు ఉన్నప్పుడే కల్వకుర్తి ఎత్తిపోతల మొదలుపెట్టిండ్రు.. మీరు సీఎంగా ఉన్నప్పుడే ఈ జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు వచ్చినవి.. నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు ఎత్తిపోతల పనులు ప్రారంభమయ్యాయి.. పదేండ్లలో చంద్రశేఖర్‌రావు కట్టకుంటే చంద్రబాబు నాయుడు అడ్డుకోవడం న్యాయమా? అందుకే చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా.. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డం పడొద్దు.. మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు.. మా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ను అడ్డుకోవద్దు.
ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నరు.. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బతకనివ్వండి’ అంటూ చంద్రబాబును దేబిరించారు. ‘ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకాల 4 టీఎంసీలు తీసుకెళ్లేది ఉంటే.. ఇయ్యాళ 9 టీఎంసీలు తీసుకెళ్లేందుకు మీరు ప్రాజెక్టులు కడుతున్నరు. అందుకే బాబుకు విజ్ఞప్తి చేస్తున్నా.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీలు రోజుకు తరలించే ప్రాజెక్టును మీరు రద్దు చేసి ఉదారత్వం ప్రదర్శిచండి. రెండు రాష్ర్టాల తెలుగు ప్రజలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేయండి’ అని వేడుకున్నారు. ‘పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీరు ఉదారంగా సహాయపడాలి. మీ మేలు ఎప్పటికీ మరిచిపోం’ అని బేలగా విజ్ఞప్తిచేశారు. ‘అక్కడి సూర్యుడు.. ఇక్కడ పొడిచినా.. చంద్రశేఖర్‌రావు ఏడ్చి.. దుఃఖ పడినా.. చంద్రశేఖర్‌రావు పిల్లలు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యలు చేసుకున్నా.. పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది’ అంటూ కేసీఆర్‌పై మరోసారి సీఎం అక్కసు వెల్లగక్కారు.
‘కేసీఆర్ నీ గుండెల మీద రాసుకో.. 2024 నుంచి 2034 వరకు పాలమూరు బిడ్డ.. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు..పాలమూరు నుంచి ప్రజాప్రభుత్వాన్ని నడుపుతాడు.. పాలమూరు నుంచి శాసనం చేస్తా.. పాలమూరు నుంచి శాసనసభలు నడిపించే బాధ్యత నేను తీసుకుంటా..ఇది నా మాట.. నువ్వు నీ గుండెల్లో రాసుకో’ అంటూ రేవంత్‌రెడ్డి పగటి కలలుకన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రులు సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా నిర్లక్ష్యం చేశారు.. అందుకే పాలమూరు ఎడారిగా మారింది. కల్వకుర్తిని పక్కనపెట్టి పోతిరెడ్డిపాడు ద్వారా ఆనాడు నీళ్లు తరలించుకపోయారు. మా పొలాలకు నీళ్లు రాలే.. ఎండిన పొలాలు చూసి మా కళ్లల్లో నీటి ధారలు కారినై’ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పదేండ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల భూసేకరణకు ఎన్ని వేల కోట్లు అవసరమైనా డిసెంబర్ 9లోగా భూ నిర్వాసితులందరికీ నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. భూమి సేకరించి రాబోయే రెండేళ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు.
సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించిన 40 నిమిషాల్లో 35 సార్లు కేసీఆర్ జపం చేశారు. మాటమాటకు చంద్రశేఖర్‌రావు పేరు తలవనిదే ప్రసంగం ముందుకు సాగలేదు. ‘బస్సులో ఎవరైనా డబ్బులు అడిగితే మా తమ్ముడు అని నా ఫొటో చూపించండి.. మా రేవంత్ ఇస్తాడు చూడని చెప్పండి’ అంటూ గొప్పలు చెప్పుకొన్నారు.