Balka Suman | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పోలికా నీది అంటూ ధ్వజమెత్తారు. హరీశ్‌రావుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్లుగా మాట్లాడాలని హితవు పలికారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీపై రోజుకో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేశారని మండిపడ్డారు.
రైతు రుణమాఫీ మోసాన్ని పక్కదారి పట్టించడానికే కేసీఆర్, హరీశ్‌రావుపై ఇష్టారీతిన మాట్లాడారని బాల్క సుమన్ విమర్శించారు. హరీశ్‌రావు గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. నిత్యం ప్రజల సంక్షేమం ఆలోచించే వ్యక్తి హరీశ్‌రావు అని.. ఆయన మడమతిప్పని నాయకుడు అని తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యవహారం తెలంగాణ సమాజానికి అర్థం అయ్యిందని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టదని.. వాళ్ల భరతం పడతామని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి దావోస్, అమెరికా పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ప్రకటించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా అంటూ ప్రశ్నించారు. రూ.4వేల పింఛన్ అమలు చేయనుందుకు, మహిళలకు స్కూటీలు ఇవ్వనందుకు, ఇచ్చిన హామీలు అమలు చేయనుందుకు రేవంత్ రెడ్డి ఏట్లో దూకాలని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడని, అక్కడ కనీస స్థాయిలో వసతులు లేకుండా చేశారని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డికి ఇదే చివరి పదవి అని బాల్క సుమన్ విమర్శించారు. ఆయనకు భవిష్యత్‌లో ఏ పదవి వచ్చేది లేదని అన్నారు. రేవంత్ రెడ్డికి నడుమంత్రపు సిరి వచ్చిందని ఎద్దేవా చేశారు. రేవంత్ జాక్‌పాట్ సీఎం అని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే పనితీరుతో పోటీపడాలని సూచించారు. ఇదే ధోరణితో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో బొక్కా బోర్ల పడటం ఖాయమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని హుందాగా వ్యవహరించాలని, పద్దతిగా మాట్లాడాలని సూచించారు.
బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని బాల్క సుమన్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, మరో 50 ఏండ్లుగా బలంగా ఉండేందుకు పార్టీ నాయకత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. త్వరలోనే బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అధ్యయనం చేస్తామని తెలిపారు.