MLA Vakiti Srihari | మహబూబ్‌నగర్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్న వేళ.. సొంత పార్టీలో కుంపటి రగిలింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సొంత జిల్లా ఎమ్మెల్యేనే తిరుగుబావుటా ఎగురవేశారు. ‘ఇది ప్రజాపాలనా? రెడ్డి పాలనా..? ఎవరి చేతుల్లోకి వెళ్లిపోయిందిరో తెలంగాణ’ అంటూ ఓ బీసీ ఎమ్మెల్యే వాట్సాప్‌లో చేసిన పోస్టులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి.
ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి..‘మహబూబ్‌నగర్ ఎంపీగా వంశీచంద్‌రెడ్డిని గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేసే బాధ్యతను తీసుకుంటానని ప్రకటించారు’. రాష్ట్రంలో ముదిరాజ్ కులం నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాత్రమే ఉండడంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు.
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా తనకు అమాత్యయోగం పక్కాఅని లెక్కలు వేసుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ఎంపీగా డీకే అరుణ గెలుపొందడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలిసింది. దీనికంతటికీ మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లోని ఎమ్మెల్యేలే కారణమని సీఎం రుసరుసలాడినట్టు సమాచారం. ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లన్నీ కాంగ్రెస్‌కు పడతాయని భావించినా.. కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. దీన్ని సాకుగా చూపి వాకిటి శ్రీహరికి మొండిచెయ్యి చూపించినట్టు తెలిసింది.
జాబితాలో వాకిటి పేరు గల్లంతు
ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీకి పంపించిన జాబితాలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు గల్లంతయ్యింది. బహిరంగంగా ప్రకటించి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన కంగుతిన్నారు. ముదిరాజ్ బిడ్డకు మంత్రి రాకపోవడం ఏమిటని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తన అనుచరులతో వాపోయారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం తన వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా అవాక్కయ్యారు.
ఢిల్లీలోనే ఉండి మక్తల్ ఎమ్మెల్యే ఓ వాట్సాప్ గ్రూపులో పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్‌రెడ్డి, సీపీఆర్వో అయోధ్యరెడ్డి’ అంటూ రెడ్డిల పేర్లను ఊటంకిస్తూ దాదాపు 33 మంది రెడ్డిల పేర్లను పోర్ట్‌ఫోలియోలను పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇది ప్రజా పాలననా.. రెడ్డిల పాలననా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అంటూ పోస్ట్‌ను ముగించారు. దీనిపై ఇంటలిజెన్స్ వర్గాలు హుటాహుటిన సీఎంవోకు సమాచారం అందించాయి. ఏమైందో ఏమో కానీ నిమిషాల్లోనే పోస్టును డిలీట్ చేశారు. అయితే, అప్పటికే కొందరు ఈ పోస్టులను స్క్రీన్షాట్లు తీసి వాట్సాప్ గ్రూపులో వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై మక్తల్ ఎమ్మెల్యేను వివరణ కోరేందుకు ప్రయత్నించగా బిజీగా ఉన్నట్లు పీఏ సమాచారం అందించారు.
ఇదిలా ఉంటే హస్తం సింబల్‌తో గెలిచిన బీసీ ఎమ్మెల్యేలంతా ఒక తాటిపైకి రావాలని ప్రత్యేక గ్రూప్‌ను కూడా క్రియేట్ చేసినట్టు సమాచారం. ఈ గ్రూప్‌లో సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు విమర్శలు చేసుకుంటున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే శ్రీహరి అనుచరులు రెడ్డిలపై గరంగరమవుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోగానే ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి అగ్రవర్ణాలపై విరుచుకుపడ్డారు. పరోక్షంగా ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డిలపై దుమ్మెత్తిపోశారు.
బీసీ నేతల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం..
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి ఏడు సెగ్మెంట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వెలమ సామాజికవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బీసీ వర్గానికి చెందిన వారు.
సొంత జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టడంతో ఉమ్మడి జిల్లా నేతలంతా సంతోషపడ్డారు. కాగా, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం.. అదే నియోజకవర్గానికి చెందిన శివసేనారెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన గుర్నాథ్‌రెడ్డికి పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కేటాయించినట్టు ప్రచారం జరిగింది. వీరందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడంతో బీసీలంతా నిరాశకు గురయ్యారు. ఇక ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కూడా బీసీలను కాదని జీవన్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు.
ఇక ఎంపీ టికెట్‌ను కూడా చల్లా వంశీచందర్‌రెడ్డికి కట్టబెట్టారు. దీంతో బీసీలంతా ఏకమై ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ను మట్టి కరిపించారు. పార్టీ కోసం కష్టపడిన చాలామంది నేతలు పదవులు వస్తాయని ఆశించి భంగపడ్డారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నా.. ఆయా నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను ఇన్చార్జిలుగా పెట్టి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మక్తల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినట్లు ఆశ చూపి లిస్ట్‌లో పేరు లేకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎంకు బీసీ నేతల తిరుగుబాటు కలవరపాటుకు గురిచేస్తున్న్నది.