రైతుల మోటర్లకు మీటర్లు పెడితే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రి మరోసారి అబద్ధాలు చెప్తున్నడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో.. రైతుల మీద రేవంత్‌రెడ్డికి అంతే ప్రేమ ఉన్నది. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతదని చెప్పిండు. ఇప్పడు అధికారంలోకి వచ్చాక దాన్ని ఆచరణలోకి తెస్తున్నడు.
-కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కేవలం రైతులకు అందిస్తున్న ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేసేందుకే ప్రత్యేకంగా రైతు డిస్కమ్ తెస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో రైతు డిసమ్ అంటే రైతన్న మెడకు ఉరి పెట్టినట్టేనన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు రైతు డిసమ్ ద్వారా ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.
తెలంగాణ రైతన్నలపై జరుగుతున్న ఈ కుట్రను ప్రతిపౌరుడూ వ్యతిరేకించి వారికి అండగా నిలువాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రేవంత్‌రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీ నెరవేర్చడనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. అందుకే రైతు డిసమ్ పేరిట రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలన్నీ ముమ్మాటికీ అబద్ధాలేనని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక హామీనీ అమలు చేయకుండా, తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు, రైతులు గుర్తుంచుకోవాలని కోరారు.
అన్నదాతల కండ్లల్లో ఆనందం చూడాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటును తీసుకొస్తే.. దాన్ని ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రైతు డిస్కమ్‌ను తెస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు . రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతన్నలకు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించాడని, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో ఎకడా లేని విధంగా కేసీఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్తు పథకాన్ని రైతన్నలకు అందకుండా చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. లోపల ఇంతటి దారుణమైన రైతు వ్యతిరేక కుట్రను దాచుకొని, పైకి మాత్రం ఉచిత కరెంట్ కోసమే ప్రత్యేక రైతు డిసమ్ తెస్తున్నామని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంట్ కోతను పూర్తిగా తీర్చేలా చేసింది కేసీఆర్ కాదా? రాష్ట్రం ఏర్పడకముందు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎకడపడితే అకడ కరెంట్ కోతలు ఎంత తీవ్రంగా ఉండేవో గుర్తు చేసుకోవాలి’ అని కేటీఆర్ సూచించారు. కరెంట్ కోసం రైతన్నలతో పాటు చివరికి పారిశ్రామికవేత్తలు కూడా పరిశ్రమలకు హాలిడేలు ప్రకటించిన పరిస్థితిని మర్చిపోవద్దని చెప్పారు. అంతటి దుస్థితి నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లోనే 65 ఏండ్లలో కాంగ్రెస్ చేయని పనిని చేసి చూపెట్టారని, 24 గంటల కరెంట్ అందించిన నాయకుడు ముమ్మాటికీ కేసీఆరేనని తేల్చిచెప్పారు. 79 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల విద్యుత్తు ఇచ్చిన నాయకుడు కేసీఆరేనని కొనియాడారు. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తానన్న రేవంత్ రెడ్డి, చివరికి రైతన్నలకు ఇచ్చే 24 గంటల కరెంట్‌ను కూడా ఆపే కుట్ర చేస్తున్నాడని నిప్పులు చెరిగారు.
అన్నదాతల కండ్లలో ఆనందం చూడాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంటు తీసుకొస్తే.. దాన్ని ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రైతు డిస్కమ్ తెస్తున్నది. లోపల దారుణమైన రైతు వ్యతిరేక కుట్రను దాచుకొని, పైకి ఉచిత కరెంట్ కోసమే ప్రత్యేక రైతు డిసమ్ తెస్తున్నామని రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పుడు హాస్యాస్పదంగా ఉన్నది.
-కేటీఆర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి రూపాయి అప్పు కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలను వంచిస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులతో రైతులకు రూ.73,000 కోట్ల రైతు బంధు ఇచ్చారని, రెండు సార్లు రూ.30,000 కోట్ల రుణమాఫీ చేసి రైతన్నను ఆదుకున్నారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని, పంజాబ్, హర్యానాలను దాటి తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా నిలిచిందంటే అది కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల పుణ్యమేనని స్పష్టంచేశారు. రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే ఇప్పటి వరకు రూ.నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసిన రేవంత్‌రెడ్డి, ఆ డబ్బు ఎవరికిచ్చారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్లలో హైదరాబాద్‌ను ఎలాంటి అభివృద్ధి చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కంటోన్మెంట్ ఉపఎన్నిక సందర్భంగా పొంగులేటి లాంటి మంత్రులు వచ్చి 6,000 ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. రెండున్నరేండ్లు పూర్తయినా ఒక ఇంటిని కూడా కంటోన్మెంట్‌కు, హైదరాబాద్ నగర ప్రజలకు ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరానికి అద్భుతమైన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, బ్రిడ్జ్‌లు, 20,000 లీటర్ల ఉచిత తాగునీరు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, జీవో 58, 59 ద్వారా పేదలకు ప్రభుత్వ భూములు అందించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక హైడ్రా భూతంతో వేలాదిమంది పేదల ఇండ్లను కూలగొడుతున్నదని మండిపడ్డారు.
కంటోన్మెంట్లో ఉన్న రక్షణ శాఖ భూములు ఇస్తే, అటు కరీంనగర్, నిజామాబాద్ వైపు సైవేల నిర్మాణం చేస్తామని పదులసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా ఏనాడూ స్పందించలేదని చెప్పారు. చివరికి అప్పటి ప్రభుత్వం చేసిన ఒత్తిడి ఇటీవల ఫలించిందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆర్మీ అధికారులు రోడ్లను ఎప్పటికప్పుడు బంద్ చేస్తే, కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు తీర్చామని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరానికి అప్పటి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని అన్ని సీట్లలో బీఆర్ఎస్ను గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో శ్రేణులు సమిష్టిగా పనిచేసి కంటోన్మెంట్లో గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్, గజ్జెల నగేశ్ పాల్గొన్నారు.