హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు పోర్టల్లో 8 జిల్లాలు గల్లంతయ్యాయని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆరోపించారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన ఎలక్ట్రిక్ సూటర్, తురక కాశీ కార్మికుల సంక్షేమ పథకాల అమల్లో అనేక జిల్లాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. టీజీవోబీఎంఎంఎస్ పోర్టల్లో నాగర్కర్నూల్, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, ములుగు జిల్లాలు లేవని విచారం వ్యక్తంచేశారు.
మార్చి 1తో దరఖాస్తు గడువు ముగుస్తుందని, దీంతో అర్హులైన ఈ 8 జిల్లాల మైనారిటీ నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కేవలం కొన్ని జిల్లాలకే ప్రాధాన్యత ఇచ్చి, మరికొన్ని జిల్లాలను విస్మరించడం సమంజసం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ సమాన అవకాశం కల్పించాలని యాకూబ్ పాష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.