పెద్దవంగర, ఫిబ్రవరి 12 : బ్రోకర్ మాటలతో రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టారని, 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని, ఆరు నెలల్లో రేవంత్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పేర్ల మార్పుతోనే ఎంతో అభివృద్ధి చేశామని కాంగ్రెస్ గొప్పలు చెబుతున్నదని ఎద్దేవా చేశారు. మళ్లీ ఎన్నికలు వస్తే కేసీఆరే సీఎం కావడంతో పాటు 100 సీట్లు రావడం ఖాయమని చెప్పారు. సమన్వయం లేకనే ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరగలేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. కడియం శ్రీహరి పిచ్చుక లాంటోడని.. పంట ఎకడ పచ్చగుంటే.. అకడే ఉండే రకమని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలు తేదీలను మార్చడమే తప్ప, హామీల విషయంలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని పేర్కొన్నారు.
పాలకుర్తి, ఫిబ్రవరి 12: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం 30 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. శాతాపురం శివారు దుబ్బతండా ఎస్పీ గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ భూక్యా యాకూబ్ నాయక్, రవి, యాదగిరి, భాస్కర్, అనిల్, వెంకటి, రవి, సీతారాములతో పాటు సుమారు 30 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా.. వారికి ఎర్రబెల్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.