హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం! ఓడలు బండ్లు కావచ్చు.. బండ్లు ఓడలు కావచ్చు! కానీ రాజకీయ నాయకుల రీతి, నీతి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతల తీరు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. తాము ప్రతిపక్షంలో ఉంటే ఒకలా! అధికార పక్షంలో ఉంటే మరోలా! అని మరోసారి రుజువు చేసుకున్నారు.
నాడు శాసనసభ వేదికగా అప్పటి సీఎం కేసీఆర్ సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అది అప్రజాస్వామికం.. రాజ్యాంగ విరుద్ధమని వాదించిన నేతలే ఇప్పుడు అదే ప్రజెంటేషన్ కోసం తహతహలాడుతున్నారు. పైగా ప్రతిపక్షాలకూ అవకాశం ఇవ్వాలని గతంలో డిమాండ్ చేసిన వాళ్లే ఇప్పుడు ప్రతిపక్షానికి ఎలా అవకాశం ఇస్తామని నాలుక మడతేస్తున్నారు. మరి.. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో! ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం కదా!
అంటే గతంలో తమ పీపీటీకి అవకాశం ఇవ్వనందున ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్‌ను బహిష్కరించినట్టు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసినట్టుగానే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే బాటలో నడువాలా? అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనున్న ప్రజెంటేషన్‌కు హాజరు కావాలా? వద్దా? అనే అంశాన్ని బీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంతవరకు బాగానే ఉందిగానీ ‘అసలు రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి ఒరగబెట్టిందేంది? కనీసం తట్టెడు మట్టెత్తకుండా ప్రజెంటేషన్‌లో చెప్పేదేంది? ఇంతకీ అది సాగునీటి రంగ ప్రజెంటేషనా? లేక రాజకీయ ప్రజెంటేషనా?’ అని సాగునీటి రంగ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
రీడిజైన్ చేసి తెలంగాణ దశ మార్చిన కేసీఆర్
‘తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు అంటే రాసుకుంటే రామాయణమంత.. చెప్పుకొంటే భాగవతమంత’ అని కేసీఆర్ ఏనాడో చెప్పారు. ఆరు దశాబ్దాల తెలంగాణ సాగునీటి రంగం ఎంత విధ్వంసానికి గురైందో ప్రతి తెలంగాణవాది కండ్ల ముందున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టుల్లో చారాణా వాటా అనుభవిస్తున్నా.. ఆ ప్రాజెక్టుల్ని కేవలం తెలంగాణ రైతుల బాగు కోసమే నిర్మించినట్టుగా చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు చివరికి నాలుగున్నర దశాబ్దాల పాటు సాగదీసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కనీసం నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లివ్వకపోయినా ఆ ఘనత తమదేనంటారు. అందుకే తెలంగాణ ఏర్పడేనాటికి సాగునీటి రంగం చుట్టూ అలుముకున్న విషవలయాన్ని ఛేదించేందుకు కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టాల్సి వచ్చింది.
60 ఏండ్ల పాటు కృష్ణా బేసిన్లో తెలంగాణకు సొంతంగా పట్టుమని పది టీఎంసీల నీటి నిల్వ లేకుండానే ప్రాజెక్టులను కట్టిన సమైక్య పాలకులు.. నీళ్లులేని చోట, నీళ్లురాని చోట ప్రాజెక్టుల ఇన్‌టేక్ పాయింట్లు (వాటర్ సోర్స్) డిజైన్ చేసినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం నోరు మెదిపిన దాఖలాల్లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నీళ్లు దేవుడెరుగు.. అనుకొని మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం ఎగబడి చివరికి రాయలసీమకు కృష్ణాజలాలను తన్నుకుపోతుంటే హారతులు పట్టిన దృశ్యాలు ఇప్పటికీ తెలంగాణ సమాజం మదిలో కదలాడుతూనే ఉన్నాయి.
ఇట్లాంటి చారిత్రక అన్యాయాల నుంచి తెలంగాణ రైతాంగానికి విముక్తి కల్పించేందుకు కేసీఆర్ గులాబీ జెండా పట్టి గొంతెత్తారు. చివరికి గమ్యాన్ని ముద్దాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే భావ దారిద్య్రంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమైక్య పాలకుల డిజైన్‌కే జై కొట్టారు. అయినా కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టి సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ ఉన్న విష వలయాన్ని తొలగించి నీళ్లు వచ్చేలా రూపకల్పన చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనేది తెలంగాణ సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చింది. పల్లేరు కాయలు మొలిచే నేలలను పచ్చని మాగాణాలు చేసి వలసల కేంద్రంగా ఉన్న తెలంగాణను దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రైస్ బౌల్‌గా మార్చింది.

బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వనంటున్న కాంగ్రెస్
గతంలో ప్రతిపక్షంగా తమకు ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకు కూర్చున్నది. ఈ మేరకు బీఏసీ సమావేశంలోనే మాజీ మంత్రి హరీశ్‌రావు తమ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం గతంలో తమకు అవకాశం ఇవ్వనందున ఇప్పుడు తామూ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పినట్టు సమాచారం.
అయితే 2016లో కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చే ముందు ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని కోరలేదని, కేసీఆర్ పీపీటీ ఇచ్చే రోజు మాత్రం అప్పటికప్పుడు అవకాశం ఇవ్వాలని కోరినట్టు పలువురు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ముందుగానే ప్రజెంటేషన్ ఇస్తామనే ప్రతిపాదనను బీఏసీ ముందు ఉంచిందని చెప్తున్నారు. అయితే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వ పీపీటీని బహిష్కరిస్తున్నట్టు గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రకటించాయి. కాగా తమకు అవకాశం ఇవ్వనందున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పీపీటీని బహిష్కరిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.
ఏపీకి ధారాదత్తం చేసేందుకే ప్రజెంటేషనా?
కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగంపై అసెంబ్లీ వేదికగా ప్రజెంటేషన్ ఇవ్వనుండటంపై సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ‘అసలు రెండేండ్లుగా ఈ ప్రభుత్వం తట్టెడు మట్టి తీయకుండా ఏం సాధించిందని ప్రజెంటేషన్ ఇస్తున్నది?’ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్, భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం భుజాన ఎత్తుకున్న సందర్భంగా గతంలో కేసీఆర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌కు ఓ అర్థం.. సార్థకత ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. పైగా కేసీఆర్ ప్రజెంటేషన్‌లో చెప్పిన విధంగా రికార్డు సమయంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి తెలంగాణను అధిక ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల నుంచి ప్రాజెక్టులను తొక్కిపెట్టడమే కాదు.. కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టుకు డిజైన్ చేసిన దాఖలాలు కూడా లేవని సాగునీటి రంగ నిపుణులు వివరిస్తున్నారు. చివరికి సీఎం సొంత నియోజకవర్గం కోసం చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండేండ్లయినా కనీసం సర్వే దశను కూడా దాటలేకపోయిందని, ఈ నేపథ్యంలో ప్రజెంటేషన్‌లో ప్రభుత్వం ఏం చెప్పుకొంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. అటు కృష్ణా, ఇటు గోదావరిలో ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా నీటిని తన్నుకుపోతుంటే కండ్లప్పగించి చూస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజెంటేషన్‌లో వాటికి సమాధానం చెప్తుందా? అని ఓ రిటైర్డ్ ఇంజినీర్ డిమాండ్ చేశారు.
చారిత్రక పీపీటీని వ్యతిరేకించిన నాటి ప్రతిపక్షాలు
సమైక్య పాలనలో తెలంగాణ సాగునీటి రంగ విధ్వంసాన్ని పూసగుచ్చినట్టు వివరించడంతో పాటు భావి తెలంగాణ పచ్చని మాగాణం అయ్యేందుకు ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌కు ఎలా రూపకల్పన చేశారో ప్రజలకు వివరించేందుకు 2016లో కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమయ్యారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రైతాంగ ఆర్ద్రతను అర్థం చేసుకున్న ఉద్యమ నేతగా ఇచ్చిన పీపీటీ తెలంగాణ సమాజాన్ని విశేషంగా ఆకట్టుకున్నది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు అంటేనే అంతర్రాష్ట్ర వివాదాలు, వైల్డ్‌లైఫ్ పేరిట కొర్రీలు, దశాబ్దాల కాలయాపన అనే వాస్తవాలను అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ప్రజల ముందు ఉంచారు.
తెలంగాణకు శరణ్యమైన కృష్ణా, గోదావరి నదీజలాల పారకం మొదలు జరిగిన మోసాలు, వాటిని చక్కదిద్దే మార్గాలు, భావి కార్యాచరణను ప్రజెంటేషన్ ద్వారా ఆవిష్కరించారు. వాస్తవానికి కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పునర్నిర్మాణ దిశగా అడుగులు మొదలుపెట్టినందున ఆ ప్రజెంటేషన్‌కు కూడా అంతటి చారిత్రక ఆవశ్యకత ఉన్నదని అప్పట్లో సామాన్యుడు మొదలు సాగునీటి రంగ నిపుణుల దాకా ప్రశంసించారు. కానీ అప్పటి ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ మాత్రం ఆ ప్రజెంటేషన్‌ను వ్యతిరేకించాయి. ఇప్పటి డిప్యూటీ సీఎం, నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న భట్టి విక్రమార్క ఇదెక్కడి సంప్రదాయం? అంటూ ఒంటికాలిపై లేచారు. ప్రజెంటేషన్‌కు వచ్చి అందులో తాము భాగస్వాములు కాలేమంటూ సభ నుంచి వాకౌట్ చేశారు.
తమకు కూడా పీపీటీ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ముందుగా కోరకుండా.. కేసీఆర్ ప్రజెంటేషన్ తర్వాత నోటి మాటగా తమకు అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు మండలి సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. పార్లమెంట్, ఇతర రాష్ట్ర అసెంబ్లీల్లో ఎక్కడాలేని విధంగా పీపీటీ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇక.. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీడీపీ సభ్యుడిగా తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ అంటే 120 మంది సభ్యులకు సమాన హక్కులు ఉంటాయని, ప్రభుత్వం ఏకపక్షంగా పీపీటీ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్‌లోని లోపాలను ఎత్తి చూపేందుకు తమకూ పీపీటీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవకాశం ఇవ్వనందున తాము పీపీటీని బహిష్కరిస్తున్నట్టు చెప్పారు.
నాడు పరార్
పవర్‌పాయింట్‌ను బహిష్కరిస్తున్నం
శాసనసభ ప్రభుత్వానికి సంబంధించినది కాదు. సభ్యులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి. సభలో ప్రతి ఒక్కరి హక్కులనూ గౌరవించాలె. సభ్యుల హక్కులను గౌరవించడం లేదు. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది.
– 2016, ఏప్రిల్1న టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి
ఒక్కరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సరిగాలేదు.. అందుకే బహిష్కరిస్తున్నం.
– 2016, మార్చి 31న కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క
పార్లమెంట్, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే రూలే లేదు. ఇతర దేశాలు, రాష్ర్టాల్లోనూ లేదు. ఏ రూల్ ప్రకారం పీపీటీకి అవకాశమిచ్చారో తెలుపాలని స్పీకర్‌కు లేఖలు రాసినం. పీపీటీని అసెంబ్లీలో పెట్టండి. బడ్జెట్ కాపీ ఇచ్చినట్టుగా ఇవ్వండి. పద్ధతి పాటించాలని కోరినం. అందుకే పీపీటీని బహిష్కరించినం.
– 2016, మార్చి 31న కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ