హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గం చేస్తున్న తప్పుడు ప్రచారానికి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని ఎన్డీయే అధినాయకత్వం కుండబద్దలు కొట్టింది. ‘కేసీఆర్ హయాంలో రూ.6 లక్షల కోట్లు, రూ.7 లక్షల కోట్లు, రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారు. అవి తీర్చడానికి ప్రతినెల రూ.6,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది’ అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాల్లో చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని మరోసారి తేటతెల్లమైంది. చివరికి కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రంలో పేర్కొన్న అప్పుల లెక్క రూ.6,71,757 కోట్లు కూడా అసత్యమని తేలిపోయింది.
పదేండ్ల పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.2,80,916 కోట్లు అని గణాంకాలతో సహా నిరూపించింది. ఈ నిధులను సద్వినియోగ పరచడం ద్వారా తెలంగాణలో భారీగా ఆస్తుల కల్పన కూడా జరిగిందని స్పష్టం చేసింది. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ప్రతి సంవత్సరం సేకరించిన రుణం ఎంత? ఎకడి నుంచి సేకరించింది? పెంచిన ఆస్తులు ఎన్ని?’అని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పార్లమెంట్లో ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లిఖితపూర్వంగా సమాధానం ఇచ్చారు. పదేండ్లలో ఏటా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తులను స్పష్టంగా వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక అవసరాలపై కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్ర రుణాలు రూ.72,658 కోట్లుగా ఉండేవని, బీఆర్ఎస్ పాలనలో రూ.6,71,757 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. అయితే ఈ లెక్కలు శుద్ధ అబద్ధమని కేంద్రం ఇచ్చిన సమాధానం తేల్చి చెప్పింది. కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ధ్రువీకరించిన రాష్ట్ర ఆర్థిక ఖాతాల ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా గణాంకాలు అందించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఆస్తులు రుణాల కంటే గణనీయంగా, వేగంగా పెరిగాయని వెల్లడించాయి.
2014-15లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మొత్తం ప్రజా రుణం రూ.69,603 కోట్లుగా పేర్కొన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2024 మార్చి 31).. రుణాలు రూ. 3,14,545 కోట్లకు పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. రుణంలో రూ.3,14,545.68 కోట్ల ఓపెన్ మారెట్ రుణాలు, రూ. 18,057.16 కోట్ల కేంద్ర రుణాలు, రూ. 13,194.39 కోట్ల స్వయంప్రతిపత్తి సంస్థల రుణాలు, రూ. 999.62 కోట్ల వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవర్ డ్రాఫ్ట్‌లు, రూ.4,723.16 కోట్ల కేంద్ర ప్రభుత్వ ఎన్ఎస్ఎస్ఎఫ్ జారీ చేసిన ప్రత్యేక సెక్యూరిటీలు ఉన్నాయి. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్రం మొత్తం రుణం రూ.3,50,520.39 కోట్లు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏకంగా ఈ సంఖ్యను దాదాపు రెట్టింపు చేసి, ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించింది.
బీఆర్ఎస్ హయాంలో అప్పు చేసి తెచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. పదేండ్లలో ఆస్తుల కల్పన భారీగా పెరిగినట్టు వెల్లడించడమే ఇందుకు నిదర్శనం. 2014-15 నాటికి రాష్ట్ర ఆస్తుల విలువ రూ.83,143 కోట్లు కాగా, 2023-24 నాటికి ఆస్తులు రూ.4,15,099 కోట్లకు పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. రుణాల కంటే ఆస్తులు సుమారు రూ.64,579 కోట్లు అధికం. ఇది బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పటిష్ఠతకు, కేసీఆర్ విజన్‌కు సంకేతమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2014-15 నుంచి 2017-18 వరకు తెలంగాణ రాష్ట్ర రుణాలు, ఆస్తులు సమానంగా పెరిగాయి. అయితే 2018-19 నుంచి రుణాల కంటే ఆస్తుల విలువ వేగంగా పెరగడం ప్రారంభమైంది.
ఈ కాలంలో ప్రతి ఆర్థిక సంవత్సరం ఆస్తులు రుణాల కంటే సగటున రూ.50వేల కోట్లకు పైగా పెరిగాయి. ఈ పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలకు నిదర్శనం. బీఆర్ఎస్ పదేండ్ల్ల పాలనలో సుమారు రూ.2.80 లక్షల కోట్ల రుణ సమీకరణ చేయగా, దాదాపు రూ.3.32 లక్షల కోట్ల ఆస్తులను సృష్టించింది. రుణంగా సేకరించిన ప్రతి రూపాయిని కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి, మౌలిక సదుపాయాలు, ప్రజా సౌకర్యాల కల్పనలో భారీ మూలధన పెట్టుబడులు పెట్టిందని, ఫలితంగా ఆస్తులను జోడించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్, మిషన్ భగీరథ, రహదారి నెట్వర్లు, ఆరోగ్యం, విద్యా మౌలిక సదుపాయాల వంటి ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడి పెట్టిందని తెలిపారు. తద్వారా రాష్ట్ర రుణాల కంటే ఆస్తులు గణనీయంగా పెరుగుతూ ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది వేసిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా నాశనమైందన్న కాంగ్రెస్, బీజేపీ వాదనలను ఇకనైనా కట్టిపెట్టాలని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఓపెన్ మారెట్ రుణాలు – రూ.3,14,545.68 కోట్లు
కేంద్ర ప్రభుత్వం నుంచి – రూ.18,057.16 కోట్లు
స్వయంప్రతిపత్తి సంస్థల నుంచి – రూ.13,194.39 కోట్లు
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు, ఓవర్ డ్రాఫ్ట్ – రూ.999.62 కోట్లు
ప్రత్యేక సెక్యూరిటీల ద్వారా – రూ.4,723.16 కోట్లు
మొత్తం అప్పు రూ.3,50,520.39 కోట్లు