Telangana Revenue | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆగమాగమైంది. ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలమైన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. అప్పులు తీసుకోవడంలో మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నది. జూన్ నెలకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఆ గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వ ఆదాయం వార్షిక బడ్జెట్ అంచనాలో కేవలం 16 శాతంగా ఉన్నది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ నుంచి రూ. 20,266 కోట్ల రుణాలు సమీకరించింది. ఇది బడ్జెట్లో నిర్దేశించుకున్న వార్షిక రుణ పరిమితి (రూ.54,009.74 కోట్లు)లో ఏకంగా 37.52 శాతానికి సమానం. అంతేకాకుండా గత ఐదేండ్లలో మార్కెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన అత్యధిక రుణం కూడా ఇదే.
నిరుటి కంటే 11% అధిక అప్పు
రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. వ్యయాల సర్దుబాటు కోసం భారీగా రుణాలను తీసుకొంటున్నది. అలా 2024-25 తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.13,171 కోట్లు, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.20,266 కోట్ల అప్పులు తెచ్చింది. ఇది నిరుటి కంటే దాదాపు 11% ఎకువ. ఆదాయం, వ్యయం మధ్య అంతరాన్ని పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలపై ఆధారపడుతున్నది.
రెవెన్యూ రాబడి 16.20 శాతమే
ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.57,500 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిలో రూ.35,722 కోట్ల పన్ను రాబడి కలిపి మొత్తం రెవెన్యూ రాబడి రూ.37,222 కోట్లుగా ఉన్నది. ఇది వార్షిక బడ్జెట్ అంచనా (రూ.2.30 లక్షల కోట్ల)లో 16.2% మాత్రమే. నిరుటితో పోలిస్తే ఈసారి పన్ను రాబడి 21% నుంచి 20.38 శాతానికి తగ్గింది.
రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటు
ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.10,583 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో ద్రవ్యలోటు రూ.20,266 కోట్లుగా ఉన్నది. ఇది క్యూ1లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన మొత్తం రుణాలకు సమానం. రాష్ట్ర ఆదాయ వసూళ్లలో నెలవారీగా చెల్లించాల్సిన వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలకే ప్రభుత్వం 61% వెచ్చించింది. పెట్టుబడుల వ్యయం కింద అభివృద్ధి పనుల కోసం రూ.4,755.31 కోట్లు (బడ్జెట్ అంచనాలో 13%) మాత్రమే ఖర్చు చేసింది. ఇది నిరుటి కంటే 5% తక్కువ.
గత ఆరేండ్లుగా క్యూ1లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయం