Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టడానికి మహారాష్ట్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పించాలని మొన్న సీఎం అంటారు. మరి 150 మీటర్లకు అప్పుడే అగ్రిమెంట్ జరిగిందని మంత్రి వివేక్ అంటున్నాడు కదా. అగ్రిమెంట్ జరిగి ఉంటే మళ్లీ మహారాష్ట్రను ఒప్పించడం ఎందుకు అని ప్రశ్నించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు వారితో చర్చించి, మెప్పించి మన ప్రయోజనాలు కాపాడుకోవాలి కానీ రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే తీరుతో కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా అని నిలదీశారు.
150మీటర్ల ఎత్తుకు బ్యారేజీ కట్టేందుకు మహారాష్ట్రను ఒప్పియ్యాలని కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయ్యిందని మంత్రి వివేక్ అంటున్నాడని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలోనే అగ్రిమెంట్ అయితే కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి ఎందుకు లేఖ రాసిండని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని అన్నారు. స్టేట్స్మెన్లా విజ్ఞతతో రేవంత్ రెడ్డి ప్రవర్తించడం లేదని విమర్శించారు. రాజకీయాల కోసం తప్ప.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం లేదని అన్నారు. కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే అగ్రిమెంట్ అవుతుందా అని మండిపడ్డారు.
తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ కట్టుకుంటామని బీఆర్ఎస్ హయాంలో మహారాష్ట్రకు వెళ్లి బతిమిలాడినామని హరీశ్‌రావు తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత మీరు బహిరంగ లేఖ రాస్తున్నది మీరు.. ఇది ఒక రాష్ట్రాన్ని ఒప్పించే పద్దతి కానే కాదని అన్నారు. మహారాష్ట్ర, ఏపీ, ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తమ్మిడిహట్టి వద్ద ఒప్పించలేకపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేకనే మూడుచోట్ల అధికారంలో ఉన్నా ఒప్పించలేకపోయారని విమర్శించారు. ఏడున్నరేండ్లు వృథా చేసిండ్రు అని అన్నారు. దీంతో రూ.17వేల కోట్లు ఉన్న ప్రాజెక్టు ఖర్చు రూ.40వేల కోట్లకు పెరిగిందని అన్నారు. సర్వ అధికారాలు ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు.. ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
నాలుగేళ్లలో ప్రాణహితను పూర్తి చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు తట్టెడు మట్టి తీయలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. తమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి ఎత్తకుండానే సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట రూ.2382 కోట్లు బిల్లులు లేపిండ్రని విమర్శించారు. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడటమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని వ్యాఖ్యానించారు.