పేదల ఇండ్లు కూల్చేసి, వారి వంద గజాల జాగనో.. బస్తీలను నేలమట్టం చేసి ఎకరం, అరెకరం భూమినో స్వాధీనం చేసుకుని ఏదో ఘనకార్యం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. పేదల్ని బజారుపాల్జేసి ఎంత భూమిని కాపాడామో లెక్కలు వల్లిస్తున్నది. కానీ సుల్తాన్‌పల్లిలోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని, వందల ఎకరాలను కొందరు పెద్దలు స్వాహా చేస్తుంటే మాత్రం ఇదే సర్కారు కావాలనే మౌనాన్ని ఆశ్రయిస్తున్నది.కేసీఆర్ హయాంలో భూముల పరిరక్షణకు ప్రభుత్వం సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. అది మంచిరేవుల కావొచ్చు.. కోకాపేట కావొచ్చు.. పుప్పాలగూడ, కేపీహెచ్‌బీ కావొచ్చు.
సర్కారీ స్థలాల పరిరక్షణే ప్రధానలక్ష్యంగా రెవెన్యూశాఖను పరుగెత్తించింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లి దశాబ్దాల నాటి పెండింగ్ కేసులనూ కొలిక్కితెచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సర్కారీ భూముల పరిరక్షణను గాలికొదిలేసింది. న్యాయపోరాటం చేయాల్సిన సర్కారే.. తన ‘సైలెన్స్’తో కొందరి స్వాహాపర్వానికి పరోక్షంగా సాయపడుతున్నది. ఎందుకంటే.. అవి 3,375 కోట్ల విలువైన భూములు! మొత్తం 225 ఎకరాలు! ఆ భూముల వెనుక కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్నారు! ఆయన వెనుక కాంగ్రెస్ ప్రభుత్వంలోని పలువురు పెద్దలు ఉన్నారు! ఈ వ్యవహారం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు బంధువు ఉన్నారు!
Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధిలో దశాబ్దాలపాటు న్యాయ చిక్కుల్లో ఉన్న ప్రభుత్వ భూములను కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో కాపాడుకున్నది. కింది కోర్టులు.. హైకోర్టులు.. ఆ పైకోర్టుల వరకూ వెళ్లయినా ప్రైవేటు వ్యక్తులకు అవి దక్కకుండా దాదాపు రూ.50-60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించుకున్నది. సర్కారు ల్యాండ్ బ్యాంకును బలోపేతం చేసింది. ఎక్కడా ప్రైవేటు వ్యక్తులతో రాజీ పడకుండా ప్రభుత్వ భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించేలా చర్యలు తీసుకున్నది. కొందరు సొంతపార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గలేదు. భూములను ప్రయివేటుపరం కానివ్వలేదు. కానీ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఓ ఎమ్మెల్యే మాత్రం ఆ భూముల కోసమే పార్టీ ఫిరాయించారన్నది బహిరంగ రహస్యం. సుల్తాన్‌పల్లిలోని 3,375 కోట్ల విలువైన 225 ఎకరాల ప్రభుత్వ భూమిని సదరు ఎమ్మెల్యే చెరపట్టారు!
కేసీఆర్ హయాంలో వాటిని తమపరం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా వీలుకాకపోవడం, పైగా ప్రభుత్వం పకడ్బందీగా న్యాయపోరాటం చేయడంతో వెనక్కి తగ్గిన ఆయన.. ఇటీవల కాంగ్రెస్‌లో చేరి తాను ఆక్రమించిన భూములకు అధికారిక ముద్ర వేయించుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వానికి చెందిన ఆ భూములపై న్యాయపోరాటం చేసి కాపాడాల్సిన కాంగ్రెస్ సర్కారు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నది. పదేండ్లు కేసీఆర్ కాపాడిన ప్రభుత్వ భూములను.. రేవంత్ సర్కార్ ఎందుకు కాపాడలేకపోతున్నదన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వక మౌనం అక్రమార్కులకు అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలోని సర్వే నెంబరు 391/1 నుంచి 20 వరకు 393 ఎకరాల భూమి. ఇందులోని 142.39 ఎకరాల భూమిని 1961లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు కేటాయించింది. అనంతరం మూడు దశాబ్దాల తర్వాత అంటే 1990 దశకంలో ల్యాండ్ అసైనీలు ఒక వ్యక్తికి జీపీఏ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో 2005లో అప్పటి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. దీంతో అసైనీలు హైకోర్టును ఆశ్రయించారు. 2010లో హైకోర్టు సింగిల్ జడ్జి అసైనీలకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత పటిష్టమైన ఆధారాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయపోరాటం చేసింది. ఫలితంగా 2022లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. గ్రేహౌండ్స్‌కు భూ కేటాయింపును హైకోర్టు సమర్ధించింది. దీంతో అసైనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా న్యాయపోరాటం చేసింది. పక్కా ఆధారాలతో వాదనలు వినిపించింది. దీంతో నిరుడు ఆగస్టులో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఎకరా రూ.35 కోట్ల చొప్పున రూ.5వేల కోట్లు విలువైన భూమిని కేసీఆర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాలకు దానిని వినియోగించింది.
సుల్తాన్‌పల్లి భూముల వ్యవహారం గతంలోనే క్రమంగా న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా రైతులు వర్సెస్ తులసీరాంగా కేసులు మొదలుకాగా ఇందులో తెలంగాణ ప్రభుత్వం తరఫున రెవెన్యూశాఖ కూడా గతంలో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ భూములు జాగీర్దారీ భూములైనందున.. ఉంటే రైతుల చేతుల్లో ఉండాలిగానీ ప్రైవేటు వ్యక్తుల కొనుగోలు చెల్లదని రెవెన్యూశాఖ తరఫున వాదనలు కోర్టు ముందుకు పోయాయి. అయితే ఇవి జాగీర్దారీ భూములు కావనేది తులసీరాం తరపు న్యాయవాది వాదన. ఇలా ఏండ్ల తరబడి కోర్టుల్లో వివాదం కొనసాగుతూ వచ్చింది.
ఈ వ్యవహారం ఒకవైపు హైకోర్టుతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టులోనూ ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీను తారుమారైంది. కొంతకాలంగా విజన్ రిసార్ట్స్ వాళ్లు భూమిలోకి ప్రవేశించి చదును చేసి, చుట్టూ రేకుల ప్రహరీని ఏర్పాటు చేశారు. కోర్టులో కేసు నడుస్తుండగానే.. పరిష్కారమైనట్టుగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇది విజన్ రిసార్ట్స్‌కే చెందినదిగా ఆ బోర్డుల్లో పేర్కొన్నారు. అనంతరం నెమ్మదిగా హైకోర్టు.. ఆపై ఇటీవల రంగారెడ్డి కోర్టులో కేసు డిస్పోజ్ అయ్యింది. ముఖ్యంగా రైతులు రాజీ పడటంతో కేసు డిస్పోజ్ అయినట్టుగా కొందరు రైతులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట పరిధిలో ఏకంగా 623 ఎకరాల భూమిపై కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలు వినిపించి, ఏకంగా 15 సంవత్సరాలపాటు సుదీర్ఘంగా కొనసాగిన కేసుకు ముగింపు పలికింది. కోకాపేట పరిధిలోని పలు సర్వే నంబర్లలో 1,635 ఎకరాల భూమి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ భూములను వేలం వేసింది. ఇందులో భాగంగా కోకాపేటలోని ఈ భూములను కూడా వేలం వేసినపుడు, అందులో 635 ఎకరాలను గోల్డెన్ మైల్ ప్రాజెక్టు కింద ఒక కార్పొరేట్ కంపెనీ దక్కించుకుంది. నిబంధనల ప్రకారం వేలం మొత్తంలో కొంత వాయిదాల రూపంలో ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూముల్ని వేలం వేసిందేగానీ.. అందులోని న్యాయపరమైన చిక్కులపై దృష్టిసారించలేదు. దీంతో కొందరు వ్యక్తులు ఇది తమ భూమి అంటూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఫలితంగా ఆ భూములు న్యాయపరమైన చిక్కుల్లో పడటంతోపాటు వేలంలో దక్కించుకున్న కంపెనీ సైతం వాయిదాలు చెల్లించకుండా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటం చేయడంతో సుప్రీంకోర్టులో హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 15 ఏండ్ల తర్వాత అంటే 2017లో సుప్రీం తీర్పుతో 623 ఎకరాల భూమిపై హెచ్ఎండీఏకు హక్కులు దక్కాయి. కోకాపేట పరిధిలో ఎకరా రూ.50 కోట్లు అనుకున్నా.. ప్రభుత్వ పరమైన దీని విలువ సుమారు రూ.30వేల కోట్లపైనే!
కూకట్‌పల్లిలోని సర్వేనెంబరు 1009లో ఉన్న 20 ఎకరాల భూమిపై నెలకొన్న న్యాయపరమైన చిక్కులను కేసీఆర్ ప్రభుత్వం సమర్ధవంతమైన వాదనలతో పరిష్కరించింది. రెండు దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టు ఈ భూమిపై తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో రూ.700 కోట్ల విలువైన భూమి హౌసింగ్ బోర్డుకు దక్కింది.
పరశ్రామ్ రామ్‌చంద్ మలానీ అనే వ్యక్తికి పాకిస్తాన్‌లోని సింధ్‌లో 83.11 ఎకరాల భూమి ఉండేది. దేశ విభజన సమయంలో అతను హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో 1952, నవంబరు 22న బొంబాయి సెటిల్మెంట్ క్లెయిమ్ ఆఫీసర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సింధ్‌లోని ఆ భూమికి బదులుగా ఇక్కడ 200 ఎకరాల భూమిని కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీసీఎల్ఏ అధికారులు 2003, 2006లో పుప్పాలగూడలో 198.30 భూమిని ఆయన కుటుంబానికి కేటాయించారు. అనంతరం ఆ కేటాయింపును అప్పటి ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సదరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.
కేటాయింపును రద్దు చేయడాన్ని 2016లో హైకోర్టు సమర్థ్ధించింది. తిరిగి కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలు వినిపించడంతో చివరకు 2019 అక్టోబరులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. కాందిశీకుల భూములను కేటాయించే అధికారం సీసీఎల్ఏకు లేదని తేల్చి చెప్పింది. దీంతో ఎకరా రూ.35 కోట్ల వరకు విలువ ఉండే రూ.7వేల కోట్ల సర్కారు ఆస్తిని కేసీఆర్ ప్రభుత్వం కాపాడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రయోజనాల కోసం సేకరించిన భూమిని హెచ్ఎండీఏ కాపాడటంలో విఫలమై, ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకున్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీగా న్యాయ పోరాటం చేసింది. సదరు ప్రైవేటు వ్యక్తుల నకిలీ లీలల్ని బయటపెట్టి శంషాబాద్‌లో ఏకంగా 181 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. 1990లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హెచ్ఎండీఏ ద్వారా ట్రక్ టెర్మినల్ కోసం శంషాబాద్‌లోని సర్వేనెంబరు 661, 721, 725ల్లో మూడు అవార్డుల ద్వారా మొత్తం 181 ఎకరాలను సేకరించింది. హెచ్ఎండీఏ ఆధీనంలోనే ఈ భూమి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అన్యాక్రాంతమవుతూ వచ్చింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఇది వారసత్వంగా తమకు వచ్చిన భూమి అంటూ స్వాధీనం చేసుకోవడమే కాకుండా న్యాయస్థానాలను ఆశ్రయించారు.
కేసీఆర్ ప్రభుత్వం సమర్ధవంతమైన న్యాయవాదులను నియమించగా.. సదరు వ్యక్తులు కోర్టును తప్పుదోవ పట్టించేలా సమర్పించిన నకిలీ డాక్యుమెంట్ల గుట్టును కోర్టు ముందే విప్పారు. దీంతో కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వగా.. ‘ఆపరేషన్ శంషాబాద్’ పేరిట ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నది. సుమారు రూ.10వేల కోట్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడి ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకులో జమ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమార్కుల చెర నుంచి కేసీఆర్ సర్కారు కాపాడిన భూముల విలువ సుమారు 60వేల కోట్ల వరకూ ఉంటుంది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో ఏకంగా 225 ఎకరాల భూమి. వాస్తవానికి ఇవి జాగీర్దారీ భూములు. వీటి విలువ కనీసంగా రూ.రూ.3,375 కోట్ల వరకు ఉంటుంది. నిబంధనల ప్రకారం.. ఈ భూములు గతంలో కేటాయించిన రైతుల చేతుల్లోనైనా ఉండాలి, లేకపోతే ప్రభుత్వ ఆధీనంలోనైనా ఉండాలి. రైతులు అమ్ముకునేందుకు వీలులేదు. ఇతరులు కొనుగోలు చేసేందుకూ నిబంధనలు అంగీకరించవు. ఈ క్రమంలో భూముల వ్యవహారం రంగారెడ్డి కోర్టుతోపాటు హైకోర్టు వరకూ వెళ్లింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రికార్డులు తారుమారు చేసేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు అప్పుడు అధికార పార్టీలోని ఎమ్మెల్యే సైతం అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి చేశారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం ససేమిరా అన్నది.
న్యాయస్థానాల్లో రెవెన్యూశాఖ తరఫున అవి మా భూములేనంటూ అఫిడవిట్లు కూడా వేయించింది. కానీ ఇప్పుడు క్రమేణా కేసులు డిస్పోజ్ అయ్యాయి. ఈ క్రమంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ఏం చేయాలి?! సుప్రీంకోర్టు వరకు వెళ్లయినా న్యాయపోరాటం చేయాలి. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం మౌనం వహిస్తున్నట్టు తెలిసింది. అంతేకాదు.. అసలు ఆ భూముల అంశంలో ప్రభుత్వపరంగా రెవెన్యూశాఖ కనీసం తొంగి చూడటం లేదు. గతంలో ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్యే మళ్లీ గెలిచి ఇప్పుడు గోడ దూకి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో నెమ్మదిగా ఈ భూములు కార్పొరేట్ పరం అయ్యాయి. క్షేత్రస్థాయిలో భూములను చదును చేయడంతోపాటు చుట్టూ రేకులతో ప్రహరీ నిర్మించి.. కోర్టులో కేసు గెలిచాం, ఈ భూములు తమవేనంటూ బోర్డులు కూడా వెలిశాయి. రేపోమాపో రెవెన్యూ రికార్డుల్లోనూ భూములు వారికి ధారాదత్తం చేసేందుకు పావులు కదులుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 122, 123, 124, 125, 126తోపాటు 143 నుంచి 150ఏ, 151 ఏ, 152ఏ, 153ఏ, 154 వరకు మొత్తం 225 ఎకరాల భూమి ఉన్నది. 1954-55 నుంచి రికార్డుల్లో జాగీర్దార్లు సయ్యద్ షాబుద్దీన్, సయ్యద్ హైదర్ హుస్సేన్ నుంచి వారి వారసులైన మహ్మద్ తాయర్ అలీఖాన్, అమీర్ ముల్కీ అనే ఇద్దరికి వారసత్వంగా వచ్చింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన 75 మంది రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించారు. రైతులు ఎలాగూ సేద్యం చేస్తున్నందున వారికి ఒక్కో నాగలి చొప్పున ఆ భూమిని జాగీర్దార్లు పంపిణీ చేశారు. అంటే ఒక్కో రైతుకు నాగలికి మూడు ఎకరాల చొప్పున ఇచ్చారు. ఇలా 225 ఎకరాల్లో దశాబ్దాలుగా రైతులే సాగు చేసుకుంటూ వచ్చారు. వారి పేర్లు రికార్డుల్లో (ప్రొటెక్ట్ టెనెంట్) పీటీదారులుగా నమోదై ఉన్నాయి.
కాగా 1998 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ తులసీరాం తనతోపాటు తన కుటుంబ సభ్యుల పేరిట ఆ భూములను కొనుగోలు చేశానంటూ రైతులను అందులోకి రానీయకుండా అడ్డుకున్నారు. భూమిలోకి వచ్చిన రైతులపై కేసులు నమోదు చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో 1998 నుంచి 2023 వరకు ఆ భూమి సాగులేక పూర్తిగా చెట్లు, పొదలతో నిండిపోయింది. జాగీర్దారీ భూములపై తమకు హక్కు కల్పించాలంటూ పీటీదారులుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వానికి అనేకసార్లు మొరపెట్టుకున్నారు.
అయినా న్యాయం జరగలేదు. 2004లో అప్పుడే అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజీవ్ పల్లెబాట పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్రగా శంషాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలో ఉన్న సుల్తాన్‌పల్లి గ్రామస్తులు, రైతులు తమకు భూమిపై హక్కు కల్పించాలని వైఎస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో వారికి న్యాయం జరుగుతుందని అందరూ ఆశించినా చివరికి నిరాశే ఎదురైంది.
రైతుల శ్రేయస్సు కోసం ప్రజాప్రతినిధి ఎక్కే గడప.. దిగే గడప. అన్నట్టుగా శ్రమిస్తే మంచి పేరొస్తుంది. పది కాలాలపాటు రైతులూ గుర్తుంచుకుంటారు. కానీ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఈ భూముల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి జంప్ కావడం తంతుగా పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాశ్‌గౌడ్ టీఆర్ఎస్లోకి వచ్చారు. వాస్తవానికి ఈ భూముల కోసమే ఆయన వచ్చినప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వం ప్రకాశ్‌గౌడ్ పాచికను పారనీయలేదు. జాగీర్దారీ భూములైనందున వాటిని నిజమైన అర్హులుగా ఉన్న పేద రైతులకు ఇవ్వాలని, అలాంటి భూములను ఎమ్మెల్యేగా ఉంటూ కొనుగోలు చేయడం సరికాదని నేరుగా ప్రకాశ్‌గౌడ్‌కే అప్పటి సీఎం కేసీఆర్ సూచించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆ భూముల వ్యవహారాలను పక్కన బెట్టిన ప్రకాశ్‌గౌడ్, నాలుగోసారి ఎమ్మెల్యే కాగానే.. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరి భూముల వ్యవహారాన్ని చివరి అంకానికి తెచ్చుకునేందుకు తండ్లాడుతున్నట్టు తెలిసింది.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి విడిపోయిన కొన్ని ప్రాంతాలు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భాగమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన టీ ప్రకాశ్‌గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి సుల్తాన్‌పల్లి గ్రామస్తులు, రైతులు 225 ఎకరాల భూమిపై మాకు హక్కు కల్పించాలని పలుమార్లు ఆయనకు వినతిపత్రాలు ఇచ్చారు. రైతుల సమస్యల్ని పరిష్కరించాల్సిన ఆయన ఆ భూములపై కన్నేసినట్టు విమర్శలున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దగ్గరి బంధువైన పురుషోత్తంనాయుడు, వ్యాపారవేత్త ధర్మేంద్ర శర్మతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న కొందరు (గతంలో టీడీపీ) కూడా ఇందులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు.
అమాయకులైన రైతుల్లో భయాందోళనలను సృష్టించి అగ్గువ ధరకే భూములను కొనుగోలు చేశారు. వీరంతా విజన్ రిసార్ట్స్ పేరిట రైతులకు చెక్కులను ఇచ్చి, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మూడెకరాలకు రూ.27 లక్షల చొప్పున చెల్లించి పలువురు రైతుల నుంచి భూమిని తీసుకున్నారు. మరోవైపు తులసీరాం కూడా టీడీపీకి చెందిన నాయకుడే కావడంతో వీరంతా ఒక ఒప్పందానికి వచ్చారు. అంతర్గతంగా చర్చల సారాంశమేమిటోగానీ.. తులసీరాం ఈ భూముల వ్యవహారం నుంచి తప్పుకున్నారు.
ఈ క్రమంలో తులసీరాం, అతని కుటుంబ సభ్యుల నుంచి విజన్ రిసార్ట్స్ అనే సంస్థకు చెందిన ధర్మేంద్ర శర్మ, పురుషోత్తం నాయుడు (ఏపీ సీఎం చంద్రబాబు బంధువు)తోపాటు కొంతమంది ఈ భూములను కొనుగోలు చేసినట్టు రికార్డులు (డాక్యుమెంట్ నంబర్ 3948/ 2006) సృష్టించారు. ఈ విషయం తెలియని కొందరు రైతులు సమస్యను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే చుట్టే తిరగడం ఇక్కడ అత్యంత గమనించాల్సిన అంశం.
వాస్తవానికి గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరి మేరకు ఈ భూములపైనా తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలి. జాగీర్దారీ భూములైనందున.. అర్హులైన రైతుల ఆధీనంలోనైనా ఉండాలి, లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పటివరకు న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉండాలి. గతంలోని అనేక కేసుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం సమర్ధవంతమైన న్యాయవాదులను పెట్టి భూములను కాపాడిన చరిత్ర ఉన్నది. రెవిన్యూ, హెచ్ఎండీఏ తదితర శాఖల అధికారులు కూడా ఇదే పట్టుతో ఉండేవారు. కానీ ఇప్పుడు గతంలో అఫిడవిట్ దాఖలు చేసిన రెవెన్యూశాఖ సైతం చేతులు ముడుచుకొని కూర్చుంది.
ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతో న్యాయపరంగా ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా వేయడం లేదు. ఎలాగూ రైతులు రాజీ పడటంతో కోర్టుల్లో కేసులు డిస్పోజ్ అయినందున దాని పేరిట విజన్ రీసార్ట్స్ రూ.3375 కోట్ల విలువైన 225 ఎకరాలను స్వాధీనం చేసుకున్నది. కాకపోతే ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అంశం కోర్టు కేసుల్లో ఉన్నదని వస్తున్నది. రేవంత్ సర్కార్ మౌనాన్ని చూస్తుంటే.. రేపోమాపో ధరణిలో ఈ రికార్డులు విజన్ రిసార్ట్స్ పేరిట మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిబంధనల ప్రకారమైతే అవి జాగీర్దారీ భూములైనందున రైతులు సమ్మతించినా క్రయ, విక్రయాలు జరగకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు న్యాయపరంగా ముందుకుపోవాల్సిన ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తే ఇక ప్రభుత్వ భూములకు రక్షణ ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.