Harish Rao | హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్, నవంబర్ 24: అబద్ధాలు ఆడటంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పీహెచ్‌డీతో పాటు డాక్టరేట్ ఇవ్వొచ్చని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలు రావడం లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒకటీ సంపూర్ణంగా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. అక్కడ రేవంత్, తెలంగాణ మంత్రుల ప్రచారం వల్లే కాంగ్రెస్ ఓడిందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసగించిన విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని చెప్పారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఒట్టేసి దేవుళ్లను కూడా రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. దేవుళ్లనే మోసం చేసిన రేవంత్‌కు ప్రజలను మోసం చేయడం పెద్ద పనేమీ కాదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందని, ఎక్కడ చూసినా అరాచకమే కనిపిస్తున్నదని ఆరోపించారు. తాము కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలమైందని, అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కూలిపోయిందని అపవాదు వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమయ్యే 20 టీఎంసీలను కాళేశ్వరం నుంచి తరలించేందుకు టెండర్లు పిలవాలని సీఎం ఎలా చెప్పారని, మూసీ నదిలోనూ 5 టీఎంసీలు కలుపుతామని ఎలా అన్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందని సీఎం అంటుంటే, మంత్రులు మాత్రం గడిచిన పదేండ్లలో తెలంగాణలో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులు జరిగాయని చెప్తున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తుంటే కాళేశ్వరంపై సీఎం కావాలనే అభాండాలు వేస్తున్నారని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు.
రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కదానినీ పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, రైతులను అన్ని విధాలా మోసం చేసిన ప్రభుత్వం వారోత్సవాలు ఎలా నిర్వహిస్తున్నదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇలాకాలోనే రైతులు పోరాడుతున్న విషయాన్ని హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 19 జూలై 2024న ఫార్మాసిటీ కోసం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. తాము సేకరించబోయే భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని సీఎం చెప్తుంటే, రైతులు మాత్రం అక్కడ పచ్చని పంట పొలాలను చూపిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఫార్మా క్లస్టర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పత్తికి మద్దతు ధర రూ. 7,500 ఉంటే రూ. 6,500 మాత్రమే ఇస్తున్నారని, వడ్లను రూ. 1600-1700కే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ బోగస్ అయిందని మండిపడ్డారు.
దళితబంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన దళితబంధు పథకం ద్వారా ఎంతోమంది దళితులు ఉన్నతస్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. రెండో విడత దళితబంధు నిధులపై ఫ్రీజింగ్ ఎత్తివేసి వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు కోసం హుజూరాబాద్‌లో ధర్నాకు దిగిన దళిత కుటుంబాలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దళితబంధు నిధుల విడుదలపై మంత్రి భట్టివిక్రమార బాధ్యత తీసుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వర్‌రావు, బీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.