హైదరాబాద్, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆత్మగౌరవం పేరిట సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 నెలల తర్వాత రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. గోదావరి జలాలు ఏపీకి తరలిపోతుంటే, ఉన్నత స్థానాల్లో ఏపీ అధికారులను నియమించినప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చినప్పుడు, బీజేపీ ఎంపీ తేజస్వీసూర్య వ్యాఖ్యలపై మౌనం వహించినప్పుడు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై తుపాకీ గురిపెట్టినప్పుడే తెలంగాణ ఆత్మగౌరవం నిజంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నదని రేవంత్‌రెడ్డి భావిస్తే, తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఫ్యూచర్ సిటీలో తన కుటుంబసభ్యులకు ఉన్న మూడు వేల ఎకరాల ప్రమోషన్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ప్లాన్ చేశారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. విదేశాంగ శాఖ ఈ పర్యటనకు అనుమతి నిరాకరించడం వెనుక కారణాలను బీజేపీ నేతలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 15 రోజుల ముందే పర్యటన వివరాలు విదేశాంగ శాఖకు అందించాల్సి ఉండగా, సీఎం కేవలం ఐదు రోజుల ముందే సమాచారం ఇచ్చారని తప్పుపట్టారు. రేవంత్‌రెడ్డి ప్రెస్మీట్లో అసలు విషయం చెప్పకుండా మోదీపై నెపం నెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం, మంత్రులకే కాదు బ్యూరోక్రాట్లకు కూడా విదేశీ పర్యటనలకు పొలిటికల్ క్లియరెన్స్ రావాలని, వైట్ పాస్‌పోర్ట్, బ్లూ పాస్‌పోర్టు ఉంటాయ ని రేవంత్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఈ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. వెనుకబడిన వర్గాలు, దళిత, గిరిజన విద్యార్థులకు మంచి విద్యను అందించడం కోసమే తాను విదేశాలకు వెళ్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం అబద్ధమని కొట్టిపారేశారు. యూకే, యూఎస్‌లలో ప్రస్తుతం వేసవి సెలవులు నడుస్తున్నాయని, ఈ సమయంలో అకడ ప్రొఫెసర్లు, అధికారులు అందుబాటులో ఉండరని తెలిపారు. పైగా విదేశీ యూనివర్సిటీలేవీ వేరే దేశాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయవని, ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీగా మారుస్తున్నారని, బీజేపీ, జనసేన ఎంపీల కొడుకులు తప్పులు చేస్తే రేవంత్ కాపాడుతున్నారని పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించిన ప్రభుత్వం, ఆ నిధులను ఎందుకు విడుదల చేయలేదో సమాధానం చెప్పాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ సొమ్ముతో విదేశాలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో చదవడానికి కోటి రూపాయలు ఖర్చయ్యాయని, దానివల్ల ప్రజలకు వచ్చిన లాభమేందని ప్రశ్నించారు. ఇకడి యూనివర్సిటీలు బాగు చేసేందుకు విదేశాలకే వెళ్లాల్సిన అవసరం లేదని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు కురువ విజయ్‌కుమార్ ఉన్నారు.