హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఓవైపు అసెంబ్లీలో ఈ ఏడాదికి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ల కొరతతో మహిళలు అవస్థలు పడుతున్నారు. ఇంకోవైపు పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్” బోర్డులు పెడుతున్నారు. ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండి, సభను నడిపించాలి. పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షించాలి, అధికారులతో సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి. కానీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇవేమీ పట్టడంలేదు. ప్రజల బాధలు గాలికి వదిలి, అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి, విమానాల్లో చక్కర్లు కొడుతున్నారు. పొరుగు రాష్ర్టాలకు వెళ్లి పెండ్లి భోజనాలు చేస్తూ, బాల్యమిత్రుల ఆలింగనాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయనకోసం గౌరవ శాసనసభ కూడా గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వరుసగా పర్యటనలు..
ఈ నెల 16న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదేరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మరుసటి రోజు నుంచి వరుసగా రెండురోజులపాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగాల్సి ఉన్నది. అయితే 17వ తేదీన మధ్యాహ్నమే సభ వాయిదా పడింది. ఢిల్లీలో జరిగే పుస్తకావిష్కణ సభకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లాల్సి ఉండటంతో వాయిదా వేయించారని విమర్శలు వచ్చాయి. పుస్తకావిష్కరణ అనంతరం రాత్రి ఢిల్లీలో మల్లిఖార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులను రేవంత్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య కేరళం ఎన్నికల సర్దుబాట్ల మీద అంతర్గత చర్చ జరిగినట్టు తెలిసింది. ఆయన 18న ఉదయం తిరిగి హెదరాబాద్ చేరుకొని, శాసనసభ సమావేశాల్లో పాల్గొంటారని సీఎంవో లీకులు ఇచ్చింది. అయితే.. సీఎం బుధవారం ఉదయం కూడా ఢిల్లీలోనే ఉండిపోయారు. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ తదితరుల ఇండ్ల చుట్టూ తిరుగుతూ బిజీబిజీగా గడిపారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు.
ఆరోజు తెలంగాణ శాసనసభ ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. అనంతరం టీ బ్రేక్ ఇచ్చారు. అప్పటికి సీఎం రేవంత్‌రెడ్డి సభకు రాకపోవటంతో స్పీకర్ ‘జీరో అవర్” ప్రారంభించారు. జీరోఅవర్‌ను గంటో, అరగంటో కాకుండా గంటన్నరకు పైగా నడిపారు. అంతసేపు జీరోఅవర్ నడపటంపై సభ్యులే ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరాతీస్తే సీఎం రేవంత్‌రెడ్డి సభకు వస్తారనే సమాచారం ఉందని, ఆయన కోసం ఎదురు చూసినట్టు తెలిసింది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను సీఎం ముగించాల్సి ఉన్నదని, ఆ తర్వాత ఎజెండా ఏమిటనేది అప్పటికి తేలలేదని సమాచారం. సీఎం వస్తేనే ఎజెండాపై తుది నిర్ణయానికి వస్తారని తెలిసింది. అంటే ఎంతో విలువైన శాసనసభ సమావేశాలకు ఎజెండా ఏమిటో స్పష్టత లేకుండా ముఖ్యమంత్రి రాకకోసం అధికారపక్షం ఎదురుచూడటం గమనార్హం. ఆరోజు సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చారు. ఇంధన సమీక్షను పక్కనబెట్టి పర్యటనకు..
ఢిల్లీ ప్రయాణ బడలికతోనే సీఎం బుధవారం అసెంబ్లీకి వచ్చారు. సమావేశాల్లో పాల్గొనకుండా తన చాంబర్‌కే పరిమితమయ్యారు. ఈ లోగా అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ సిద్ధం చేయగా, ఏపీలోని గుంటూరుకు వెళ్లారు. తన స్నేహితుడు, టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తిరిగి హెదరాబాద్ వచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని సీఎంవో వర్గాలు లీకులు ఇచ్చాయి. ఈ మేరకు అధికారులు సైతం సిద్ధమయ్యారు. కానీ అకస్మాత్తుగా కేరళంలోని కోజికోడ్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. ఈ పర్యటన కోసం ఇంధన కొరతపై సమీక్షను కూడా రద్దు చేశారని సచివాలయ వర్గాలు తెలిపాయి. అయితే.. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలించకపోవటంతో కేరళ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ట్రెజరీ బెంచ్ నాయకుడిగా బడ్జెట్ సమావేశాలను ముందుండి నడిపించాల్సిన ముఖ్యమంత్రి ఇలా సభను, ప్రజా సమస్యలను గాలికి వదిలి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలు ఆందోళనలో ఉన్నా..
రెండు రోజులుగా రాష్ట్రంలోకి చమురు ఉత్పత్తులు సరిపడనంత రాకపోవటంతో ప్రజలు ఆందోళనతో ఉన్నారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం మొదలైన నాటినుంచి వంటగ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. 15 రోజులైనా వంటగ్యాస్ రాక మహిళలు ఆందోళనతో ఉన్నారు. గ్యాస్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నా, అధికారులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ‘గ్యాస్, చమురు కొరత లేదు‘ అని ప్రకటనలతోనే సరిపెడుతున్నారని, అధికారుల మీద అజమాయిషీ చేసి డీలర్లను దారిలోకి తెచ్చే ప్రయత్నమే చేయటం లేదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. మరోవైపు రెండు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెట్రోలు బంకులకు ఎగబడుతున్నారు.
రోడ్లమీద కిలోమీటర్లకొద్ది వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ పరిస్థితులను నివారించటానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా సీఎం మంగళవారం అసెంబ్లీ సమావేశాలను, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మరోసారి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ ప్రముఖుడు ఒకరు ఢిల్లీలో చాయ్ పార్టీ ఏర్పాటు చేశారని, లోధీరోడ్లో ఉన్న ఆ ప్రముఖుడి నివాసానికి రేవంత్‌రెడ్డి వెళ్లి చాయ్ తాగుతూ గడిపినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అనంతరం ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడితే రాళ్లు కొట్టుకొని, మంట అంటించుకొని వండుకోవాలని ప్రజలకు సలహా ఇచ్చారు. రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు.