ఈ భూమ్మీద ఎవరి చరిత్ర వారే తయారు చేసుకుంటారు. తమ చేతల ద్వారా.. చర్యల ద్వారా.. మాటల ద్వారా..! రాజకీయాల్లో ఉన్న వారు మరీనూ! ఇక్కడ ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు!
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏనాడు ఓ చెయ్యి వేయని రేవంత్‌రెడ్డి ఇవాళ నమస్తే తెలంగాణ వంటి తెలంగాణ పత్రిక మీద అవాకులు చెవాకులు పేలుతున్నాడు. అవమానిస్తున్నాడు. తనపై కుట్ర చేస్తున్నదని అంటున్నాడు. కావాలని ఏవో కథనాలు వండివార్చుతున్న దంటున్నాడు. తానన్న మాటలే రాస్తే.. తన చర్యలనే ఎత్తి చూపితే గింజుకుంటున్నాడు. గొంతు చించుకొని నోరు పారేసుకుంటున్నాడు.
నమస్తే తెలంగాణ పుట్టుక ఏమిటో… పరిణామం ఏమిటో.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో.. ఆఖరికి తెలంగాణ సాధనలో దాని పాత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఎవరో కొత్తగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందునా తెలంగాణ వాదుల మీదికి తుపాకులు ఎక్కుపెట్టిన వారి సర్టిఫికెట్ అంతకన్నా అవసరం లేదు.
Namasthe Telangana | పచ్చలాబీ వెయ్యి చేతులతో తెలంగాణ శిశువును గొంతు నులమాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. ఉద్యమ దీపాన్ని తుపానులా చుట్టి ఆర్పేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. చేతులు బొబ్బలెక్కినా లెక్క చేయకుండా ఆ దీపాన్ని ఆరకుండా అడ్డుకున్న చరిత్ర నమస్తేది! తెలంగాణ మీద అణచివేతను, రాష్ట్ర సాధన ఆవశ్యకతను పేగులు తెగేదాక గొంతెత్తి చాటిన ఘనత నమస్తేది. సీమాంధ్రుల కుట్రలకు ధైర్యం జారిపోయే స్థితిలో ప్రజలకు కుట్రలను విడమరిచి చెప్పి ఉద్యమాన్ని ప్రజ్వరిల్లజేసిన చరిత్ర నమస్తేది. తెలంగాణ అనే ఉద్యమ బీజం నాటిన నాటినుంచి నేటిదాకా ‘నమస్తే తెలంగాణ’ తెలంగాణ ప్రయోజనాల వైపే నిలబడింది. ఉద్యమానికి ఊతమిచ్చి ద్విగుణీకృతం చేసింది. వందల ఏండ్ల తెలంగాణ మహోన్నత చరిత్రను తవ్విపోసింది. తెలంగాణ ఘనతను, తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతిని, పూర్వవైభవాన్ని.. ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను ఆవిష్కరించి ఉద్యమకారుల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆంధ్ర సర్కారు చేసే ప్రతి కుట్రను ప్రజలకు విడమరిచి చెప్పి వారిని జాగరూకులను చేసింది. కర్తవ్య బోధన చేసింది. ఉద్యమం పొడవునా అండదండలు అందించింది. శ్రీకృష్ణ కమిటీ 8వ చాప్టర్ వెలికి తెచ్చి ఆఖరి నిమిషం కుట్రలను కూడా బట్టబయలు చేసింది.
ఎస్… తెలంగాణ సాధనలో మా పాత్ర ఇది అని కాలరెగరేసి, సగర్వంగా చెప్పగల చరిత్ర నమస్తేకు, ఇందులో పనిచేసిన ఉద్యోగులకు ఉంది. అసాధ్యమనుకున్న రాష్ట్ర సాధన అంశానికి భావవ్యాప్తి ద్వారా బలమైన పునాది నిర్మించి సాకారం చేసిన గొప్ప చరిత్ర మాకున్నది. అంతేకాదు… ఈ దారి పొడవునా నమస్తే ఎత్తుకున్న మార్గం సరైనదే అనేది చరిత్రే రుజువు చేసింది. ఉద్యమకాలంలో నమస్తే అందించిన మద్దతు సరైనదేనని రాష్ట్ర సాధనతో రుజువైతే.. ఆ తర్వాత వచ్చిన తెలంగాణను బాగు చేసుకునే కృషిలో ‘రాళ్లెత్తిన’ మార్గం సరైనదేనని 2014, 2018 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పులు రుజువు చేశాయి. వచ్చిన తెలంగాణను పీకపిసికి చంపేయాలని చూసిన శక్తులతో అంటకాగిన వారినుంచి నీతులు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు.
నమస్తే కుట్రలు చేస్తున్నదట. రేవంత్‌రెడ్డి అంటాడు. కుట్రలు చేయడం కాదు, కుట్రలు భగ్నం చేసిన చరిత్ర నమస్తేది.
రేవంత్‌రెడ్డి తెలంగాణను అవమానపరిచాడా? లేడా? అనేది ఇవాళ మాట్లాడుకోవాల్సిన మాట కానేకాదు. ఉద్యమ సమయంలోనే తుపాకులను తెలంగాణవాదుల మీద ఎక్కుపెట్టిన చరిత్ర ఉండనే ఉన్నది. ఉస్మానియా విద్యార్థులను అడ్డా మీది కూలీలని అవమానించిన సందర్భాలున్నాయి. తెలంగాణకు కరెంటు ఆపడానికి ఆంధ్రాలో ఎంవోయూలు పాత తేదీలతో రద్దుచేసిన సాక్ష్యాలు ఎదురుగా పెట్టకొని చంద్రబాబుకు మద్దతు పలికిన చరిత్ర ఉన్నది. ఆఖరికి నిన్నగాక మొన్న సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు రాలేదా? అని ప్రశ్నించి తెలంగాణవాదన ఉనికినే అవమానించిన సందర్భం ఉన్నది. దాన్నే నమస్తే రాసింది? కెమెరాల ముందు అడ్డగోలు మాటలు మాట్లాడి ఆ విషయం ప్రచురిస్తే ఇప్పుడు గింజుకోవడం ఎందుకు?
కర్ణాటకకు పెట్టుబడుల తరలింపు అంశం. అందరికీ తెలుసు. ఇవాళ బెంగళూరుకు హైదరాబాద్‌కు ఐటీ రంగంలో పోటీ ఉన్నది. బెంగళూరులో ఏం జరుగుతున్నదనే దాని మీద హైదరాబాద్ ఓ కన్నువేసి ఉంచుతుంది. అలాగే హైదరాబాద్ మీద బెంగళూరు కన్నువేసి ఉంచుతుంది. ఇది రెండు నగరాల మధ్య రాష్ర్టాల మధ్య పోటీయే. ఏ రాష్ట్రమైనా తన రాష్ర్టాన్ని కాపాడుకోవాలనుకుంటుంది. అందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇవాళ కనీస రోడ్‌మ్యాప్ లేకుండా కర్ణాటకలో ఓ నాలెడ్జ్ సిటీ కడుతుంటే.. దానివల్ల నష్టపోకుండా ఎవరు జాగ్రత్తపడాలి? కచ్చితంగా తెలంగాణయే. అదే నమస్తే రాసింది. కుట్ర కోణాలు చూడాలంటే నగరాలు, సౌకర్యాలే కాదు. రాష్ర్టాల్లో రాజకీయ పరిస్థితులు.. నాయకుల పెత్తనాలు.. అన్నీ చూడాల్సిందే. ఇవాళ తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి 50 మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంచార్జిలుగా వచ్చారు. ఇక్కడి టిక్కెట్లు, చేరికలు చాలావరకు బెంగళూరులో డిసైడ్ అయ్యాయి. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే ఈ ఎన్నికలకు ఇక్కడ ఇంచార్జిగా పనిచేస్తున్నాడు. ఎన్నికల ఖర్చులకు కర్నాటక నుంచి వందల కోట్లు డబ్బు ప్రవాహంలా వచ్చి పడుతుంది. తెలంగాణలో ఎన్నికల మీద కర్ణాటక కాంగ్రెస్ ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఎన్నికలయ్యాక ఏం జరుగుతుంది? కర్మగాలి కాంగ్రెసే వస్తే? ఇవాళ సాయం చేసినవాడు రేపు ఫలితం కోరుతాడు కదా? అది హైదరాబాద్ భూములా? కంపెనీల తరలింపా?.. ఏది అడిగినా కాదనే ధైర్యం ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు ఉందా? కాంగ్రెస్ 70 ఏండ్ల బానిసత్వ చరిత్రను చూశాం. కాబట్టే ఈ కుట్రల కోణాన్ని ఢంకా బజాయించి ప్రజలకు చెపుతాం. అది మా కర్తవ్యం! కర్ణాటకలో మనకే సంబంధం అంటున్న రేవంత్‌రెడ్డి మరి మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కర్ణాటక నేతల బృందాన్ని ఎందుకు దించారో చెప్పగలరా? కర్ణాటక ఏమైనా కాంగ్రెస్ అధిష్ఠానమా?
సానుభూతి ఎవరి మీద వస్తుంది? రాష్ట్రంలో జరుగుతున్న దాడుల మీదా రేవంత్ నోరు చేసుకున్నాడు. ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలను రెచ్చగొట్టి ఉగ్రవాదుల్లా తయారుచేసినవి ఏ పార్టీలో అందరికీ తెలుసు. ఆ విష సంస్కృతి పరిణామమే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి. ఆ తర్వాత గువ్వల బాలరాజు మీద జరిగిన దాడి. ఈ దాడినీ వక్రించే ప్రయత్నం చేశాడు. ఏదో ప్రశాంత్ కిషోర్ బీఆర్ఎస్లో ఉన్నట్టు ఎన్నికల్లో దాడులు చేయించి తద్వారా వచ్చే సానుభూతితో గెలిచే వ్యూహం పన్నారని ఇదేరకంగా బెంగాల్లో మమతా బెనర్జీ మీద దాడి జరిగిందని, ఏపీలో జగన్ మీద జరిగిందని చెప్పుకొచ్చాడు. కానీ, వాళ్లిద్దరు ఆ పార్టీకి అధినేతలు. ఇక్కడ దాడి జరిగింది ఒక ఎంపీ మీద. ఆయన మీద దాడి జరిగితే రాష్ట్రమంతా బీఆర్ఎస్కు ఎలా సానుభూతి వస్తుందో రేవంత్‌కే తెలియాలి. అంతేకాదు రేవంత్ ముసుగు బాస్ మీద అలిపిరిలో మందుపాతరతో హత్యాయత్నం జరిగింది. ఆ వెంటనే వచ్చిన ఎన్నికల్లో అలాంటి సానుభూతి ఏదీ రాలేదు సరికదా ఆయన అధికారమే కోల్పోయాడు. ఇంకా మాట్లాడితే ఇందిర మరణానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. తెలంగాణ వచ్చాక పాలేరు, దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా మరణానంతర సానుభూతి పని చేయలేదు. అయినా 2001 నుంచి తెలంగాణ ఉద్యమం నడిపిన కేసీఆర్ ఏనాడు హింసను ఆశ్రయించలేదు. టీఆర్ఎస్ చరిత్రలో ఏనాడూ హింసాత్మక సంఘటనలు లేవు. ఎదుటివారి మీద దాడులు చేసి.. వారిని లేకుండా చేసి ఎన్నికలు గెలవాలనే విధానం ఏనాడూ లేదు. ప్రత్యర్థులను తెగనరికి అడ్డు తొలగించుకోవడం వంటి సంస్కృతి రేవంత్ పాత పార్టీకి ఉంది. ఇవాళ చేరిన కొత్తపార్టీకి ఉంది. తెలంగాణలో సీఎంను దింపడానికి 400 మందిని ఊచకోత కోయించిన చరిత్రా ఉంది. దాడులు, కుట్రల గురించి రేవంత్ మాట్లాడితే జనం నవ్వుతారు.
ఇక ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, జేడీఎస్ కలిసిపోయి కాంగ్రెస్ మీద కుట్ర చేస్తున్నాయని కర్ణాటక రాజకీయాలకు తెలంగాణకు ముడిపెట్టారు. ఎంఐఎంతో 50 ఏండ్లు అంటకాగింది కాంగ్రెస్ కాదా? ఇవాళ ఆ పార్టీలో బీజేపీ కనిపిస్తున్నదా? ఇక కర్ణాటక ముక్కోణపు రాజకీయంలో జేడీఎస్ ఓ తురుపుముక్క. ఆ పార్టీ తన అవసరం కోసం ఎవరితోనైనా కలుస్తుంది. అది దాని ఇష్టం. దానికి తెలంగాణ రాజకీయాలకు ఏమిటి సంబంధం? మన రాష్ట్రంలో గత ఐదేండ్ల చరిత్రను చూస్తే బీజేపీతో అంటకాగింది ఎవరు? 2019 పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ సీట్లలో బీజేపీకి లోపాయికారీ మద్దతు ఇచ్చింది ఏ పార్టీ అభ్యర్థులు? కనీసం ఎన్నికల ప్రచారం కూడా చేయకుండా బీజేపీకి ఓటేయమని కార్యకర్తలకు చెప్పింది ఏ పార్టీ వారు? టీఆరెస్‌ను ఎలాగైనా ఓడించాలని కుట్ర చేశారు కానీ ఏం జరిగింది? ఇవాళ కోరుట్ల-జగిత్యాలలో ఎటువంటి మిలాకత్ జరుగుతున్నది? ఇలాంటి వెన్నుపోట్ల వల్ల కేంద్రంలో బీజేపీ 300 సీట్లు దాటింది. కాంగ్రెస్‌కు రావాల్సిన ఒకటి రెండు సీట్లు రాకుండాపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సహకరించింది నిజం కాదా? హుజూరాబాద్‌లో బలహీనమైన అభ్యర్థిని నిలిపి బీజేపీకి లోపాయికారీ మద్దతు ఇవ్వలేదా? ఆఖరికి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అవగాహన మీద ఈటల చేసిన ఆరోపణ ఏం చెప్తున్నది? రాష్ట్రంలో బీజేపీతో ఏండ్లకేండ్లు ప్రాక్టికల్‌గా కుమ్మక్కైంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? దేశ రాజకీయాల్లో మాత్రం తక్కువా? అరెస్టే ఆలస్యం అనుకున్న నేషనల్ హెరాల్డ్ కేసు హఠాత్తుగా కోల్డ్ స్టోరేజీకి ఎందుకు వెళ్లింది? అదే సమయంలో ప్రధాని మోదీకి స్వరాష్ట్రం గుజరాత్లో ఎన్నికలు గెలిచి తీరాల్సిన తప్పనిసరి అయిన స్థితిలో విపక్ష నేతగా అక్కడే తిష్టవేసి ప్రచారం చేయాల్సిన రాహుల్ హఠాత్తుగా కేరళలో జోడో యాత్ర ప్రారంభించి దూరంగా ఎందుకున్నట్టు? గుజరాత్ ఎన్నికల్లో కేవలం ఒకే సభతో ప్రచారాన్ని మమః అని ఎందుకు అనిపించినట్టు? ఇక హిమాచల్ ఎన్నికలకే ఎందుకు డుమ్మా కొట్టినట్టు? ఎవరి మేలు కోసం? ఇందులో మతలబు ఏమిటి? సమాధానం చెప్పగలరా?
ఇవాళ ఎవరో ఏదో తమ రాజకీయ ప్రయోజనాలు చేజారుతున్నాయని.. ఓటమి అంచులోకి జారిపోతున్నామని.. తమ ఎత్తుగడలు ఎదురు తిరుగుతున్నాయని గింజుకుంటూ వేసే అభాండాలతో, చేసే ఆరోపణలతో నమస్తే చరిత్ర మాసిపోదు. మొదట్లో చెప్పినట్టు ఎవరి చరిత్ర వారే తమ చేతల ద్వారా రాసుకుంటారు. ఓట్ల కోసం ప్రజాప్రతినిధులను కొనడానికి వెళ్లిన చరిత్ర ఎవరు రాసుకున్నారు? కార్యకర్తలను పక్కకు ఈడ్చి పడేసిన చరిత్రను.. కాళ్లతో తొక్కిపడేసిన చరిత్రను ఎవరు రాసుకున్నారు. తెలంగాణవాదుల మీదికి తుపాకులు ఎక్కుపెట్టిన చరిత్ర ఎవరు రాసుకున్నారు? రాజకీయ సన్యాసం అంటూ సవాళ్లు విసిరిపారిపోయిన పిరికి చరిత్ర ఎవరు రాసుకున్నారు? ఆరోపణలు చేసి బూమరాంగ్ అయి తేలు కుట్టిన దొంగల్లా తల దించుకున్న చరిత్రలు ఎవరు రాసుకున్నారు? ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై బూతులు మాట్లాడిన చరిత్ర ఎవరు రాసుకున్నారు?
ఎస్.. మేం నిలబడతాం. కచ్చితంగా నిలబడతాం. ఇంకా ఇంకా గట్టిగా నిలబడతాం. తెలంగాణను ఈనగాచి నక్కల పాలు.. గుంట నక్కల పాలు కానివ్వం. పల్లెలు పచ్చబడి.. పట్నాలు తెల్లబడి.. రాజధాని విశ్వనగరంగా మారి వేల కోట్ల సంపద సృష్టి జరిగి దేశాన్ని సాకే రాష్ర్టాల్లో చేరిన సమయంలో ఆ సంపదను దోచుకోవడానికి ఢిల్లీ బంట్లు, గుజరాత్ గులాములు, కర్ణాటక బ్రోకర్లు, అపర గజనీలు ఘోరీల్లా దాడులు చేస్తుంటే చేతులు ముడుకొని కూర్చోబోము. కచ్చితంగా ఎదుర్కొంటాం. ప్రజలను చైతన్యపరిచి ఈ మూకలను తరిమి తరిమికొడతాం. అది పచ్చముఠాలు కావచ్చు.. ఢిల్లీ బాస్‌లు కావచ్చు.. డోంట్ కేర్!!!
– నమస్తే తెలంగాణ సంపాదక మండలి