Revanth Reddy | నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా మారింది కాంగ్రెస్ తీరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వలేదు. గతంలో బీసీలు పోటీ చేసిన స్థానాల్లోనూ ఇతర వర్గాల వారికి స్థానం కల్పించింది. తీరా బీసీ డిక్లరేషన్ పేరుతో నిర్వహించిన సభలో మాత్రం బీసీలపై ఎనలేని ప్రేమను కనబరుస్తూ మొసలి కన్నీళ్లు కార్చడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం అవాస్తవాలు, అసత్యాలతోనే కొనసాగింది. బీసీ వ్యతిరేకి మోదీ అంటూ కర్ణాటక సీఎం పలుమార్లు సభలో వ్యాఖ్యానించారు. బాన్సువాడలో టికెట్ ఆశించి భంగపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడి పేరును ఎత్తకుండానే బీసీ డిక్లరేషన్ ముగించడం విశేషం.
నిజామాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ రణభేరి సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హాజరైందే అరకొర జనమైతే సభ ముగింపు సమయానికి సగభాగం ఖాళీగా మారింది. సభ ప్రారంభంలో జనం కనిపించినప్పటికీ సిద్ధరామయ్య ప్రసంగం ప్రారంభించే సమయానికి జనాలు వెనుదిరగడం మొదలైంది. రేవంత్‌రెడ్డి మాట్లాడే సమయానికి దాదాపుగా సగం కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వెనుక వైపు కుర్చీల్లో జనాలు లేకపోవడంతో హడావుడిగా నేతల ప్రసంగాలు కొనసాగాయి. సిద్ధరామయ్య తర్వాత వీ హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరాం, కే నారాయణ తర్వాత ఏఐసీసీ మైనార్టీ నాయకుడు ఒకరు మాట్లాడారు.
వీరంతా కేవలం ఒకట్రెండు నిమిషాల్లోనే ప్రసంగం ముగించి జనాలను కాపాడుకొనే ప్రయత్నం చేశారు. రేవంత్‌రెడ్డి తన నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌కు జనాలను తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ వర్గం కూడా జనాలను పోగేసుకొచ్చింది. అయినా ఊహించినంత జనాలు రాకపోవడంతో కాంగ్రెస్ లీడర్లలో ఉత్సాహం కరువైంది. రేవంత్‌రెడ్డి గొంతు చించుకుని అరిచినా జనం సభా వేదిక వైపునకు తిరిగి చూసేందుకు ఇష్టపడలేదు. తన ప్రసంగానికి స్పందన లేకపోవడంతో కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపైనా నోటికొచ్చినట్టు దుర్భాషలాడే ప్రయత్నం చేశారు. జనమంతా కుర్చీల్లో కూర్చోవాలంటూ షబ్బీర్ అలీ ప్రాధేయపడినా, జనం లేక సగానికి పైగా ఖాళీ కుర్చీలతో రణభేరి సభ కనిపించడం గమనార్హం.
కాంగ్రెస్ రణభేరిలో పోటాపోటీగా పీసీసీ నేతలంతా నీతులు వల్లించారు. బీసీ డిక్లరేషన్‌ను నిజామాబాద్‌కు చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రవేశ పెట్టారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పించడం, లోకల్ బాడీల్లో 23 శాతం నుంచి 42 శాతం రిజర్వేషన్ పెంచేందుకు డిక్లరేషన్‌లో నిర్ణయించామని ప్రకటించారు. సీన్ కట్ చేస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోటీచేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీసీలకు సీటు ఇవ్వకపోవడం శోచనీయం. నిజామాబాద్ అర్బన్ నుంచి ధర్మపురి సంజయ్, ఆకుల లలితతో పాటు మహేశ్‌కుమార్‌గౌడ్ సైతం పోటీ పడ్డారు. వీరంతా బీసీ నేతలే. వీరిని కాదని కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీని పట్టుకొచ్చి కాంగ్రెస్ బీసీ వర్గాలను మోసం చేయడాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఆర్మూర్‌లో 2018లో బీసీలకు టికెట్ ఇచ్చారు. ఈసారి ఆ వర్గానికి మొండిచేయి చూపి బీజేపీ నుంచి వచ్చిన వినయ్‌కుమార్‌రెడ్డికి కేటాయించారు. బాల్కొండలోనూ సునీల్‌రెడ్డికి, బోధన్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి, నిజామాబాద్ రూరల్‌లో భూపతిరెడ్డికి టికెట్లు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాన్ని వదిలేస్తే, బాన్సువాడలో బీసీ లీడర్‌ను పక్కనపెట్టి మరీ బీజేపీ నుంచి వచ్చిన ఏనుగు రవీందర్‌రెడ్డికి కేటాయించారు. దీంతో స్థానిక బీసీ కాంగ్రెస్ లీడర్ పురుగుల మందు తాగారు. ఎల్లారెడ్డిలో మదన్‌మోహన్‌రావుకు టికెట్ కేటాయించారు. ఇక్కడ కూడా 2018లో బీసీకే టికెట్ ఇవ్వగా ఈసారి విస్మరించారు. కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తరపున నామినేషన్ వేశారు. 9 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వని కాంగ్రెస్ బీసీ పాటెత్తడాన్ని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
‘మొదట ఎన్నికల్లో గెలవండ్రా బాబు.. ఆ తర్వాత సీఎం ఎవడో నిర్ణయిద్దాం’ అంటూ మాజీ ఎంపీ వీ హనుమంత్‌రావు తమ పార్టీ నాయకులకు చురకలు అంటించారు. సీఎం పదవిని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గేలు నిర్ణయిస్తారంటూ చెప్పుకొచ్చారు. వీహెచ్ మాట్లాడిన తీరు అధికారంలోకి వస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న పీసీసీ నేతలను గందరగోళంలో పడేసింది.