మహబూబ్‌నగర్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో తుంగభద్ర నదిపై అక్రమంగా రిజర్వాయర్లు కడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆయా రాష్ర్టాలకు కనీసం ఉత్తరాలు కూడా రాయడం లేదని మండిపడ్డారు. ‘కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర నదిపై కొత్తగా రిజర్వాయర్లు కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ 20 టీఎంసీలతో గుండ్రేవుల రిజర్వాయర్ కడుతుంటే.. కర్ణాటకలో 35 టీఎంసీలతో నావలి వద్ద కడుతున్నది. ఇవి కాకుండా కురిడి వద్ద కన్నడ ప్రభుత్వం మరో 2 టీఎంసీలు, చిక్కలపర్వి వద్ద మరో రెండున్నర టీఎంసీల రిజర్వాయర్లు, చిక్కలమంచి వద్ద మరో మూడున్నర టీఎంసీల బ్రిడ్జి కం బరాజ్ కడుతున్నది.
65 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను తుంగభద్రపై కడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనీసం ఈ ప్రాజెక్టులను ఆపండని కోరుతూ ఒక్క ఉత్తరమైన రాసిండా?’ అని నిలదీశారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వాల్యానాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, రజినీసాయిచంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తుంగభద్ర నదిపై అక్రమంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అడ్డగోలుగా రిజర్వాయర్లు కడుతుంటే శ్రీశైలానికి చుక్క నీరైనా వస్తుందా? అని ప్రశ్నించారు. శ్రీశైలం మీదనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆధారపడ్డాయని గుర్తుచేశారు. అసలు శ్రీశైలం జలాశయానికే నీళ్లు రాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాజెక్టులు కడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి కనీసం వ్యతిరేకించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గుండ్రేవుల రిజర్వాయర్ కడుతామంటే అభ్యంతరాలు చెప్పామని, ఉత్తరాలు రాశామని, సమావేశాల్లో మాట్లాడి, గుండ్రేవులను ఆపించామని వివరించారు. ‘కానీ, ఇవ్వాళ ఏమైంది? వాళ్ల శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు.
వాళ్ల అడుగులకు మడుగులొత్తే.. ఓటుకు నోటుకు దొంగ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు.. గనుక ఇప్పుడు గుండ్రేవులపైకి వచ్చింది. కేసీఆర్ ఉంటేనేమో గుండ్రేవుల కోల్డ్ స్టోరేజీకి పోయింది. ఇయ్యాల వాళ్ల ఇంటి మనిషి ఇక్కడ ముఖ్యమంత్రి కాగానే మళ్లీ తెరమీదికి తీసుకొచ్చార’ని విమర్శించారు. తెలంగాణకు నష్టం జరుగుతున్నా రేవంత్‌రెడ్డి మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని ప్రశ్నించారు. ‘కింద గోదావరి నీళ్లేమో బనకచర్ల పేరు మీద చంద్రబాబు తీసుకుపోతున్నడు. మీద కర్ణాటకనేమో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నది. ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరుతో మరో 15 టీఎంసీలను ఆపుకొంటామని అంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతలేడు. దీనివల్ల పాలమూరు జిల్లాకే ఎక్కువ నష్టం ఉంటుంద’ని వివరించారు.
‘హైదరాబాద్‌లో రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడు. అది రైతు ఆశీర్వాద సభ కాదు. రైతుల వంచన సభ’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ రైతును వంచించుతూనే ఉన్నాడని దుయ్యబట్టారు. యాసంగిలో రైతుభరోసా ఎగొట్టి.. ఇప్పుడు మళ్లా వానకాలం రైతుభరోసా వేస్తానని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన మనిషి రేవంత్ అని విమర్శించారు. హామీ ఇవ్వకపోయినా ప్రజలకు కావాల్సింది అర్థం చేసుకొని రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రైతుభరోసా పేరిట రూ.29,300 కోట్లు రైతులకు బాకీపడ్డ రేవంత్.. ఈ డబ్బులు ఎప్పుడిస్తారో రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు.
నల్లగొండలో ఒట్టేసి చెప్తున్నా.. మూసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తనని చెప్పారని, ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే రేవంత్‌రెడ్డి అబద్ధాలకు ఉరేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకొనేదని ఎద్దేవా చేశారు. కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్లనే మోసం చేసిన ఘనుడు రేవంత్ అని విమర్శించారు. ‘ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే అంటున్నారు. ఇప్పుడు ఏడు రకాల వడ్లకే అంటున్నారు. మీరు ఇచ్చిన బోనస్ రూ.3 వేల కోట్లు, మీరు ఎగ్గొట్టిన రైతుభరోసా రూ.30 వేల కోట్లు’ అని లెక్కలేసి చెప్పారు. కేసీఆర్ హయాంలో యూరియా కోసం గోదాములు కట్టించి నిల్వ ఉంచామని, కానీ రేవంత్ యాప్‌లు తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే, రేవంత్ వచ్చాక 6 గంటలకు వచ్చిందని దుయ్యబట్టారు. రైతుల కరెంట్ సరఫరాలో కోత పెట్టడానికే రైతు డిస్కమ్ తీసుకొస్తున్నారని విమర్శించారు. ‘సోలార్ పవర్ మాత్రమే రైతు డిస్కమ్‌లకు కేటాయిస్తారట. అదే జరిగితే పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే కరెంట్ వస్తది. రైతు డిస్కమ్ అనేది రైతు 24 గంటల కరెంటుకి ఉరితాడు అవుతుంద’ని హరీశ్‌రావు హెచ్చరించారు. కేసీఆర్ ఇచ్చిన రైతుబీమా రైతుల కుటుంబాలకు ఒక ధీమా లెక్క ఉండేదని, కానీ, కేసీఆర్ దిగిపోయిన 6 నెలల నుంచి రైతు బీమా బంద్ అయ్యిందని విమర్శించారు.
ఎల్ఐసీకి బీమా డబ్బులను రేవంత్‌రెడ్డి కట్టలేదని.. 7,600 రైతు కుటుంబాలు బీమా కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. రైతులకు బాకీపడ్డ రూ.30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తావో, మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తి చేస్తావో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం కొనమన్న పంటే కొంటామని చెప్తున్న రేవంత్‌రెడ్డి కేంద్రానికి సరెండర్ అయ్యారా? అని ప్రశ్నించారు. కేంద్రం టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్నులే కొంటే మిగతా రైతుల పరిస్థితి ఏమిటని నిలదీశారు.
‘అందాల పోటీలకు రూ.వంద కోట్లు ఉంటాయి.. ఫ్యూచర్‌సిటీకి, నీ మనుమడు ఫుట్‌బాల్ ఆటకు, మూసీకి వందల కోట్లు ఉంటాయి.. పిల్లల చదువులకు ఉండవా.. రేవంత్‌రెడ్డి? డబ్బుల్లేక కాదు; ఇవ్వాలనే మనుసు నీకు లేదు’ అని హరీశ్‌రావు దుయ్యబట్టారు. రేవంత్ ప్రభుత్వం కమీషన్లు ఎక్కడుంటే అక్కడ పెట్టుబడులు పెడుతున్నదని ఆరోపించారు. రూ.100 కోట్లతో క్యాంప్ ఆఫీసు, వేల కోట్లతో మూసీ సుందరీకరణ, వేల కోట్లతో ఫ్యూచర్‌సిటీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు కమీషన్ ఇస్తారనే వీటిని కడుతున్నారని విమర్శించారు.