మేడ్చల్, ఫిబ్రవరి 22 : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హకీంపేట క్రీడా పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతాళపాడు గ్రామానికి చెందిన సుమన్, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు క్రీడా పాఠశాలలో చదువుతున్నారు. 7వ తరగతి చదువుతున్న పెద్ద కుమారుడు శ్రీనాథ్(12) ఆదివారం మధ్యాహ్నం వసతి గృహం గదిలో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న నిర్వాహకులు శ్రీనాథ్‌ను కొంపల్లిలోని వెల్నెస్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.
పరామర్శించిన మంత్రి
క్రీడా పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకున్న క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొంపల్లి వెల్నెస్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థి ఆరోగ్యం మెరుగుపడే వరకు అవసరమైన ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని మంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో ఉమాగౌరి ఆస్పత్రికి చేరుకొని, విద్యార్థికి అందిస్తున్న వైద్యాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక వైద్యబృందం విద్యార్థి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందజేస్తుందని తెలిపారు.
తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థి శ్రీనాథ్ ఉరేసుకున్న సమాచారం అందుకున్న తల్లిదండ్రులు సుమన్, నాగమణి నేరుగా ఆస్పత్రికి చేరుకొని, ఆందోళన చెందారు. తమ కుమారుడి పరిస్థితి తెలుసుకొని రోదించారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లి నాగమణి మాట్లాడుతూ శివరాత్రి ఇంటికి వచ్చి మూడు, నాలుగు రోజులు ఉన్నాడని తెలిపారు. ఆ తర్వాత పాఠశాలకు తీసుకొచ్చి, వదిలిపెట్టి వెళ్లామన్నారు. యాక్టివ్‌గా ఉండే తమ కుమారుడు నెల రోజులుగా మౌనంగా మారిపోయాడన్నారు. పాఠశాలలో ఏం జరిగిందో తమకు తెలియదన్నారు. తమకు తెలియగానే నేరుగా ఇక్కడికే వచ్చామని ఆమె చెప్పారు.