హైదరాబాద్, అక్టోబర్3 (నమస్తే తెలంగాణ) : దరఖాస్తుల గడువు ముగిసే దశకు వచ్చింది. గత 3 రోజులుగా సైట్ అసలు పనిచేయడమే లేదు. ఫలితంగా అర్హులైన మైనార్టీ ఒంటరి ఆడబిడ్డల్లో, దూదేకుల, ఫకీర్ వర్గాల్లో అయోమయం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మైనార్టీల కోసం రెండు పథకాలను ప్రకటించింది. ఒకటి మైనార్టీలలో ఉన్న వితంతువులు, విడాకులు పొందిన, అనాథలు, అవివాహిత మహిళల కోసం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజనను తెచ్చింది. ఈ పథకం కింద ఒకొకరికీ రూ.50,000 చొప్పున ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. రేవంతన్న కాసహారా పథకం కోసం దూదేకుల, ఫకీర్ వర్గాలకు మోపెడ్ వాహనాల కొనుగోలు కోసం ఒక్కొక్కరికీ రూ.1 లక్ష గ్రాంట్ ఇస్తామని ప్రకటించింది.
ఆ రెండు పథకాలకు రూ.30 కోట్ల గ్రాంట్‌ను కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆ రెండు పథకాల కోసం అర్హులైన మైనార్టీలు tgobmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సెప్టెంబర్ 19న ప్రకటించింది. దరఖాస్తులకు తుది గడువు అక్టోబర్ 6 అని నిర్ణయించింది. దరఖాస్తులకు మొత్తంగా మరో 3 రోజులు మాత్రమే గడువు ఉన్నది. ఈ దశలో గత 3 రోజులుగా సీజీజీ సైట్ మాత్రం పనిచేయడం లేదు. దీంతో వేలాది మంది అర్హులైన నిరుపేద మహిళలు, దూదేకుల, ఫకీర్ వర్గాలకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సైట్‌ను పునరుద్ధరించేలా చూడాలని వారు కోరుతున్నారు.
ఎన్నికల కోడ్‌కు ముందే ఆ పథకాలు ప్రారంభమయ్యాయి.సైట్ పనిచేయక అర్హులెందరో దరఖాస్తులు చేసుకోలేదు. దీనికోసం వెబ్‌సైట్‌ను తక్షణమే పునరుద్ధరించాలి. దరఖాస్తుల తుది గడువును పొడిగించి, నిరుపేదలకు న్యాయం చేయాలి. లేకపోతే వేలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి.