తాను పనికిరానని భావిస్తే, తన పనితీరు నచ్చకపోతే పదవి నుంచి దించేసుకోండని, తన ఇమేజ్ను దెబ్బతీయొద్దని సీఎం అన్నట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ, ఇమేజ్ మీకే కాదు.. పార్టీకి కూడా ఉంటుందని కౌంటర్ ఇచ్చినట్టు తెలిసింది.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్‌వార్ మరింత ముదిరింది. ఆది నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణయం మరింత చిచ్చురేపిందనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మీనాక్షి పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పావులు కదుపుతుంటే, పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేదిలేదంటూ మీనాక్షి మొండిగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకరి ఆధిపత్యానికి మరొకరు చెక్ పెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనుకునే వరకు పరిస్థితి వెళ్లిందని విశ్వసనీయంగా తెలిసింది. ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం, పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అధిష్ఠానం రంగంలోకి దిగినట్టు సమాచారం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటు రేవంత్‌రెడ్డికి, అటు మీనాక్షి నటరాజన్‌కు ఫోన్ చేసి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. సమన్వయంతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తారనుకుంటే ఈ కొట్లాటలు, ఆధిపత్య ధోరణి ఏమిటని మందలించినట్టు సమాచారం.
విబేధాలకు ఫుల్స్టాప్ పెట్టాలంటూ అధిష్ఠానం ఆదేశించడంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి మీనాక్షి నటరాజన్ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక్కడ కూడా ఇద్దరి మధ్య వాడివేడిగా చర్చ జరిగిందని, ఒక దశలో తీవ్రస్థాయిలోనే వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనకు తెలియకుండానే పాదయాత్ర నిర్ణయం తీసుకొని, తేదీలను ఎలా ప్రకటించారని సీఎం రేవంత్‌రెడ్డి ఇన్చార్జ్ మీనాక్షిని నిలదీసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన మీనాక్షి.. ఇది అధిష్ఠానం నిర్ణయమని చెప్పినట్టు సమాచారం. అయినప్పటికీ, తనకు చెప్పకుండా చేయడం ఏమిటని ప్రశ్నించిన సీఎం.. ఒక దశలో సహనం కోల్పోయి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. తనను తక్కువగా అంచనా వేయొద్దని, అధిష్ఠానం అండ లేనప్పుడే తొడ కొట్టానని ఆయన అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాను పనికిరానని భావిస్తే, తన పనితీరు నచ్చకపోతే పదవి నుంచి దించేసుకోండని, తన ఇమేజ్ను దెబ్బతీయొద్దని సీఎం అన్నట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ, ఇమేజ్ మీకే కాదు.. పార్టీకి కూడా ఉంటుందని కౌంటర్ ఇచ్చినట్టు తెలిసింది. అధిష్ఠానం, పార్టీ నిర్ణయాలన్నింటిని మీకు చెప్పాల్సిన అవసరం లేదని మీనాక్షి గట్టిగానే బదులిచ్చినట్టు తెలిసింది. ఈ విధంగా ఇద్దరి మధ్య వాగ్వాదం హద్దులు దాటుతుండటంతో మహేశ్‌కుమార్‌గౌడ్ కల్పించుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇటు మీనాక్షికి, అటు రేవంత్‌రెడ్డికి ఇబ్బంది లేకుండా మధ్యేమార్గంగా ప్రతిపాదన చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఢిల్లీ యాత్రను, మీనాక్షి పాదయాత్రను రెండింటిని కొనసాగించాలని నిర్ణయించారు. అయితే మీనాక్షి పాదయాత్రలో చివరి రెండు రోజులను రద్దు చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ యాత్ర చేయాలన్న నిర్ణయం, మీనాక్షి పాదయాత్ర చేయాలనే నిర్ణయం రెండూ ఒకే రోజు జరిగాయి. దాదాపు ఒకే సమయంలో వీటికి సంబంధించిన తేదీలు వెలువడ్డాయి. మీనాక్షి నటరాజన్ ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు పాదయాత్ర చేయనున్నట్టు ఈ నెల 28న సాయంత్రం 4.15 గంటలకు షెడ్యూల్ విడుదల కాగా, అదేరోజు జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం రాత్రి 9 గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ఢిల్లీ యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించారు. మీనాక్షి పాదయాత్ర విషయంలో అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డిని పరిగణనలోకి తీసుకోలేదన్న విషయం ఈ సంఘటనతో స్పష్టమవుతున్నది. ఒకవేళ ఆగస్టు 5,6,7 తేదీల్లో మీనాక్షి పాదయాత్ర ఉన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డికి ముందే తెలిసి ఉంటే, ఆయన ఆ రోజుల్లో ఢిల్లీ యాత్ర పెట్టేవారు కాదనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్షుడు తన మనిషే కావడంతో మీనాక్షి పాదయాత్రకు సంబంధించిన సమాచారం సీఎంకు చేరిందని చర్చించుకుంటున్నారు. మీనాక్షి పాదయాత్ర చేయడం సీఎం రేవంత్‌రెడ్డికి ఇష్టంలేదని, దీంతో పాదయాత్రను అడ్డుకునేందుకు ముఖ్య నేత ప్రయత్నాలు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇందులోభాగంగానే ఏరికోరి మరీ మీనాక్షి పాదయాత్ర ముగింపు తేదీలైన 5,6 తేదీల్లోనే మంత్రి పొన్నంతో ఢిల్లీ యాత్రను ప్రకటించారని అంటున్నారు. ఈవిధంగా ఇటు మీనాక్షి పాదయాత్ర, అటు ఢిల్లీ యాత్ర రెండు ఒకే తేదీల్లో ఉండటంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొన్నది. మీనాక్షి పాదయాత్రలో పాల్గొనాలా? లేక ఢిల్లీ యాత్రలో పాల్గొనాలా? అనే అయోమయం నెలకొన్నది.
పాదయాత్ర, ఢిల్లీ యాత్రల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్న విషయాన్ని పలువురు సీనియర్ నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో స్పందించిన కేసీ వేణుగోపాల్ ఇద్దరికి ఫోన్ చేసి కూర్చొని మాట్లాడుకోవాలని, సమస్యను సృష్టించొద్దని సూచించినట్టు సమాచారం. దీంతో ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఇద్దరూ కలిసి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే, అంతకుముందు కేసీ వేణుగోపాల్ ఎదుట ఇటు సీఎం, అటు మీనాక్షి ఇద్దరు కూడా ఎవరికి వారు తమ వాదన వినిపించినట్టు తెలిసింది. తాను పాదయాత్ర తేదీలను ముందుగానే నిర్ణయించానని, ఈ విషయం తెలిసి కూడా సీఎం రేవంత్‌రెడ్డి అవే తేదీల్లో ఢిల్లీ యాత్ర ప్రకటించారని మీనాక్షి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అసలు తనకు పాదయాత్ర విషయమే తెలియదని, తనకు ఎవరూ చెప్పలేదని అన్నట్టు సమాచారం. ఇద్దరి తీరుపై కేసీ వేణుగోపాల్ ఒకింత ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య కో-ఆర్డినేషన్ ఉండాలని, ఒకరి సమాచారం మరొకరికి ఇవ్వాలని ఆయన కాస్త గట్టిగానే మందలించినట్టు తెలిసింది.
విషయం ఇంతటితో ఆగలేదు. మీనాక్షి పాదయాత్ర తేదీలను కుదించడంతోపాటు ఆ పాదయాత్రపై మీనాక్షి మార్క్‌ను తొలగించేందుకు కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించినట్టు తెలిసింది. తొలుత పాదయాత్ర మీనాక్షి ఆధ్వర్యంలో జరుగుతుందని ప్రకటించారు. కానీ, ఇప్పుడు మాత్రం పాదయాత్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతుందని, ఇందులో మీనాక్షి ఒక అతిథిగా పాల్గొంటారని ప్రకటించారు. దీంతో నిన్నటివరకు ‘సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్’గా ఉన్న మీనాక్షి ఈ దెబ్బతో ‘గెస్ట్‌రోల్’ కిందకు మారిపోయారు. దీనిపై కొందరు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మీనాక్షి పాదయాత్ర పెట్టిందే క్షేత్రస్థాయిలో పార్టీ, ప్రభుత్వంపై వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికేనని, ఇప్పుడు దీన్ని కూడా ముఖ్యమంత్రి వర్గం హైజాక్ చేస్తే ఇక్కడి వాస్తవ పరిస్థితులు అధిష్ఠానానికి ఎలా తెలుస్తాయని, సమాచారం ఎలా వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇన్చార్జ్ మీనాక్షి పాత్రను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మీనాక్షి పాత్ర ఏమీలేదని, తాను ఏది అనుకుంటే అదే చేస్తానని చెప్తున్నట్టు తెలిసింది. దీన్ని మరింత బలంగా చెప్పడం కోసమే మీనాక్షి పాదయాత్రను కుదించినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
5,6 తేదీల్లో మీనాక్షి పాదయాత్ర ఉండటంతో బీసీ రిజర్వేషన్ల కోసం తలపెట్టిన ఢిల్లీ యాత్రను వాయిదా వేసే ఆలోచన చేస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మంగళవారం ప్రకటించారు. అయితే, ఇందుకు విరుద్ధంగా ఢిల్లీ యాత్రను యథాతథంగా ఉంచి, మీనాక్షి పాదయాత్ర తేదీల్లో మార్పులు చేశారు. 5, 6 తేదీల్లో ఆమె పాదయాత్రను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆమె పాదయాత్ర ఈ నెల 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు మాత్రమే కొనసాగనున్నది. వాస్తవానికి ఆమె పాదయాత్ర 31 నుంచి 6వ తేదీ వరకు జరగాల్సి ఉన్నది. పీసీసీ అధ్యక్షుడు ఆ షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత 24 గంటలు గడవకముందే మీనాక్షి పాదయాత్రను కుదించడం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డికి మీనాక్షి పాదయాత్ర ఇష్టం లేదనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
మీనాక్షి పాదయాత్రను అడ్డుకునేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించడంపై పలువురు సీనియర్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఆమెతో పెట్టుకోవడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి తప్పు చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. మీనాక్షి ఆషామాషీ వ్యక్తి కాదని, ఇలాంటివి ఆమె ఎన్నో చూశారని, సీఎం రేవంత్‌రెడ్డికి ఎక్కడ ముకుతాడు వేయాలో ఆమెకు తెలుసని అంటున్నారు. పాదయాత్ర విషయంలో మీనాక్షితో ఢీ కొట్టడం ద్వారా రేవంత్‌రెడ్డి భవిష్యత్‌లో పెద్ద ప్రమాదాన్నే కొనితెచ్చుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఆమె తన పాదయాత్రను కుదించడాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదని చెప్తున్నారు. పలు కారణాలతో ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నా.. ఆమె ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. భవిష్యత్‌లో కీలక సమయంలో పంజా విసరడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.