Kartik Aaryan | భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న అస్సాం రాష్ట్రానికి బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తన ఉదారతను చాటాడు. కష్టకాలంలో ఉన్న అస్సాం ప్రభుత్వానికి ఆయన కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ధృవీకరించడంతో పాటు నటుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అస్సాం వరదల్లో మృతుల సంఖ్య 78కి చేరడం, 3 లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ క్లిష్ట సమయంలో కార్తీక్ ఆర్యన్ ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించడం పట్ల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. మీ ఉదారమైన విరాళం మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. అస్సాం ప్రజలను ఆదుకోవడంలో మీ సాయం చాలా దూరం వెళ్తుంది అంటూ అభినందించారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ కూడా తన ‘బీయింగ్ హ్యూమన్’ ఫౌండేషన్ ద్వారా వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. శివసాగర్, గోలాఘాట్ జిల్లాల్లో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఏడాది వరద సంబంధిత మరణాల సంఖ్య 78కి చేరినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (ASDMA) వెల్లడించింది. శివసాగర్, చరైదేవ్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, బిశ్వనాథ్, కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాల్లోని దాదాపు 3,00,031 మంది ప్రజలు ఇంకా వరద ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 551 గ్రామాలు నీట మునగడంతో పాటు, వేలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.