రామగిరి, ఏప్రిల్ 11 : ప్రజలకు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతుబంధు, రుణమాఫీ అందజేస్తామని ప్రకటించారు. గురువారం రంజాన్ సందర్భంగా నల్లగొండలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గాకు వెళ్లి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘవీర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూస్తే కుల, మతాల ఘర్షణలు పెట్టి బీజేపీ మళ్లీ ఆధికారంలోకి రావాలని చూస్తున్నదని ఆరోపించారు. రాబోయే పదేండ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని, రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు.