హైదరాబాద్ మే 19 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. ఏనాడూ కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేవు.. ఎవరి తరం కాదు.. ఆయన కట్టిన అద్భుతమైన కట్టడాలనే అందాలభామలకు చూపించడం.. వారు అబ్బురపడటమే ఇందుకు సజీవ సాక్ష్యం..’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్’ అనే విషయం మరోసారి ప్రపంచానికి తెలిసిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి పిచ్చి ప్రేలాపనలు, దిగజారుడు మాటలు మానుకొని పాలనపై, హామీల అమలుపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. కేసీఆర్ పాలనలో సకల హంగులతో నిర్మించిన సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట ఆలయాన్ని చూసి ప్రపంచ సుందరీమణులు ఆశ్చర్యపోయారని, సెల్ఫీలు తీసుకొని సంబురపడ్డారని సోమవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కాదని రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం అయిందనుకుంటా అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ నిర్మించిన అమరవీరుల స్మారకజ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ మహావిగ్రహం, ఐటీ హబ్‌లను కూడా మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లకు చూపించి చెప్పిన తప్పుడు మాటలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ నిర్మించిన కట్టడాలతోపాటు రాచరిక పోకడల పేరిట తెలంగాణ చిహ్నం నుంచి తొలగించిన చార్మినార్, కాకతీయ కళావైభవాలే మిస్ వరల్డ్ పోటీదారులకు చూపించేందుకు దిక్కయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని, అప్పు పుట్టడంలేదని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. అందాల పోటీల పేరిట రూ.వేల కోట్లు ఎందుకు దుబారా చేస్తున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్ష, తులం బంగారం ఇవ్వడం చేతగాని ఆయన ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు రేవంత్ గుర్తులను శాశ్వతంగా చెరిపేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తానని బీరాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కట్టిన కట్టడాలే ప్రపంచ సుందరీమణులకు చూపించేందుకు దిక్కయ్యాయని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అందాలభామలను తీసుకొచ్చిన కంట్రోల్ కమాండ్ సెంటర్, సెక్రటేరియట్, టీ-హబ్ ఎవరి ఆనవాళ్లని ప్రశ్నించారు. ఇప్పుడు మీ గౌరవాన్ని, పరువును కాపాడింది కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.