హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ‘తన వరకు వస్తేగానీ బరువు, బాధ్యత తెలియదు’ అనే నానుడి సీఎం రేవంత్‌రెడ్డికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. వరి సాగుపై, ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మాట్లాడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరి సాగు చేయాలంటూ రైతులను రెచ్చగొట్టిన రేవంత్‌రెడ్డి, నేడు ముఖ్యమంత్రిగా అదే నోటితో వరిసాగు వద్దంటూ రైతులకు పిలుపునిస్తున్నారు. కేంద్రం కొనుగోలు చేయనంటున్నదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి ఐదేండ్ల కిందట నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే మాట చెప్పారు. అంతే.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలను వక్రీకరించి రైతుల్లో కేసీఆర్‌ను విలన్‌గా చిత్రీకరించింది. రేవంత్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ, రైతులను రెచ్చగొట్టి, వారి మనసుల్లో విషబీజాలు నాటారు. అధికారమే పరమావధిగా రాష్ట్ర, రైతుల ప్రయోజనాలకు పాతరపెట్టి నీచ రాజకీయం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వరి సాగుతో కలిగే కష్టాలు, నష్టాలు, భారం, బాధ తెలియడంతో నాలుక మడతేశారు. నాడు కేసీఆర్ చెప్పిన మాటలనే నేడు తిరిగేసి చెప్తున్నారు. ప్రతిపక్షంలో ‘ముద్దు’ అనిపించిన వరి సాగు.. నేడు వద్దనిపిస్తున్నది.
అధికారంలోకి వచ్చిన కొత్తలో ‘పండించిన ప్రతి గింజనూ కొంటాం, సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తాం’ అంటూ హడావుడి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఇప్పడు తత్వం బోధపడినట్టుంది. వరి సాగు విస్తీర్ణం పెరిగితే జరిగే నష్టాలు, ధాన్యం ఉత్పత్తి పెరగడం వల్ల వచ్చే కష్టాల దెబ్బలు గట్టిగానే తగిలినట్టున్నాయి. వరి సాగు, ధాన్యం ఉత్పత్తి ఇలాగే కొనసాగితే జరిగే పరిణామాలు ఆయనకు కండ్లముందు కనిపించినట్లున్నది. అందుకే నాడు ప్రతిపక్షంలో బాధ్యత లేకుండా వరిసాగు చేయాలంటూ రైతులను రెచ్చగొట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సీఎంగా ‘వరి సాగు వద్దు’ అంటూ రైతులను వేడుకుంటున్నారు. నెల రోజులుగా సభ అయినా, సమావేశమైనా సందర్భమేదైనా సరే వరిసాగు వద్దు అనే మాటలనే పదే పదే వల్లెవేస్తున్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో శాసనసభా సాక్షిగా వరిసాగు వద్దంటూ రైతులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా నర్మెట్ట రైతు సభలోనూ వరి లాభసాటి కాదని, సాగు చేయొద్దని రైతులకు సూచించారు. ప్రతిపక్షంలో ఉండగా ‘కేంద్రం కొనకపోతే.. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఖర్చు చేయలేదా?’ అని దుష్ప్రచారం చేసిన నోటితోనే ఇప్పుడు ‘కేంద్రం ధాన్యం కొనడం లేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 71 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, కేంద్రం 54 లక్షల టన్నులే తీసుకుంటామని చెప్తున్నదని, కొనుగోలు చేసిన మిగతా ధాన్యాన్ని ఏం చేయాలని ప్రశ్నించారు. రెండు రోజుల కిందట మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం ఉత్పత్తి ఎక్కువైందని, రైతులు పంట మార్పిడీ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇలా సందర్భం ఏదైనా సీఎం రేవంత్‌రెడ్డి ఇదే పాట పాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన అవసరాలకు సరిపడా ధాన్యం ఉత్పత్తి చేయలేని పరిస్థితి. ఓవైపు నీళ్ల కరువు, మరోవైపు అప్పుల భారంతో పెట్టుబడి పెట్టలేక రైతులు వ్యవసాయాన్ని వదిలేసిన దుస్థితి. ఈ పరిస్థితిని మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల పూర్తి, చెరువుల పూడికత తదితర పథకాలతో సాగునీటి కొరతను తీర్చారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అన్నదాతకు సాయం చేశారు. ఫలితంగా అనతికాలంలోనే రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం ఉత్పత్తి ఊహించని స్థాయికి పెరిగింది. 2014-15లో 34 లక్షల ఎకరాల్లో సాగు కాగా 68 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. 2022-23 నాటికి సాగు విస్తీర్ణం దాదాపు నాలుగు రెట్లు పెరిగి 1.22 కోట్ల ఎకరాలకు పెరగగా, ధాన్యం ఉత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. 2.58 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. ఇలా ఏటికేడు వరి సాగు, ధాన్యం ఉత్పత్తి పెరుగుతుండటం, ఇతర పంటల సాగు తగ్గుతుండటం, మరోవైపు ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో భవిష్యత్‌లో రైతులు ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితులను కేసీఆర్ అంచనా వేశారు. రైతులను ఆ నష్టాలు, కష్టాల నుంచి కాపాడాలనే ఉద్దేశంతో వరి సాగు తగ్గించి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. అంతే.. నాటి ప్రతిపక్ష కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి కేసీఆర్ మాటలను ప్రజల్లోకి మరో విధంగా తీసుకెళ్లారు. వరి సాగుకు కేసీఆర్ పూర్తి వ్యతిరేకమనేలా దుష్ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గానీ నాటి రేవంత్‌రెడ్డి మాటల గారడీలో వాస్తవాలు రైతులకు అర్థంకాలేదు. ఎన్నికల ముందు ధాన్యానికి బోనస్ ఇస్తామని ప్రకటించిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నధాన్యానికే పరిమితం చేశారు. ఇప్పుడు ఏకంగా వరి సాగు వద్దంటూ రైతులకు మొండిచెయ్యి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయదు. కేంద్రం కొంటలేదని, వరిసాగు వద్దని చెప్పుడేంది? రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రైతుల కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయలేరా?
బీఆర్ఎస్ ప్రభుత్వం వరి సాగు వద్దంటున్నది. కానీ రైతులు వరి సాగు చేయాలి. మా పార్టీ అధికారంలోకి వచ్చాక ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ కూడా ఇస్తాం
వరి సాగు ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండించడంతో రైతులకు పెద్దగా లాభం లేదు. కాబట్టి వరి పంట నుంచి దృష్టి మరల్చి కమర్షియల్ పంటలను సాగు చేయాలి.
వరిసాగు లాభసాటి కాదు. అందుకే రైతులు వరిని సాగు చేయొద్దు. కష్టం తక్కువగా ఉంటుందని రైతులు వరి పండిస్తున్నరు. కేంద్రం కొనుగోలు చేయమంటున్నది. మరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏం చేసుకోవాలి. అందుకే రైతులు పప్పులు, కూరగాయలు సాగు చేయాలి
రైతులు పంట మార్పిడీ చేయాల్సిన అవసరం ఉన్నది. వరి ఒక్కటే పరిష్కారం కాదు. కందులు, పసుపు, మిరప పండించాలి
నాడు వరి సాగు చేయాలంటూ రైతులను రెచ్చగొట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సీఎం హోదాలో నాడు కేసీఆర్ చెప్పిన మాటలనే చెప్తున్నారు. నాడు తప్పనిపించిన మాటలే, నేడు ఆయనకు ఒప్పుగా కనిపిస్తున్నాయి. నాడు వరి సాగు చేయాలంటూ రైతులకు పిలుపునిచ్చిన నోటితోనే.. నేడు వరి సాగు వద్దంటూ పిలుపునిస్తున్నారు. అయితే దీనికి రేవంత్‌రెడ్డి ‘ప్రత్యామ్నాయ పంటల సాగు’ అంటూ కొత్త ట్యాగ్ తొడిగారు. ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలంటే రైతులు వరి సాగు తగ్గించాల్సిందే. వరి సాగు తగ్గించి కూరగాయలు, పప్పు పంటలు సాగు చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం కొనుగోలు చేయడం లేదు కాబట్టి వరి వద్దంటున్న రేవంత్‌రెడ్డి.. మరో సీజన్ గడిస్తే ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తారనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్లో రూ.10వేల కోట్లు ఖర్చు చేయలేరా? అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్లో రైతుల కోసం రూ.10-15 వేల కోట్లు కేటాయించి, ఖర్చు చేయలేదా? అని రైతులు నిలదీస్తున్నారు.