హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): గోదావరి జలాలను పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగబోదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రం ప్రభుత్వం ఏపీకి మద్దతుగా ఉంటుందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుకు ఒకరి అవసరం మరొకరికి ఉందని పేర్కొన్నారు. కాబట్టి ప్రస్తుత అనుమతుల నిరాకరణ తాత్కాలికమేనని, మళ్లీ అనుమతులు వస్తాయని అనుమానం వ్యక్తంచేశారు.
మంగళవారం పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రజాభవన్‌లో బనకచర్ల నిర్మిస్తే తెలంగాణకు కలిగే నష్టంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు జలాల లెక్క తేలాలంటే ఇరు రాష్ర్టాలు చర్చించుకోవాలని పేర్కొన్నారు. ఒకవైపు నుంచి వెళితే సమస్య పరిష్కారం కాదని, చర్చలతోనే పరిష్కారమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచించారు. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, స్పీకర్‌కు లేఖ రాయాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సూచించారు.