హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): బనకచర్ల ప్రాజెక్టుపై, గోదావరి నదీజలాల వినియోగంపై సీఎం రేవంత్రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.. అని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రెడ్డి స్పష్టంచేశారు. గోదావరిపై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఏపీ సర్కారు కుట్రపూరితంగా బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నదని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రజలకేదో నిజాలు తెలియజేయడానికి, ఆంధ్రా ప్రభుత్వ కుట్రలు బట్టబయలు చేయడానికి పెట్టినట్టుగా లేదని, అది సీఎం, మంత్రులు, అధికారుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
తాను నల్లమల అడవుల్లో పుట్టినట్టుగా తొడలు కొట్టుకున్న రేవంత్రెడ్డి.. ఆ నల్లమల అడవి తెలంగాణ కిందకు వస్తదా? రాయలసీమ కిందకు వస్తదా? అం టూ కనీసం అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. పిల్లల మాదిరి సందేహాలు అడుగుతూ రేవంత్రెడ్డి అభాసుపాలు అయ్యారని దు య్యబట్టారు. వాళ్లకు సాగునీటి ప్రాజెక్టుల మీద అవగాహన కావాలన్నా.. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం తెలియలన్నా, బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు వాటిల్లే నష్టం తెలియాలన్నా.. బీఆర్ఎస్ భవన్లో ఒక వారం కేసీఆర్ చేత శిక్షణ తరగతులు తీసుకుంటే మంచిదని హితవు పలికారు. అప్పుడే కాంగ్రెస్ వాళ్లకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు.