KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన, పోరాట స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, హైదరాబాద్ నగర ప్రజల తరఫున సెల్యూట్ చేస్తున్నాం. అసామాన్య ప్రతిఘటన, గొప్ప పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆ నాడు ఉస్మానియా, కాకతీయ, మహ్మతాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల్లో ఎలాంటి పోరాటమైతే ఆనాడు చూశామో.. అంతకు ధీటుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ.. ఈ పోరాటంలో వీరోచితంగా ముందుకు నడుస్తున్న తమ్ముళ్లు, చెల్లెల్లకు హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజల తరఫున సెల్యూట్ చేస్తూ.. ధన్యవాదాలు తెలుపుతున్నా’నన్నారు.
‘పదిరోజులుగా ఇంత పెద్ద పోరాటం చేస్తుంటే.. ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వమైతే వారిని పిలిచి మాట్లాడాలి. ఆందోళనను విరమింపజేసే ఆలోచన చేయాలి. కనీసం వారిని చర్చలకు పిలవకపోయినా.. అక్కడికయినా ప్రభుత్వ ప్రతినిధులను పంపాల్సింది. ఓ మంత్రిని లేదంటే బాధ్యతగల అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాల్సింది. కానీ, ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? ఆందోళన చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంట నక్కలు.. అక్కడ జింకలు లేవు గుంటనక్కలు ఉన్నయని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నడు. ఇంకో మంత్రి పేమెంట్ బ్యాచ్ అంటూ విద్యార్థులను చిన్నగా చూసేవిధంగా, అల్పంగా చూపేవిధంగా నోరుపారేసుకుంటున్నడు. డిప్యూటీ సీఎం అక్కడ జంతువులే లేవు.. అదంతా ఏఐ జనరేటెడ్ అయిన ఇమేజ్లు అంటూ తన కృత్రిమ మేధస్సును ఆయన బయటపెట్టుకున్నడు’ అంటూ విమర్శించారు.
‘మేం ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే.. ఇది దాయాదుల పోరు కాదు. ఆస్తి తగాదా అంతకంటే కాదు. భూమి నీదా.. నాదా అని కొట్టుకునేందుకు రేవంత్రెడ్డి ఆ పిల్లలకు వేలువిడిచిన మేనమామ, బాబాయో.. తాతనో కాదు. రేవంత్రెడ్డి ఈ రోజు నాలుగుకోట్ల మంది ఉన్న రాష్ట్రానికి సీఎం. నాలుగుకోట్ల మంది కట్టే పన్నులతో జీతం తీసుకునే ఓ ప్రతినిధి. నిజంగా చెప్పాలంటే.. మా పెద్దలు కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు.. రూలింగ్ పార్టీ కాదు.. సర్వింగ్ పార్టీ అని పిలవాలని అంటారు. ముఖ్యమంత్రి అనేవాడు ఈ రాష్ట్రానికి బాసో.. నియంతనో.. చక్రవర్తో, రాజో కాదు. ఒక పెద్ద పాలేరులా, పెద్ద సర్వెంట్ మాదిరిగా పని చేయాల్సిన బాధ్యతలు ఉన్న వ్యక్తి. మంత్రి అయినా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయినా ప్రజా సేవకులం. ఈ విషయం మరిచిపోయి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానన్న ఇంగితం కోల్పోయి రేవంత్రెడ్డి చేస్తున్న దురుసు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో.. వారికి కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తున్నాను. మీతో పాటు మనమందరం పబ్లిక్ సర్వెంట్స్మే. ఇదేం పటేల్, పట్వారీ వ్యవస్థ కాదు. నియంతృత్వం కాదు. ఇక్కడ రాజులు, చక్రవర్తులు లేరు’ అన్నారు.
‘నువ్వు ప్రజలతో ఎన్నుకోబడి ఉన్న ఎమ్మెల్యేవి మాత్రమే. ఆ ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ మంది ఎన్నుకుంటే.. ముఖ్యమంత్రివి అయ్యావు. రాజువు కాదు.. నియంతవు కావు. పేరుకేమో ప్రజాపాలన. కానీ, చూస్తే మరి ఈ రోజు ప్రజాస్వామిక స్ఫూర్తి కనీసం అణుమాత్రం కూడా మీరు చేసే పనుల్లో కనిపిస్త లేదు. దేశం మొత్తం చూస్తున్నది. ప్రజా పాలన అనే అర్థానికి పాతరేసి బుల్డోజర్లు, జేసీబీలతో.. మేం పాలకులం.. మీరంతా కాలికింద చెప్పుల్లా ఉండాలనే విధంగా.. బానిసలు ఉన్నట్లుగా ఇక విచిత్రమైన మానసిక రోగంతో బాధపడుతున్నట్లుగా రేవంత్రెడ్డి ప్రభుత్వ వ్యవహరం ఉంది. మాట్లాడితే గవర్నమెంట్ భూమి అంటున్నరు. రోడ్లు, చెరువులు, గుట్టలు, రాళ్లు రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం వచ్చినట్లు చేస్తా? నా భూమి అన్నట్లు వ్యవహరిస్తున్నరు. గవర్నర్ కస్టోడియన్ మాత్రమే.. ప్రజలు మాత్రమే ఓనర్లు. ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తవు మాత్రమే. నేను రాజును.. ఇది నా రాజ్యం అన్నట్లుగా వ్యవహరించొద్దు. అది యూనివర్సిటీ భూమా? గవర్నమెంట్ భూమా అనే పంచాయితీని పక్కనపెడితే.. నువ్వు కేవలం తాత్కాలిక ధర్మకర్తవు మాత్రమే. దాన్ని కాపాడాల్సింది పోయి.. ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తానంటే కుదరదు’ అంటూ ఘాటుగా స్పందించారు.