శివాలు తొక్కినా… చిందులు వేసినా.. బూతుల చిట్టా విప్పినా.. రేవంత్ సొంత జిల్లా రైతుల ప్రయోజనాలు గంగలో కలిపిన వాస్తవం ప్రజల ముందు సాక్ష్యాధారాలతో ఉన్నది. ఈ చారిత్రక ద్రోహానికి రేవంత్ అండ్ కో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!!
ఎందుకు ముఖ్యమంత్రి అంతలా ఉలిక్కిపడుతున్నడు? తేలుకుట్టిన దొంగలా ఎందుకు ఆగమాగమవుతున్నడు? సోయి తప్పి, స్థాయి మరచి ఎందుకు అరుస్తున్నడు? పట్టరాని ఫ్రస్ట్రేషన్‌తో ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నడు? విచక్షణ కోల్పోయి బూతుమాటల దాకా ఎందుకు పోతున్నడు? ఎందుకంటే.. కేసీఆర్‌కు రేవంత్ అడ్డంగా దొరికిపోయిండు! గుట్టు బయటపడింది.. జుట్టు చేతికి చిక్కింది! పాలమూరు-రంగారెడ్డిపై గురువు- శిష్యుడి గూడుపుఠాని బయటపడ్డది!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటినుంచే ఈ కుట్రల పరంపర మొదలైంది. తెలంగాణ ప్రాజెక్టులకు పచ్చి వ్యతిరేకి అయిన ఆంధ్రా అధికారిని ఇక్కడ సలహాదారుగా పెట్టుకున్నది. ఏకంగా 45 టీఎంసీల నీటివాటాను సమైక్య బాబుల ప్రాపకం కోసం వదిలేసుకుంటున్నది. ఏ నీరూ లేక పాలమూరులో పల్లె పల్లెలో పల్లేర్లు మొలిచాయో, ఆ జిల్లాను సస్యశ్యామలం చేయాల్సిన ప్రాజెక్టును పక్కకు పెట్టిన రేవంత్ సర్కార్.. కృష్ణాలో మన నీటిహక్కులకు నీళ్లొదిలేస్తున్నది. ఏపీ 200 టీఎంసీల గోదావరి జలాలు మళ్లించుకుపోతే.. అందుకు ప్రత్యామ్నాయంగా కృష్ణా నీటిలో తెలంగాణకు అదనపు వాటా ఇవ్వాలన్నది బచావత్ ట్రిబ్యునల్. అక్కడే బాబు అండ్ కో పన్నాగం పన్నింది. కృష్ణాలో అదనపు వాటా దక్కకుండా కుట్రలకు పదును పెట్టింది. పావులాంటి రేవంత్ సర్కార్.. ఆ చర్యలకు తలూపింది. మైనర్ అనుమతులు కోరడం ద్వారా పాలమూరు గొంతుకోసేలా.. పొరుగు రాష్ర్టానికి పదునుపెట్టిన గొడ్డలిని అందించింది.
ఈ ఘోరాల చిట్టా కేసీఆర్ చేతికందడంతో ఏపీతో రేవంత్ కుమ్మక్కును ఆధారాలతో బయట పెట్టారు. కేసీఆర్ లేవనెత్తింది మామూలు విషయం కాదు. బాబు మాయను, రేవంత్ బండారాన్ని ఏకకాలంలో నడిబజార్లో నగ్నంగా నిలబెట్టారు. అందుకే రేవంత్‌లో అంత అసహనం! అంతటి ఆక్రోశం!
బూతుల మాటున.. తీసిన గోతులు కనబడుతున్నయ్!
పాలమూరు డైవర్షన్‌కు పడుతున్న ఆపసోపాలు అగుపిస్తున్నయ్!
ఏపీ కడుతున్న నల్లమల ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రం ముందున్నది!
పనులు మొదలుపెట్టిన పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ వాపస్ వచ్చింది!
రేవంత్ సర్కారు రాసిన లేఖ ప్రజల కండ్లముందున్నది!.. రేపటి ఏపీ నీటి
దోపిడీకి ఇబ్బంది లేకుండా.. మరో 45 టీఎంసీలు ధారపోస్తున్న నిజమిది!

గత బీఆర్ఎస్ సర్కారుపై కక్షతోనో లేక కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుతంత్రంతోనో గానీ.. అధికారం చేపట్టిన నెల లోపే (2024, జనవరి 1న) రూ.5,600 కోట్లతో పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 8 లక్షల ఎకరాలకు (ఉమ్మడి రంగారెడ్డిలో ఐదు లక్షల ఎకరాలు) సాగునీటిని తరలించే కాలువల నిర్మాణ టెండర్లను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది.
టెండర్లను రద్దు చేసిన మూడు నెలల్లోపే పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌లో పేర్కొన్నట్టు 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ ఆదా వివరాలను పంపాలని 2024, మార్చిలో తెలంగాణకు సీడబ్ల్యూసీ లేఖ రాసింది.
ఈ క్రమంలోనే 2024, జూన్ 4న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది.
తెలంగాణ నీళ్లను కొల్లగొట్టేందుకు ఇదే అదునుగా భావించి.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఖరారైన మూడు రోజులకే చంద్రబాబు ప్రోద్బలంతో 2024 జూన్ 7న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా రేవంత్ సర్కారు నియమించింది.
2024, జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు హైదరాబాద్‌లో 2024, జూలై 6న భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి.
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లి మరీ 2024, సెప్టెంబర్ 12న ఏపీ సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు.
అడిగిన నెల తర్వాత అంటే 2024, మార్చిలో సీడబ్ల్యూసీ అడిగిన మైనర్ ఇరిగేషన్ ఆదా వివరాలను 2024, ఏప్రిల్‌లో రేవంత్ సర్కారు పంపింది.
తెలంగాణ ప్రభుత్వం పంపిన వివరాలు సరిగా లేవన్న కారణంతో 2024, డిసెంబర్లో పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపింది.
పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌లోని మైనర్ ఇరిగేషన్ ఆదా కింద పొందుపరిచిన 45 టీఎంసీలతో మాత్రమే అనుమతులు ఇవ్వాలని 2025, డిసెంబర్ 13న కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు.
గుట్టు రట్టయింది ! జుట్టు కేసీఆర్‌కు అందింది! కుట్ర బయటపడింది!
అది తెలిసే ఆగమాగమై రేవంత్‌రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరింది!
ఆ ఫ్రస్ట్రేషనే సీఎం నోట పిచ్చి మాటలు మాట్లాడిస్తున్నది!

పాలమూరు-రంగారెడ్డి పథకానికి 45 టీఎంసీలు చాలు అంటూ 2025, డిసెంబర్ 13న కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖ
(గుండాల కృష్ణ )
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తయినా, రెండేండ్లుగా ఎందుకు ముందుకుపోవడం లేదు? కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి శపథానికి పాలమూరు ప్రాజెక్టు సైతం బలైందా? అందులో భాగంగానే రెండేండ్ల క్రితం రూ.5 వేల కోట్ల కాలువల టెండర్లను రద్దు చేశారా? కేంద్ర జల సంఘం డీపీఆర్‌ను వెనక్కి పంపేదాకా కేంద్రం అడిగిన వివరాలు పంపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మొండికేసిందా? సాధారణంగా తెలంగాణ అనగానే రెండు కండ్ల సిద్ధాంతాన్ని బోధించే చంద్రబాబు ఇదే అదునుగా పాలమూరు ప్రాజెక్టుపై మూడో కన్ను తెరిచారా?
ఆ కుట్రల సెగల ఫలితంగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులో కీలకమైన పోలవరం మళ్లింపు 45 టీఎంసీల వాటాను వదులుకునేందుకు సిద్ధపడిందా? దీని ప్రభావం నల్లమల ప్రాజెక్టు ద్వారా ఏపీ తరలించబోయే 200 టీఎంసీల్లో తెలంగాణకు దక్కాల్సిన 112.50 టీఎంసీల వాటాపై పడనున్నదా? తెలంగాణ మొత్తంగా 157.50 టీఎంసీలపై హక్కులను కోల్పోనున్నదా? నిప్పులేనిదే పొగ రాదంటారు! సాక్షాత్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాయడంతో పొగ బయటికొచ్చింది. అంటే నిప్పు నిజమే కదా! మరి.. ఆ నిప్పును రాజేసిందెవరు? కృష్ణా జలాల్లో ఇప్పటికే తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కులతోపాటు భవిష్యత్తు ప్రయోజనాలకూ గండి కొట్టేందుకు పన్నిన కుట్రలేమిటి? ప్రస్తుతం తెలంగాణలో మంటలు రేపుతున్న అంశమిదే.
కేసీఆర్ ప్రభుత్వం 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు కోరుతూ గతంలోనే కేంద్రానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించింది. అందులో 45 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు మళ్లింపు వాటా ఉంటే, మరో 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ వాటాగా ఉన్నాయి. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీలు మాత్రమే విడుదల చేయాలని కోరింది. అంటే.. తెలంగాణకు హక్కుగా ఉన్న వాటాను తగ్గించుకున్నది. అంతేకాదు పోలవరం వాటా కింద ఉన్న 45 టీఎంసీలను అడగకుండా, మైనర్ ఇరిగేషన్ వాటా కింద వచ్చే 45 టీఎంసీలు చాలని అంటున్నది. అంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటి వాటాను గాలికి వదిలేసింది. ఒకవైపు కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణా జలాల్లో పోలవరం మళ్లింపు వాటా నీటిని రెండేండ్లుగా వాడుకుంటున్నాయి. వాటిలాగే మాకూ ఆ వాటా నీటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. అసలు ఆ ఊసే ఎత్తడం లేదు.
పోలవరం మళ్లింపు 45 టీఎంసీల వాటాపై కేంద్ర జలసంఘం అభ్యంతరాలు లేవనెత్తకున్నా రేవంత్ ప్రభుత్వం కేవలం మైనర్ ఇరిగేషన్ వాటాకే పరిమితం కావడమే తెరవెనుక కుట్రలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు గెలుపు ఖాయమైన మరుక్షణం నుంచి తెలంగాణ సాగునీటి రంగంలో చోటుచేసుకున్న పరిణామాలన్నీ ‘పాలమూరు’ నీటిహక్కుల తాకట్టు సమాధికి పేర్చిన ఇటుకల్లా కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ మళ్లీ విషవలయం అలముకుంటున్నది. కృష్ణా జలాల్లో 700 టీఎంసీల వాటా నీటిని సాధిస్తామంటూ నిత్యం మీడియా ముందు ప్రకటనలు చేస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా బచావత్ ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించే 45 టీఎంసీల వాటాను వదులుకుంటామంటూ లేఖలో పరోక్షంగా సంకేతాలివ్వడమే ‘చంద్రబాబు జిమ్మిక్కులు.. రేవంత్ ప్రభుత్వ కుమ్మక్కు’లకు పరాకాష్ఠగా సాగునీటిరంగ నిపుణులు విమర్శిస్తున్నారు. రెండు ప్రభుత్వాల కుట్రలతో విలవిల్లాడుతున్న ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టు ఇప్పుడు సగం హక్కులను కోల్పోతూ నిస్సహాయంగా రోదిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్‌లో 80 టీఎంసీల గోదావరి జలాలను ఇతర బేసిన్‌కు తరలించి వాడుకునేలా పోలవరం ప్రాజెక్టును దాదాపు ఆరున్నర దశాబ్దాల క్రితం డిజైన్ చేశారు. ఒక బేసిన్ నీటిని ఇంకో బేసిన్‌కు తరలించి వాడుకోవడంపై అప్పట్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీంతో బచావత్ ట్రిబ్యునల్ ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించింది. 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోని సాగర్, దిగువన వాడుకుంటున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ర్టాలకు కృష్ణా జలాల్లో 80 టీఎంసీలు అదనపు వాటాగా దక్కుతాయని ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు పనులు మొదలైన రోజు నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినపుడు కూడా ఇదే విధానం అమలమవుతుందని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో తెలంగాణ ఏర్పడిన సమయంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్రం చేపట్టింది.
బచావత్ ట్రిబ్యునల్ చెప్పినట్టు 80 టీఎంసీల్లో తమ వాటాగా వచ్చిన నీటిని కర్ణాటక 21 టీఎంసీలు, మహారాష్ట్ర 14 టీఎంసీలను వాడుకోవడం మొదలుపెట్టాయి. బచావత్ ట్రిబ్యునల్ సమయంలో తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా లేదు. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు మొదలైన సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నది. ఆ మేరకు న్యాయబద్ధంగా 80 టీఎంసీల్లో మిగిలిన 45 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆ 45 టీఎంసీల నీటిని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. చెరువుల నీటి వినియోగంలో పొదుపు ద్వారా వచ్చిన మరో 45 టీఎంసీల నీటిని జోడించి మొత్తం 90 టీఎంసీలకు డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపింది. అనంతరం కేంద్ర జలసంఘం డీపీఆర్ పరిశీలన ప్రక్రియను కొనసాగిస్తూనే అందులో భాగంగా ఏడు రకాల అనుమతులను కూడా ఇచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన పాలమూరు జిల్లాను గట్టున పడేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టింది. తక్కువ సమయంలోనే 90 శాతం వరకు పనులను పూర్తిచేసింది. బీడు భూములకు సాగునీరు అందించే కాలువల నిర్మాణాన్ని రూ.5 వేల కోట్లతో చేపట్టేందుకు టెండర్లను కూడా పూర్తిచేసింది. కానీ ఈలోగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కుట్రలు మొదలయ్యాయి. రెండేండ్ల నుంచి జరిగిన పరిణామాలను గమనిస్తే ఇది అర్థం అవుతుంది.

రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం వద్ద పెండింగులో ఉన్న అంశాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 13న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాశారు. అందులో మొదటి అంశంగానే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రస్తావించారు. గతంలో 90 టీఎంసీల కోసం పంపిన ఈ ప్రాజెక్టులో మైనర్ ఇరిగేషన్ వాటా కింద ఉన్న 45 టీఎంసీలతో మొదటి విడత అనుమతులు ఇవ్వాలని కోరారు. అంటే ప్రాజెక్టు సామర్థ్యాన్ని సగం తగ్గించి అనుమతులు కోరారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్‌లో రాసిన లేఖలో మైనర్ ఇరిగేషన్ వాటా 45 టీఎంసీలకు సంబంధించిన వివరాలను మాత్రమే కోరింది. అంతేతప్ప పోలవరం మళ్లింపు వాటా 45 టీఎంసీలపై కేంద్ర జలసంఘం ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. ఒకవేళ కేంద్రానికి అభ్యంతరాలు ఉన్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఆ మేరకు రాష్ర్టానికి లేఖలు రాసేది.
చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా ఆ అభ్యంతరాలను వ్యక్తంచేసేది. కానీ ఏనాడూ పోలవరం మళ్లింపు వాటాపై కేంద్రం నుంచి ఎలాంటి కొర్రీలు రాలేదు. దీంతో మైనర్ ఇరిగేషన్ వాటా కింద 45 టీఎంసీలతోపాటు పోలవరం మళ్లింపు వాటా 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల మేర అనుమతుల కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కానీ అనూహ్యంగా 45 టీఎంసీల పోలవరం వాటాను వదులుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. మళ్లింపు వాటా విషయంలో ఒకవేళ కేంద్రం ఏమైనా కొర్రీలు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఎదురు ప్రశ్నించాలి. కర్ణాటక, మహారాష్ట్ర అనుభవిస్తున్న వాటాను మాకెందుకు ఇవ్వరు? అని నిలదీయాలి. అవసరమైతే ఆలోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి. కానీ కేంద్రం ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తకున్నా… పోలవరం మళ్లింపు వాటా కింద 45 టీఎంసీలను వదులుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధం కావడాన్ని బట్టి ‘దాల్మే కుచ్ కాలాహై!’ అనేది సుస్పష్టం అని నిపుణులు అనుమానిస్తున్నారు.
చంద్రబాబు తిప్పిన చక్రం తెలంగాణకు రెండు విధాలా శరాఘాతంగా మారింది. ఒకవైపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయింపుల్లోని 45 టీఎంసీల పోలవరం మళ్లింపు వాటాను వదులుకోవడంతో కృష్ణాజలాల్లో తెలంగాణకు రావాల్సిన అదనపు వాటాకు గండి పడినట్టయింది. చంద్రబాబు-రేవంత్ ప్రభుత్వాలు కుమ్మక్కవడంతో భవిష్యత్తులోనూ తెలంగాణ ప్రయోజనాలకు మరో భారీ విఘాతం కలిగే ముప్పు కూడా పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చింది మొదలు 200 టీఎంసీల గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు చంద్రబాబు భారీ కుట్రలకు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఆసరాగా చేసుకొని తొలుత బనకచర్ల, తాజాగా నల్లమల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వీటిని అడ్డుకోవాల్సిన రేవంత్ ప్రభుత్వం పీపీటీలు, అఖిలపక్ష సమావేశాలంటూ కాలయాపన చేసి చివరకు ఢిల్లీకి వెళ్లి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సంతకాలు పెట్టి మరీ వచ్చింది. చేయిదాటిపోయిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయినా చంద్రబాబు పట్టువదలడం లేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా 200 టీఎంసీల గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించుకుపోతే ఆ మేరకు కృష్ణా జలాల్లో ఎగువ రాష్ర్టాలకు అదనపు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. నల్లమల ప్రాజెక్టు పనులు మొదలుకాగానే ఎగువ రాష్ర్టాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఆ వాటాను వాడుకునే హక్కు వస్తుంది. కానీ ఇప్పుడు పోలవరం మళ్లింపు వాటా వినియోగం అనేది కేవలం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో పరోక్షంగా 45 టీఎంసీలను వదులుకుంటున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసింది. అంటే భవిష్యత్తులో చంద్రబాబు, ఏపీ ప్రభుత్వానికి ఇదే అస్త్రంగా మారనున్నది. తెలంగాణకు పోలవరం మళ్లింపులోలేని వాటా హక్కు.. నల్లమల ప్రాజెక్టులో ఎలా అమలవుతుందని అభ్యంతరం వ్యక్తం చేసేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. దీంతో 200 టీఎంసీల్లో తెలంగాణకు దక్కాల్సిన 112.50 టీఎంసీల కృష్ణాజలాల హక్కు కూడా దక్కకుండా పోతుంది.

జల్‌శక్తి కార్యదర్శికి మంత్రి ఉత్తమ్ రాసిన లేఖ
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న రేవంత్.. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరొస్తుందనే అక్కసుతో రెండేండ్లుగా పనులను అటకెక్కించారు. రూ.5 వేల కోట్ల టెండర్లను రద్దు చేసి, తిరిగి పిలువనేలేదు. పైగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న 5 లక్షల ఎకరాల ఆయకట్టును ఆ ప్రాజెక్టు నుంచి తొలగించారు. అందులో 2 లక్షల ఎకరాల కోసం కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. రెండేండ్లయినా ఇప్పటికీ అది సర్వే దశలోనే ఉన్నది. మిగతా 3 లక్షల ఎకరాలకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించి గోదావరి జలాలను అందిస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అంటే పాలమూరు ప్రాజెక్టును కకావికలం చేశారు.
ఆది నుంచి ఈ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ వస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఇది కలిసొచ్చింది. ముందుగానే ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ సలహాదారుగా నియమించేలా చేసి తెలంగాణ ప్రాజెక్టులను పరిశీలిస్తున్న చంద్రబాబు.. ఏపీ ప్రయోజనాల కోసం మరో భారీ స్కెచ్ వేశారు. ఇందుకోసం ఏకంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కృష్ణా జలాల్లో దక్కాల్సిన 45 టీఎంసీల పోలవరం మళ్లింపు వాటాకే ఎసరు పెట్టారని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోలవరం మళ్లింపు వాటాను వదులుకునేందుకు సిద్ధమైందని అంటున్నారు.