ఖైరతాబాద్, జూన్ 20: ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానం 30 ఏండ్లకు చేరుతున్న సందర్భంగా జూలై 7న వరంగల్‌లో మాదిగల ఆత్మగౌరవ కవాతు నిర్వహించనున్నట్టు సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సామాజిక ఉద్యమాల్లో ఎమ్మార్పీఎస్ మాత్రమే 30 ఏండ్లు పూర్తిచేసుకుందని చెప్పారు. ఎమ్మార్పీఎస్ అన్ని వర్గాల కోసం ఉద్యమం చేసిందన్నారు. మాదిగల మద్దతు వల్లే రాష్ట్రంలో బీజేపీకి 21 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాదిగలు బలంగా ఉన్న ప్రతి చోట బీజేపీ గెలిచిందన్నారు.
బీజేపీ ఓటు బ్యాంకు పెరగటానికి పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డి సహకరించారని చెప్పారు. రేవంత్‌రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీలకు దూరమైందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశం కీలకంగా మారిన తరుణంలో కాంగ్రెస్ నుంచి ఒక్క మాదిగ ఎంపీ లేకుండా చేశారని, ఇది మాదిగలు బీజేపీకి మద్దతుగా నిలిచేందుకు దోహదపడిందని తెలిపారు. జూలై 7 వరకు సుప్రీంకోర్టు సెలవులు ఉంటాయని, ఆ వెంటనే వర్గీకరణపై తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్, జాతీయ కార్యదర్శి విజయ్, ఎంఏఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ , ఎంఎస్పీ అధ్యక్షుడు టీవీ నరసింహ, శివకుమార్, విజయ్ పాల్గొన్నారు.