హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ) : మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన గోపాలమిత్ర వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. పశువైద్య శాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పాడిరైతుల ఇంటివద్దే అత్యవసర సేవలు అందిస్తున్న గోపాలమిత్రలు సమస్యలతో సతమతమవుతున్నారు. తమకు ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.11,050 వేతనం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని, ఇచ్చే జీతం కూడా 9 నెలలుగా రాకపోవడంతో తమ బతుకులు దినదినగండంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత 23 ఏండ్లుగా క్షేత్రస్థాయిలో పాడిరైతులకు సేవలందించడంతోపాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ, సామాజిక కార్యక్రమాల్లోనూ గోపాలమిత్రలు భాగస్వాములవుతున్నారు. వాస్తవానికి గోపాలమిత్రలు పశువులకు కృత్రిమ గర్భధారణ సేవలు మాత్రమే అందించాల్సి ఉన్నప్పటికీ, పశుసంవర్ధకశాఖ నిర్వహిస్తున్న పశు గర్భకోశ వైద్యశిబిరాలు, నట్టలనివారణ, పశుగ్రాసాల పెంపకం, పశువులకు టీకాలు తదితర కార్యక్రమాల్లోనూ సేవలందిస్తున్నారు. ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ తమకు సకాలంలో వేతనాలు అందడం లేదని వాపోతున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2022లో నాటి సీఎం కేసీఆర్ వారి సేవలను గుర్తించి రూ.8,500 ఉన్న వేతనాన్ని రూ.11,050కి పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ పెరగకపోవడంతోపాటు పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబం గడవడం కష్టంగా మారిందని గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇన్నేండ్లుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడమే కాకుండా, కాం గ్రెస్ ప్రభుత్వం 9నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.