హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఓ వైపు అప్పుల కోసం దేబిరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సోకుల కోసం నిధులను దుబారా చేస్తున్నది. అంతగా అవసరం లేని అద్దాల మేడలకు ఇబ్బడిముబ్బడిగా ఖర్చుపెడుతుండటం విమర్శలకు తావిస్తున్నది. ‘ఖజానాల్లో పైసల్లేవని, అప్పుల కోసం ఢిల్లీకి వెళ్తే చెప్పులెత్తుకు పోయేవాడిలా చూస్తున్నారని, నన్ను కోసుకుతిన్నా ఉద్యోగులకు పైసా ఇచ్చే పరిస్థితి లేదు’ అని నిత్యం సభల్లో చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. తన కార్యాలయ ఉద్యోగులకు అన్ని హంగులతో అద్దాల గదులు నిర్మించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. తెలంగాణ సచివా లయంలోని ఐదో అంతస్తులో సీఎం చీఫ్ పీఆర్వో కోసం 5వ నంబర్ గదిలో అద్దాలతో కూడిన చాంబర్, ఫర్నిచర్‌ను ఏర్పాటుచేశారు. ఇందుకోసం రూ.23.20 లక్షలు ఖర్చుచేశారు. సెక్రటేరియట్‌లోని ఆరో అంతస్తు 26, 27 గదుల్లో రూ.59.60 లక్షలు వెచ్చించి సీఎం ఓఎస్డీ (స్టాఫ్ ఆఫ్ అడ్వజైర్) కోసం అధునాతన ఫర్నిచర్‌తో అద్దాల గదిని నిర్మించారు. ఈ నిధుల విడుదలకు సంబంధించి గత నవంబర్ 24న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ జీవో జారీచేశారు.
సంక్షేమ పథకాల అమలుకు నిధుల్లేవని సాకులు చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సోకులకు మాత్రం ఇష్టారీతిన ఖర్చు చేస్తున్నారంటూ జనబాహుళ్యంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఖజానాలో చిల్లిగవ్వ లేదని తరచూ చెప్పే సీఎం.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ఇచ్చిన హామీల అమలును విస్మరిస్తూ వస్తున్నారని మండిపడుతున్నారు. కొంతకాలంగా ఆయన చేసిన కొన్ని వృథా ఖర్చులనే ఇందుకు ఉదాహరణలుగా చూపుతున్నారు. అక్కరకు రాని అందాల పోటీలకు రూ.150 కోట్లు, ప్రజలకు ఉపయోగపడని మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సుమారు రూ.7 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రైవేట్ ఈవెంట్ అని చెప్తున్నటికీ పైకం మాత్రం పరోక్షంగా ప్రభుత్వమే భరించిందని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వందల కోట్లు వెచ్చించి గ్లోబల్ సమ్మిట్ పేరిట హంగామా చేయడం తప్పా ఒరిగిందేమీలేదని, వచ్చిన పెట్టుబడులపై క్లారిటీయే లేదని పెదవి విరుస్తున్నారు. ఉద్యోగుల పీఆర్సీ, పింఛన్ల పెంపు, ఆరు గ్యారెంటీల అమలుకు పైసల్లేవని చెప్తున్న ప్రభుత్వం.. మరి ప్రజోపయోగం కాని వాటికి మాత్రం ఇబ్బడిముబ్బడిగా నిధులెందుకు ఖర్చు చేస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విలాసాలు పక్కనబెట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్కరకు రానివాటికి అడ్డగోలుగా ఖర్చుచేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. మీమ్స్‌తో సెటైర్లు వేస్తూ కడిగిపారేస్తున్నారు. మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌తో మనకు ఒరిగిందేమిటి? అందాల పోటీలతో వచ్చిన పెట్టుబడులెన్ని? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గురుకులాల్లో విద్యార్థుల దురవస్థ, ఎరువుల కోసం రైతుల అవస్థ, బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన, ఫీజుల కోసం విద్యార్థుల ఆరాటం.. కనిపించడం లేదా? అంటూ నిలదీస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర వ్యవహారాలతో తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారని చెడుగుడు ఆడుతున్నారు.