హనుమకొండ, డిసెంబర్ 25 :తెలంగాణకు నంబర్‌వన్ ద్రోహి సీఎం రేవంత్‌రెడ్డి అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి ధ్వజమెత్తారు. తెలంగాణ అనడానికి వీలులేని సమయంలో పార్టీని స్థాపించి చావు అంచుల వరకు వెళ్లి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ర్టాన్ని పదేండ్లలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కేసీఆర్‌ను విమర్శించే స్థాయి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని ధ్వజమెత్తారు. గురువారం ఆయన హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెల్లారి లేస్తే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే మీ ఎజెండా ద్వేషమే తప్ప అభివృద్ధి కాదని మరోసారి రుజువైందని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారని తెలిపారు. ‘రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన ఘనకార్యాలను గమనించిన కేసీఆర్ ఇటీవల ఒక ప్రెస్‌మీట్‌లోనే మీ అసమర్థ, అవినీతి, దిశ దశ లేని పాలనను ఎండగట్టారు. రానున్నరోజుల్లో సభలు, సమావేశాలు జరిగితే ప్రజలు ఎకడ తిరగబడతారో అన్న భయం ఆవహించి, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు బజారు భాషలో మాట్లాడటం అత్యంత దుర్మా ర్గం’ అని మండిపడ్డారు.
‘ఫార్ములా-ఈ రేస్‌ను కేటీఆర్ రాష్ట్రానికి తీసుకొస్తే దుబా రా అంటారు. పుట్ బాల్ ఆటగాడు మెస్సీ తో ఈవెంట్ పెట్టి సింగరేణి నిధులు ఖర్చు చేస్తే దుబారా కాదా? ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీశ్‌రావుపై ఉపయోగించే భాష రేవంత్‌రెడ్డి దిగజారుడుకు నిదర్శనం’ అని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై ద్వేషమే తప్ప.. అభివృద్ధి ఎజెండా లేదని, రెండేండ్ల పాలనలో ఏ ఒక ప్రధాన అభివృద్ధి చేపట్టలేదని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ గురిం చి అడిగిన ఏ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదని రేవంత్‌ను విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు మాని ఉన్నతంగా వ్యవహరించాలని సూచించారు.